ఫైనల్లో కివీస్‌ వర్సెస్‌ ఆసీస్‌

ఆతిథ్య దేశాల్లో ఎవరో ఒకరు వరల్డ్‌ కప్‌ సాధించడం ఖాయమైపోయింది. అయితే వరల్డ్‌ కప్‌ ఆల్రెడీ గతంలో పలుమార్లు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకి ఈసారీ దక్కతుందా.? లేదంటే ఇప్పటిదాకా వరల్డ్‌ కప్‌ టైటిల్‌ గెలవని…

ఆతిథ్య దేశాల్లో ఎవరో ఒకరు వరల్డ్‌ కప్‌ సాధించడం ఖాయమైపోయింది. అయితే వరల్డ్‌ కప్‌ ఆల్రెడీ గతంలో పలుమార్లు సొంతం చేసుకున్న ఆస్ట్రేలియాకి ఈసారీ దక్కతుందా.? లేదంటే ఇప్పటిదాకా వరల్డ్‌ కప్‌ టైటిల్‌ గెలవని న్యూజిలాండ్‌, ఈసారి వరల్డ్‌ కప్‌ని సొంతం చేసుకుంటుందా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న.

సౌతాఫ్రికాపై సెమీస్‌లో గెలిచి న్యూజిలాండ్‌ ఫైనల్‌కి చేరితే, టీమిండియాపై గెలిచి ఆసీస్‌ ఫైనల్‌లో అడుగు పెట్టింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ 2015 వరల్డ్‌ కప్‌ పోటీలకు ఆతిథ్యం ఇస్తోన్న విషయం విదితమే.

ఇక, బలాబలాల విషయానికొస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సమ ఉజ్జీలుగా వున్నాయి. కాస్తో కూస్తో న్యూజిలాండ్‌ బలంగా వుందని చెప్పొచ్చు ఆస్ట్రేలియాకన్నా. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాని న్యూజిలాండ్‌ ఓడించింది కూడా. అయితే ఆ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ అయిన ఆస్ట్రేలియా, అంత సునాయాసంగా న్యూజిలాండ్‌కి విజయాన్ని ఇవ్వలేదు.

ఆస్ట్రేలియా – న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌట్‌ కాగా, కేవలం ఒక్క వికెట్‌ తేడాతో మాత్రమే న్యూజిలాండ్‌ విజయం సాధించగలిగింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన పోరాటం.. ఈ వరల్డ్‌కప్‌లోనే హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మరి లీగ్‌ దశలోనే ఆసీస్‌, కివీస్‌ ఓ రేంజ్‌లో పోటాపోటీగా తలపడితే, ఫైనల్‌లో ఆ రెండు జట్ల మధ్య పోటీ ఇంకే రేంజ్‌లో వుంటుందో ఊహించుకోవడమే కష్టం.