స్లెడ్జింగ్‌ గోల.. దేనికి సంకేతం.?

ప్రత్యర్థి మీద సొంత బలంతో గెలవలేనప్పుడే కుయుక్తులకు తెరలేపుతారు ఎవరైనా. ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్‌లో  తెచ్చుకున్నంత చెడ్డపేరు బహుశా ఇంకే ఇతర జట్టూ తెచ్చుకోలేదేమో.! Advertisement స్లెడ్జింగ్‌ అనగా, ప్రత్యర్థి ఆటగాళ్ళను మైదానంలో…

ప్రత్యర్థి మీద సొంత బలంతో గెలవలేనప్పుడే కుయుక్తులకు తెరలేపుతారు ఎవరైనా. ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్‌లో  తెచ్చుకున్నంత చెడ్డపేరు బహుశా ఇంకే ఇతర జట్టూ తెచ్చుకోలేదేమో.!

స్లెడ్జింగ్‌ అనగా, ప్రత్యర్థి ఆటగాళ్ళను మైదానంలో కవ్వించడం, ఒత్తిడికి గురిచేయడం. ఆస్ట్రేలియాకి స్లెడ్జింగ్‌లో ఒకప్పుడు పేటెంట్స్‌ వుండేవేమో. ఆ మాటకొస్తే, ఏ జట్టు అయినా తన సామర్థ్యంతో మైదానంలో ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటుందిగానీ, ఆస్ట్రేలియా అలా కాదు, ప్రత్యర్థిని మానసికంగా స్లెడ్జింగ్‌ ద్వారా దెబ్బ కొట్టి, తద్వారా తాను విజయం సాధించాలనుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా స్లెడ్జింగ్‌ విషయమై ఎన్ని విమర్శలొచ్చినా, ఐసీసీ మీద క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒత్తిడితో అది ఆటలో భాగమైపోయింది. కొన్ని దేశాలు ఈ స్లెడ్జింగ్‌ని ఎంతో కొంత వంటబట్టించుకున్నాయి. టీమిండియా కూడా ఆస్ట్రేలియా నుంచి కొంత నేర్చుకుంది. అయితే అది ఆస్ట్రేలియా మీదనే ప్రదర్శిస్తుంటుంది.

‘ఏం.. నువ్వు పట్టుకున్నది బ్యాటేనా.. ఇంట్లో చెప్పొచ్చావా.?’ ఇలా రకరకాల మాటలతో, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ కాన్సన్‌ట్రేషన్‌ దెబ్బ తీసే ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఒక్కోసారి హద్దులు దాటి తిట్లతో, బూతులతో ఇబ్బంది పెడ్తుంటారు. జెంటిల్‌మెన్‌ గేమ్‌లో ఈ చెత్త ఏంటి.? అని అంతా అసహ్యించుకున్నా, ఆస్ట్రేలియా మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడంలేదు. మధ్యలో కొన్ని వరుస పరాజయాలతో స్లెడ్జింగ్‌ని కాస్త పక్కన పెట్టిన ఆస్ట్రేలియా, ఈ వరల్డ్‌ కప్‌లో మళ్ళీ స్లెడ్జింగ్‌ని తెరపైకి తెస్తోంది.

టీమిండియా ` ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌లో తలపడనున్న దరిమిలా, స్లెడ్జింగ్‌తో టీమిండియాని ఇరకాటంలో పెడ్తామని ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రకటించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడేమన్నా అంత బలహీనంగా వుందా.? ఇలా రకరకాల ప్రశ్నలు క్రికెట్‌ అభిమానులనుంచి వినిపిస్తున్నాయి. స్వదేశంలో జరుగుతోన్న టోర్నీలో విజయం సాధించాలని తహతహలాడుతున్న ఆసీస్‌, మానసికంగా టీమిండియాని దెబ్బ కొడితే తప్ప, అసలు బలంతో టీమిండియాపై నెగ్గలేమన్న ఆలోచనతోనే ఇదంతా చేస్తోందేమో అన్పిస్తోంది.

స్లెడ్జింగ్‌ని ఎదుర్కోగల సత్తా టీమిండియాకి వుంది. అదే సమయంలో, ఆస్ట్రేలియాని మైదానంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో బలంగా వుంది టీమిండియా. సో.. ఆస్ట్రేలియా స్లెడ్జింగ్‌ ఆ జట్టు నైజాన్ని బయటపెడ్తుంది తప్ప, మ్యాచ్‌ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం లేనట్టే.