కొత్త కుర్రాడు అదరగొట్టాడు

కెరీర్‌లో తొలి టెస్ట్‌ ఆడిన లోకేష్‌ రాహుల్‌ నిరాశపర్చాడు. అయితేనేం, రెండో టెస్ట్‌లో అదరగొట్టాడు. కర్నాటకకు చెందిన లోకేస్‌ రాహుల్‌పై సెలక్టర్లు చాలా నమ్మకంతో అతనికి బాక్సింగ్‌ డే టెస్ట్‌లో అవకాశం ఇచ్చిన విషయం…

కెరీర్‌లో తొలి టెస్ట్‌ ఆడిన లోకేష్‌ రాహుల్‌ నిరాశపర్చాడు. అయితేనేం, రెండో టెస్ట్‌లో అదరగొట్టాడు. కర్నాటకకు చెందిన లోకేస్‌ రాహుల్‌పై సెలక్టర్లు చాలా నమ్మకంతో అతనికి బాక్సింగ్‌ డే టెస్ట్‌లో అవకాశం ఇచ్చిన విషయం విదితమే. అయితే తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన రాహుల్‌పై మరోమారు సెలక్టర్లు నమ్మకముంచారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని రాహుల్‌ ఈసారి వమ్ముచేయలేదు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో లోకేష్‌ రాహుల్‌ సెంచరీ బాదాడు. 

తొలి సెంచరీ ఎవరికైనా అద్భుతమే. ఆ అద్భుత క్షణాల్లో రాహుల్‌ భావోద్వేగాల్ని అదుపుచేసుకోవడానికి మేగ్జిమమ్‌ ట్రై చేశాడు. కెప్టెన్‌ కోహ్లీని ఆలింగనం చేసుకున్నాడు లోకేష్‌ రాహుల్‌ సెంచరీ అనంతరం. 22 ఏళ్ళ ఈ యువ ఆటగాడు టీమిండియాకి ముందు ముందు నమ్మదగ్గ ఆటగాడిగా మారే అవకాశాలైతే కన్పిస్తున్నాయి.

ఇక, ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ని చేజార్చుకున్న టీమిండియా, చివరి టెస్ట్‌లో డ్రా కోసం పరితపించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. బౌలర్ల వైఫల్యంతో టీమిండియా, ఆసీస్‌కి భారీగా పరుగులు సమర్పించుకుంది. కోహ్లీ నిలదొక్కుకున్నా, రోహిత్‌ ఫర్వాలేదన్పించుకున్నా, రాహుల్‌ సెంచరీ చేసినా.. ఇంకా టీమిండియా ఇబ్బందుల్లోనే వుంది. డ్రా చేసుకోవడమొక్కటే టీమిండియా ముందున్న ప్రత్యామ్నాయం.

ఏదిఏమైనా, ఈ సిరీస్‌తో టీమిండియాకి ఓ మంచి బ్యాట్స్‌మన్‌ లోకేష్‌ రాహుల్‌ రూపంలో దక్కాడని చెప్పొచ్చు. ఒక్క ఇన్నింగ్స్‌తోనే అతని సామర్థ్యాన్ని అంచనా వేయడం సబబు కాదేమోగానీ, బ్యాటింగ్‌ చేస్తున్నంతసేపూ మైదానంలో అతని కాన్ఫిడెన్స్‌ చూస్తే మాత్రం, ఖచ్చితంగా లోకేష్‌ టీమిండియాలో విలువైన ఆటగాడిగా నిలదొక్కుకునే ఛాన్సుంది.