యాషెస్‌ నాలుగో టెస్ట్‌.. చెలరేగిన ఇంగ్లాండ్‌.!

యాషెస్‌ సిరీస్‌ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనది. చివరి బంతి దాకా ఉత్కంఠ నెలకొనే మ్యాచ్‌లు యాషెస్‌ ప్రత్యేకత. చాలా తక్కువ సందర్భాల్లోనే 'వన్‌సైడెడ్‌' మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా.. క్రికెట్‌ చరిత్రలో దాయాది దేశాలుగా…

యాషెస్‌ సిరీస్‌ అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనది. చివరి బంతి దాకా ఉత్కంఠ నెలకొనే మ్యాచ్‌లు యాషెస్‌ ప్రత్యేకత. చాలా తక్కువ సందర్భాల్లోనే 'వన్‌సైడెడ్‌' మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా.. క్రికెట్‌ చరిత్రలో దాయాది దేశాలుగా గుర్తింపు పొందిన విషయం విదితమే. ఆ రెండు జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఎవరు ఎప్పుడు గెలిచినా, ప్రతి గెలుపూ సంచలనమే అవుతుంది.

తాజాగా యాషెస్‌ సిరీస్‌ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాని కోలుకోలేని దెబ్బ తీసింది ఇంగ్లాండ్‌. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో వున్న ఇంగ్లాండ్‌, నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాని రెండంకెల స్కోర్‌కే పరిమితం చేసింది. అది కూడా 60 పరుగులకే ఆస్ట్రేలియాని ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ చేయడం గమనార్హం.

ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 9.3 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. మార్క్‌ వుడ్‌, స్టీఫెన్‌ సన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌, చివరి వికెట్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ పడగొట్టడం గమనార్హం. కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌తోపాటు, మిచెల్‌ జాన్సన్‌ మాత్రమే రెండంకెల స్కోర్‌ సాధించగలిగారు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌లో టాప్‌ ఫోర్‌ బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు డకౌట్‌ కావడం మరో విశేషం.