ఆఖరి ఛాన్స్‌.. దక్కేనా.?

గౌతమ్‌ గంభీర్‌.. అతి తక్కువ కాలంలోనే, టీమిండియాలో సూపర్‌ పాపులర్‌ అయిన క్రికెటర్‌. అనూహ్యంగా జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియా రాజకీయాలకు గంభీర్‌ బలైపోయాడన్నది నిర్వివాదాంశం. సెహ్వాగ్‌, గంభీర్‌లది పెర్‌ఫెక్ట్‌ ఓపెనింగ్‌ జోడీ. కానీ,…

గౌతమ్‌ గంభీర్‌.. అతి తక్కువ కాలంలోనే, టీమిండియాలో సూపర్‌ పాపులర్‌ అయిన క్రికెటర్‌. అనూహ్యంగా జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియా రాజకీయాలకు గంభీర్‌ బలైపోయాడన్నది నిర్వివాదాంశం. సెహ్వాగ్‌, గంభీర్‌లది పెర్‌ఫెక్ట్‌ ఓపెనింగ్‌ జోడీ. కానీ, ఇద్దరూ అనూహ్యంగా జట్టులోంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక, జట్టులోకి తిరిగొచ్చే అవకాశం లేక సెహ్వాగ్‌, క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు. గంభీర్‌ మాత్రం, మరో అవకాశం కోసం ఎదురుచూస్తూనే వున్నాడు. 

మొన్నటికి మొన్న, జట్టులో స్థానం దక్కుతుందని ఆశించి, భంగపడ్డ గంభీర్‌.. అంత నిరాశలోనూ, ఖచ్చితంగా తనకు ఏదో ఒక రోజు టీమిండియాలో చోటు దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. కాలం కలిసొచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో లోకేష్‌ రాహుల్‌ గాయపడ్డంతో, గంభీర్‌కి పిలుపు వచ్చింది. అయితే, దానికి ముందుగా గంభీర్‌ ఫిట్‌నెస్‌ పరీక్షను ఎదుర్కోవాల్సి వుంటుంది. 

స్పిన్‌ బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కోగల అతి కొద్దిమంది స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌లలో గంభీర్‌ ఒకడు. అయినాసరే, టీమిండియా గంభీర్‌ని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. ఒకటి రెండు వైఫల్యాలతోనే గంభీర్‌ని పూర్తిగా దూరం పెట్టేశారు సెలక్టర్లు. ఇప్పుడు ఒకవేళ న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కి గంభీర్‌ ఎంపికైనా, ఒక్క మ్యాచ్‌లోనే అతని నుంచి అద్భుతాలు ఆశించేయడం ఖాయం. కానీ, ఆ అద్భుతాలు అతని నుంచి ఆ ఒక్క మ్యాచ్‌లోనే సాధ్యమవుతాయా.? 

ఇదిలా వుంటే, రిటైర్‌మెంట్‌కి ముందు గంభీర్‌కి ఒకే ఒక్క ఛాన్స్‌ ఇస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. గంభీర్‌ మాత్రం, ఆత్మవిశ్వాసమే కొండంత బలంగా, జట్టులో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నాననీ, ఛాన్స్‌ వస్తే సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నాడు. చూద్దాం.. గంభీర్‌కి ఛాన్స్‌ దక్కుతుందా.? దక్కితే దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా.? ఇంకొన్నాళ్ళు గంభీర్‌, టీమిండియా తరఫున ఆడతాడా.? త్వరలో తేలిపోనుంది.