మా సంఘ ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ఒంటిర పోరు సాగిస్తున్నారు. దాదాపు అంతా మురళీ మోహన్ కనుసన్నలలో జయసుధవైపే మొగ్గేసినట్లు కనిపిస్తోంది. పాపం నాగేంద్రబాబు మాత్రం రాజేంద్రుడి వైపు నిల్చినా మెగాస్టార్ చిరంజీవి మాత్రం జయసుధ వైపే వున్నారని ప్రచారం సాగుతోంది. ఇదెక్కడి రాజకీయమో? మరో పక్క మీడియా కూడా పెద్దగా ఈ వ్యవహారాలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
ఇదిలా వుంటే జయసుధ నిన్నటికి నిన్న మీడియాతో మాట్లాడతూ చేసిన వాఖ్యలు చిత్రంగా వున్నాయి.
తాను పోటీలో ఉన్నాననే సంగతి తెలియగానే.. కొంతమంది తప్పుకోమంటూ బెదిరించాలని చూశారుని, దాంతో మరింత పంతంతో పోటీ చేస్తున్నానని అన్నారామె. రాజకీయాలను, సినిమాలను కలప వద్దని, తనకు రెండూ బాగా పరిచయమే అని ఆమె అన్నారు. అంటే దీన్ని బట్టి ఆమెకు బెదిరింపులు వచ్చింది రాజకీయ రంగం నుంచి అని అనుకోవాలి. ఎందుకంటే సినిమా రంగం నుంచి బెదిరింపులు వచ్చే అవకాశం లేదు. కారణం, అంతా గంపగత్తగా ఆమె వెనుకే వున్నారు కాబట్టి.
మరి రాజకీయంగా ఎవరు బెదిరించినట్లు? తెరాసనా, వైకాపానా? కాంగ్రెస్ నా? ఎందుకంటే ఆమె వైఎస్ ప్రాపకంతో గెలిచారు. ఆ తరువాత వైకాపా, కాంగ్రెస్ ల నడుమ ఊగిసలాడారు. ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు, తలసాని నియోజకవర్గాన్ని దృష్టిలో వుంచుకుని, ఆమెను తెలుగుదేశంలోకి లాగేందుకే, ఈ మా అధ్యక్ష పదవి ఎర చూపారని గుసగుసలు వున్నాయి. మరి ఆ లెక్కన తెరాస నుంచి బెదిరింపులు వచ్చి వుండాలి.
నిజంగా జయసుధను తలసానికి వ్యతిరేకంగా వాడుకునేంత సీన్ సినిమా పరిశ్రమకు లేదు. సినిమా పరిశ్రమకు, మంత్రి తలసానికి వున్న సంబంధాలు తెలుసు కనుకనే, కెసిఆర్ ఆ విభాగం ఆయనకు అప్పగించారు. అప్పటి నుంచే సినిమా జనాలు అంతా తలసాని తో మరింత జాగ్రత్తగా వుంటున్నారు. అందువల్ల ఈ బెదిరింపులు ఏమిటి? ఎక్కడి నుంచి..లేక రాజకీయాలు తనకు అలవాటే అని జయసుధ అన్నందున, అందులో భాగంగానే ఈ సంచలన ప్రకటన చేసారా? ఏమో ఆమే చెప్పాలి ఆన్సరు.