మళ్ళీ క్రికెట్ పండగ వచ్చేసింది.. ఈసారి ఐపీఎల్ క్రికెట్ సంబరాల్లో క్రికెట్ అభిమానులు తడిసి ముద్దవనున్నారు. సీనియర్ క్రికెటర్లు, యంగ్ క్రికెటర్ల కలయికతో మొత్తం 8 జట్లు ఈ ఐపీఎల్ క్రికెట్‌లో అభిమానుల్ని అలరించనున్నాయి. ఏ సీజన్‌కి ఆ సీజన్ ఐపీఎల్ పోటీలు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న విషయం విదితమే.
ఇక, 8వ సీజన్ ఐపీఎల్ పోటీలకు గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా వ్యవహరించనున్నారు. 2013 వరకూ రాజీవ్ శుక్లా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా వ్యవహరించిన విషయం విదితమే. అప్పట్లో ఐపీఎల్‌ని కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో శుక్లా, ఛైర్మన్ పదవికి దూరమయ్యారు.
ఇదిలా వుంటే, ఐపీఎల్ అంటేనే బెట్టింగ్.. బెట్టింగ్ అంటేనే ఐపీఎల్ అన్న స్థాయిలో ఈసారీ బెట్టింగ్ కింగ్‌లు రంగంలోకి దిగిపోతున్నారు. చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుపైనే జోరుగా బెట్టింగులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ (కోల్‌కతా), మహేంద్రసింగ్ ధోనీ (చెన్నయ్), రోహిత్ శర్మ (ముంబై), జార్జ్ బెయిలీ (పంజాబ్), షేన్ వాట్సన్ (రాజస్తాన్), డేవిడ్ వార్నర్ (హైద్రాబాద్), జెపి డుమిని (ఢిల్లీ), విరాట్ కోహ్లీ (బెంగళూరు) నేతృత్వంలో ఆయా జట్లు, ఐపీఎల్-8 ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి.
ఏప్రిల్ 8న కోల్‌కతాలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇదే కోల్‌కతాలో మే 24న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.