అయ్యోపాపం అనుష్క.!

‘అనుష్కది ఐరన్‌ లెగ్‌.. ఆమె లెగ్‌ ఎఫెక్ట్‌ పుణ్యమా అని గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది..’ అంటూ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మపై సోషల్‌ నెట్‌ వర్క్‌ వేదికగా ట్వీట్‌లు, కామెంట్లు పోస్ట్‌ అవుతున్నాయి. …

‘అనుష్కది ఐరన్‌ లెగ్‌.. ఆమె లెగ్‌ ఎఫెక్ట్‌ పుణ్యమా అని గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది..’ అంటూ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మపై సోషల్‌ నెట్‌ వర్క్‌ వేదికగా ట్వీట్‌లు, కామెంట్లు పోస్ట్‌ అవుతున్నాయి. 

అందరికీ తెల్సిన విషయమే అనుష్క, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీకి గర్ల్‌ ఫ్రెండ్‌ అని. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లన్నిటికీ దూరంగా వున్న అనుష్క, సెమీస్‌ మ్యాచ్‌ని చూసేందుకు ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళింది. సెమీస్‌ మ్యాచ్‌ని తిలకించింది కూడా. మైదానంలో కోహ్లీ, అనుష్కకి ‘బ్యాట్‌ చూపించి’ (అనగా సెంచరీ కొట్టి..) టీమిండియాని గట్టెక్కిస్తాడనుకుంటే.. అనుష్క ఐరన్‌ లెగ్‌ పుణ్యమా అని, సింగిల్‌ డిజిట్‌కే.. అదీ ఒక్క పరుగుకే పెవిలియన్‌ బాట పట్టాడంటూ అనుష్క మీద ఫాన్స్ గుర్రు గా వున్నారు. 

మహామహులైన క్రికెటర్లకే గర్ల్‌ఫ్రెండ్స్‌ ఎఫెక్ట్‌ గట్టిగా తగిలేసింది. సంగీతా బిజిలానీ పుణ్యమా అని అజారుద్దీన్‌ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. అంతకుముందువరకు అజారుద్దీన్‌ సాధించిన విజయాల సంగతెలా వున్నా, ఒక్క మ్యాచ్‌ పరాజయం దెబ్బతో, అంతా సంగీతా బిజిలానీ ఐరన్‌ లెగ్‌ ఎఫెక్ట్‌.. అనేశారు. ఇప్పుడు అనుష్క పరిస్థితీ అలానే తయారయ్యింది.

వరల్డ్‌ కప్‌లో కోహ్లీ గట్టిగా ఆడింది పాకిస్తాన్‌ మ్యాచ్‌లో మాత్రమే. ఛేజింగ్‌ కింగ్‌.. అనే మాట అతనికి సరిగ్గా సూటవుతుంది గనుక, సిడ్నీలో ఛేజింగ్‌ చేసేసి, టీమిండియాని కోహ్లీ గెలిపించేస్తాడని చాలామంది నమ్మారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ లక్‌ అనేది కలిసిరాదు కదా. అలాగే కోహ్లీకి ఈ రోజు లక్‌ కలిసి రాలేదు. దానికి అతని గర్ల్‌ఫ్రెండ్‌ అనుష్కని ఎలా బాధ్యులం చేయగలమన్నది కోహ్లీ, అనుష్క సపోర్టర్స్‌ వాదన.

కారణమేదైనా, అనుష్క సిడ్నీ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించి వుండకపోతే ఈ పుకార్లకు అవకాశమే వుండేది కాదు.