సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటికి పయనం కానుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఫెయిలై, ఇంటిదారి పట్టింది. వరల్డ్ కప్ సెమీస్‌లో ఓటమి ద్వారా 11 వరుస విజయాల పరంపరకు టీమిండియా బ్రేక్ వేసుకుంది.
ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌కి చేరలేకపోయినా, అంచనాలకు మించి రాణించిందన్నది కాదనలేని వాస్తవం. వరల్డ్ కప్‌కి ముందు టీమిండియా ఫామ్‌ని చూసి ఎవరైనా, ఈ జట్టు క్వార్టర్స్‌ని దాటడం కష్టమనుకున్నారు. సరైన బౌలర్ లేకపోవడం టీమిండియాకి ప్రధాన లోపం. అయినప్పటికీ, లోపాల్ని సరిదిద్దుకుని టీమిండియా, అంచనాల్ని మించిన విజయాల్ని అందుకుంది.
ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా డిఫెండింగ్ ఛాంపియన్, ఈసారీ కప్ గెలుచుకునే అవకాశం లేకపోలేదన్న సంకేతాల్ని పంపింది. కానీ, సెమీస్‌లో టీమిండియా తడబాటు ప్రదర్శించింది. బౌలింగ్ పేలవంగా సాగితే, బ్యాటింగ్ ఇంకా దారుణంగా సాగింది. వెరసి, వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా పరాజయం పాలయ్యింది.
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, టెయిల్ ఎండర్స్.. ఇలా అందరూ వైఫల్యం చెందడంతో 329 పరుగుల టార్గెట్‌ని ఛేదించే క్రమంలో 250 పరుగులు చేయలేక చతికిలపడింది టీమిండియా. ధోనీ తప్ప ఇంకెవరూ అర్థ సెంచరీ కూడా చేయలేకపోవడం టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని చెప్పకనే చెబుతుంది. ధోనీ, జడేజా రనౌట్స్ చూస్తే.. మ్యాచ్ ముగించేయడానికి భారత బ్యాట్స్‌మెన్ ఎంత తొందరపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
ఏదిఏమైనా కప్ గెలవలేకపోయాం.. అన్న బాధను పక్కన పెడితే, టీమిండియా ఈ వరల్డ్ కప్‌లో అంచనాల్ని మించి రాణించిందని చెప్పక తప్పదు.