స్వదేశంలో కాదు.. అవతల ప్రత్యర్థి శ్రీలంక కూడా కాదు.. స్వదేశీ పులి.. అనే రికార్డు టీమిండియాకు ఇప్పటిది కాదు. అజరుద్ధీన్ పిరియడ్ నుంచినే టీమిండియా స్వదేశీ పులి… విదేశీ పిల్లిగా సాగుతోంది. ఈ విషయంలో కొంతలో కొంత బెటర్ మెంట్ ఉన్నా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల.. ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై మనోళ్ల ఆటలు సాగడం లేదు.
కెప్టెన్ గా ధోనీ ఉన్నా.. కొహ్లీ ఉన్నా.. పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. విదేశీ పిచ్ లపై మన బౌలర్లు ఎంతో కొంత మేర రాణిస్తున్నా.. బ్యాటింగ్ విభాగం మాత్రం పేలవంగానే సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. నిన్న మొన్నటి వరకూ వీరుడు, శూరుడు.. అరవీర భయంకరుడు అనిపించుకున్న విరాట్ కొహ్లీకి కూడా ఇప్పుడు కాక మొదలైంది. గత రెండేళ్ల నుంచి శ్రీలంక, వెస్టిండీస్ లను మినహాయిస్తే.. మరే విదేశంలోనూ టీమిండియా సరైన టెస్టు సీరిస్ ఆడలేదు.
దీంతో విరాట్ కొహ్లీ కెప్టెన్సీకి ప్రశంసలు.. కితాబులే తప్ప.. వేరే చర్చలేకుండా సాగింది. అయితే రెండేళ్ల హనీమూన్ పిరియడ్ ముగిసి.. ఇప్పుడు టీమిండియా దక్షిణాఫ్రికాలో ఆడుతోంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 207పరుగుల రన్స్ ను చేజ్ చేయలేక టీమిండియా బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేసిన తీరు.. సీరిస్ అంతా ఎలా జరగబోతోందో అర్థమయ్యేలా చేసింది. ఇక రెండో టెస్టు విషయంలో టీమ్ ఎంపిక తీరు విరాట్ కొహ్లీపై విమర్శల వానను పెంచింది.
ఇక దక్షిణాఫ్రికాలో మనోళ్ల రాణింపుపై ఎవరికీ ఆశల్లేవు. ఇదే సమయంలో.. కొహ్లీ పై మాజీలు స్వరం పెంచారు. ఫస్ట్ టెస్టులో అట్టర్ ఫ్లాఫ్ అయిన… ధావన్ ను పక్కన పెట్టడం బాగానే ఉంది కానీ.. భువనేశ్వర్ కుమార్ ను తప్పించడంపై అనేక మంది భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో అయితే.. క్రికెట్ ఫ్యాన్స్ కొహ్లీతో ఆడేసుకుంటున్నారు. తొలి టెస్టులో భువీ అద్భుతంగా బౌల్ చేశాడు.
అంతే కాదు.. మిగతా వీరాధివీర బ్యాట్స్ మన్ల కన్నా భువీ బాగా బ్యాటింగ్ కూడా చేశాడు. ఇప్పుడే కాదు.. గత ఏడాది నుంచి టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది భువనేశ్వర్ మాత్రమే. అలాంటి భువీని తప్పించడంపై విరాట్ పై విమర్శల వాన చెలరేగుతోంది. తొలి టెస్టులో భువీ బ్యాటింగును చూసి విరాట్ కుళ్లుకున్నాడు.. అందుకే తప్పించాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెండో టెస్టుకు భువీని తప్పించడం అంటే.. అది నోట్ల రద్దు కన్నా దారుణమైన నిర్ణయం అని నెటిజన్లు పంచ్ లు వేస్తున్నారు. ఇక వీటికి తోడు సెహ్వాగ్ మరో అడుగు ముందుకు వేశాడు.
భువీని తప్పించడమనే విరాట్ నిర్ణయాన్ని సెహ్వాగ్ తీవ్రంగా ఆక్షేపించాడు. అదో తలతిక్క నిర్ణయంగా అభివర్ణించాడు. అంతే కాదు.. రెండో టెస్టులో బ్యాటింగ్ లో ఫెయిలయితే విరాట్ జట్టు నుంచి తనను తాను తప్పించుకోవాలని కూడా వీరూ ఘాటు సలహా ఇచ్చాడు. మొత్తానికి విరాట్ కొహ్లీకి ఇప్పుడే కాక మొదలైందని స్పష్టం అవుతోంది. విదేశంలో ఇతడి సత్తాకు అసలు పరీక్ష ఎదురవుతోంది. ఇప్పుడు నిరూపించుకుంటేనే.. కొహ్లీ సూపర్ స్టార్ లేకపోతే.. కొహ్లీ కూడా జస్ట్ ఒక సాధారణ ఆటగాడు మాత్రమే అవుతాడు.