ఇండియా- ఆస్ట్రేలియాల మధ్య గురువారం జరిగే సెమిఫైనల్ మ్యాచ్ కు వేదిక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. ఈ స్టేడియం జనసామర్థ్యం 42 వేలు. విశేషం ఏమిటంటే ఈ మొత్తం టికెట్లలో 70 శాతం టికెట్లు భారత క్రికెట్ టీమ్ అభిమానులే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ముప్పై వేల మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ బ్లూ చొక్కాలు వేసుకొని వచ్చి మెన్ ఇన్ బ్లూకు మద్దతుగా నిలవనున్నారు!
దీంతో ఎస్ సీజీ టీమిండియాకు హోం గ్రౌండ్ అనుకోవాల్సిన పరిస్థితి. సాధారణం విదేశీ వేదికలపై ఏ జట్టుకైనా జనాల మద్దతు తక్కువగా ఉంటుంది. అందులోనూ అలాంటి వేదికలపై ఆతిధ్య జట్లతో తలపడుతూ ఉన్నప్పుడైతే అతిధి జట్లకు ఎలాంటి సపోర్టూ ఉండదు. అయితే సిడ్నీలో సీన్ రివర్స్ అయ్యింది.
తమకు వీక్షకుల నుంచి మద్దతు తక్కువేనని ఇప్పటికే ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కు కూడా అర్థం అయ్యింది. ఈ విషయాన్ని క్లార్క్ కూడా ప్రస్తావించాడు. స్టేడియంకు వచ్చి తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను కోరాడు. అయితే పరిస్థితి ఇప్పటికే చేయి దాటిపోయింది. 42 వేల టికెట్లలో దాదాపు 30 వేల టికెట్లు ఇండియన్స్ చేతికి వెళ్లాయి.
ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారతీయుల సంఖ్య గణనీయంగానే ఉంది. వారికి తోడు ప్రపంచకప్ వీక్షణ కోసం ఆసీస్ వెళ్లిన వారి సంఖ్య కూడా భారీ స్థాయిలోనే ఉంది. దీంతో ఎస్ సీజీలో ఇండియన్ ఫ్యాన్స్ డ్యామినేషన్ ఉండబోతోంది. ఇది భారత జట్టుకు హోం గ్రౌండ్ లో ఆడుతున్న ఫీలింగ్ ను కలిగిస్తుందనడంలో సందేహం లేదు. భారత జట్టు రాణింపుకు ఇదీ ఒక కారణంగా నిలిస్తే మేలే కదా!