ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ టెలివిజన్ రేటింగ్స్ తగ్గిపోయాయి అని అంటున్నారు విశ్లేషకులు. వేరే ఎంటర్ టైన్ మెంట్.. ఎన్నికల వంటి ఆసక్తికరమైన వ్యవహారాలేమీ లేకపోయినా.. కూడా ఈ సారి జనాలు ఐపీఎల్ మ్యాచ్ లను టీవీల్లో చూడటం బాగా తగ్గిపోయిందని టెలివిజన్ కార్యక్రమాలకు రేటింగులను ఇచ్చే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. గతంతో పోలిస్తే రేటింగ్స్ ఈ సారి బాగా పడిపోయాయని.. వీక్షకాదరణ బాగా తగ్గిందని వారు అంటున్నారు.
ఐపీఎల్ పై స్పాట్ ఫిక్సింగ్ లాంటి మరకలు పడటం.. బీసీసీఐ పెద్దలు కోర్టుల చుట్టూ తిరుగుతుండటం.. ఈ మ్యాచ్ లన్నీ ఫిక్సింగే.. అనే ప్రచారాలు కూడా వినిపించడం.. ఓవరాల్ గా క్రికెట్ ఎక్కువయిపోవడంతో.. ఐపీఎల్ కు క్రేజ్ తగ్గిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్ పై జనాల్లో బాగా ఆసక్తి కనిపించింది… ఆ ఫీల్ తగ్గకుండానే ఐపీఎల్ వచ్చి పడింది… ఇలా ఎప్పుడూ క్రికెట్ ను చూసే ఆసక్తి ఎంతమందికి ఉంటుంది? అంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ యాజమాన్యం లీగ్ కు క్రేజ్ ను పెంపొందించే పనిలో పడింది. స్టేడియంకు గ్లామర్ లుక్ తీసుకురావాలని.. సినిమా వాళ్ల ద్వారానైనా ఆదరణను పెంపొందించే ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు వివిధ టీమ్ ల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.. స్టేడియంకు వీలైనంతమంది సెలబ్రిటీలను తీసుకురావాలని ఐపీఎల్ యాజమాన్యం కోరుతోంది.
దీంతో వివిధ ప్రాంచైజ్ ల యజమానులు ఈ ప్రయత్నాల్లో పడ్డారు. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ జట్టు యాజమాన్యం సన్నీలియోన్ వంటి వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చుకొని.. స్టేడియంలో కూర్చోబెడుతోంది. మిగతా ప్రాంచైజ్ లు కూడా తమ తహతుకు తగ్గట్టుగా సెలబ్రిటీలను స్టేడియంలోకి తీసుకొస్తున్నాయి. మరి ఇలాంటి వారంతా.. ఐపీఎల్ క్రేజ్ ను తగ్గనీయకుండా చూడగలరా?!