2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అదే సమయంలో ఈ టోర్నీకి ముందు కొన్ని కీలక వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్తాన్ విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు మరో వేదిక కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ లో పాక్ కు సంబంధించిన మ్యాచ్ లు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు పాక్ మాజీ క్రికెట్, ఐసీసీ జనరల్ మేనేజర్-క్రికెట్ వసీమ్ ఆక్రమ్ కూడా పాక్ కు ప్రత్యామ్నాయ వేదిక ఉండొచ్చన్నారు. కాగా, పాక్ వేదికగా జరిగే ఆసియా కప్ లో కూడా భారత్ కు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ఛాన్స్ ఉంది.
కాగా భారతదేశం ఆతిథ్యమిస్తున్న 2023 ప్రపంచకప్ వన్డే టోర్నీ అక్టోబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నవంబర్ లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుందని సమాచారం. మొత్తంగా 46 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భారత్ వేదికగా 2011 ప్రపంచకప్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో శ్రీలంక జట్టును మట్టికరిపించి టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. 2013 నుంచి భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకోలేదు. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ లు జరిగినప్పటికీ అందులో ఒక్క కప్ ను కూడా అందుకోలేకపోయింది. ఈ సారి సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీ దృష్టా భారత్ ప్రపంచకప్ పై ఆశలు పెటుకుంది.