అమ్మ చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టేస్తా – అల్లరి నరేష్

అల్లరి నరేష్..ఆ పేరు వింటేనే పెదాలపై నవ్వులు పూస్తాయి. మన ఇంటి పక్క కుర్రాడిలా వుంటాడు..పల్లెటూరి మైనర్ బాబులా కనిపిస్తాడు..ఎదురింటి అరుగు మీది టైలర్ లా మారిపోతాడు..మోసగాడు..అల్లరివాడు..అబద్దాల కోరు..ఇలా ఒకటేమిటి పాదరసంలా ఎందులో పోస్తే…

అల్లరి నరేష్..ఆ పేరు వింటేనే పెదాలపై నవ్వులు పూస్తాయి. మన ఇంటి పక్క కుర్రాడిలా వుంటాడు..పల్లెటూరి మైనర్ బాబులా కనిపిస్తాడు..ఎదురింటి అరుగు మీది టైలర్ లా మారిపోతాడు..మోసగాడు..అల్లరివాడు..అబద్దాల కోరు..ఇలా ఒకటేమిటి పాదరసంలా ఎందులో పోస్తే అందులో కనిపిస్తాడు..మెరుస్తాడు..మైమరపిస్తాడు..ఎంతయినా సుడిగాడు. ప్రస్తుతం 48 వ సినిమా చేస్తున్న ఈ హీరో వచ్చే ఏడాది ఆరంభంలో యాభయ్యవ సినిమా చేయబోతున్నాడు. ఈ తరం హీరోల్లో ఇన్ని సినిమాలు చేసినవారు లేరు. అలాంటి అల్లరి నరేష్ తో 'గ్రేట్ ఆంద్ర' ఇంటర్వూ

ఈ మధ్యన కొంచెం స్పీడు పెంచినట్లున్నారు?

ఎప్పుడూ ఒకటే స్పీడండీ…అయితే ఆ మధ్య యాక్షన్ త్రీడి, లడ్డూ బాబు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాయి. దాంతో నా సినిమాలకు గ్యాప్ వచ్చినట్లయింది

ఏడాదికి ఆరేడు సినిమాలు చేసిన స్టయిల్ మళ్లీ వస్తుందా?

ఆరు కాకపోయినా, కనీసం మూడు తక్కువ కాకూడదని అనుకుంటున్నాను. మూడు నెలల మాత్రమే ఒక ప్రాజెక్టుకు కేటాయించాలని డిసైడ్ అయ్యాను.

ఇటీవలి మీ సినిమాలు అన్నీ ఆశించన మేరకు జనాన్ని అలరించలేదు.

సుడిగాడు ప్రభావం. తప్పదు. ఆ సినిమాలో నేను ఎంత చేయాలో, ఎన్ని చేయాలో అంతా చేసేసాను. ఓ పెద్ద హిట్ తరువాత వరుసుగా ఇబ్బందులు ఎదురుకావడం అన్నది దాదాపు చాలా మంది హీరోలు అనుభవించారు. ఇప్పుడు నా వంతు. అసలు ఆ సినిమా ఓ అల్టిమేట్. ఇంకా అల్లరి నరేష్ ఏం చేస్తాడు అని చూస్తున్నారు. పెద్ద హీరోలు సైతం వారి వారి సినిమాల్లో అరగంట వరకు కామెడీ చేయాల్సిన రోజులు ఇవి. కానీ నా సినిమాకు వచ్చేసరికి రెండున్నర గంటలు కామెడీ చేయాలి. అంత కామెడీ అంటే ఎక్కడ పుట్టించాలి..ఎలా పుట్టించాలి. 

మరి మీ ఫాదర్ కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు తీసి మెప్పించారు కదా.

ఆయన స్టయిల్ వేరండీ..ఆయన డైలాగులు..ఆ చమక్కులు అందరికీ రావడం చాలా కష్టం. అప్పటికీ ఇప్పటి తరం రైటర్లు కూడా కిందా మీదా అవుతున్నారు. ప్రయత్నిస్తున్నారు. మేం కూడా కొత్త కోత్త వాళ్లని, యంగ్ జనరేషన్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చాలా  మందికి అవకాశాలిచ్చి ప్రయత్నిస్తున్నాం. అందుకే నేనో ఇంకో అయిడియా కూడా అనుకుంటున్నాను. నాన్నగారు, రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన మాంచి ఫ్యామిలీ వినోదం సినిమాలు రీమేక్ చేస్తే ఎలా వుంటుందా అని?

ఒకప్పుడు అల్లరి నరేష్ అంటే బడ్జెట్ హీరో. కానీ ఇప్పుడు మీరు కూడా భారీ బడ్జెట్ లు అడుగుతున్నారని. 

అదేం లేదండీ. కాస్త క్వాలిటీ వుండాలని చూస్తున్నా అంతే. మరీ 5డి కెమేరాలతో సినిమా చేసేయలేను కదా. అయినా ఇప్పుడు నా సినిమాలు అనేసరికి స్టార్ కాస్ట్ ఎక్కువ. అక్కడే బడ్జెట్ పెరిగిపోతోంది. అందుకే పది కోట్లు దాటనివ్వకుండా చూస్తున్నాను. 

మీ ఫాదర్ లేని లోటు స్క్రిప్ట్ ల ఎంపికపై, విజయాలపై ప్రభావం చూపిస్తోందా?

నా స్క్రిప్ట్ లు ఎప్పుడూ నాన్న వినలేదు. కలుగ చేసుకోలేదు. అయితే అప్పట్లో ఓ ప్లస్ పాయింట్ వుండేది. ఆయన నాతో ఏడాదికి ఒకటైనా సినిమా చేసేవారు. అది గ్యారంటీగా బాగుండేది. దాంతో నాకు ప్లస్ అయ్యేది. జనానికి నామీద అభిమానం పెరిగేది. ఇప్పుడు అలా గ్యారంటీ లేదు.

వంశీ, బాపు, విశ్వనాధ్ లాంటి క్లాస్ డైరక్టర్ లతో సినిమాలు చేసారు. ఇప్పుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఎలా వుంది

కొత్తగా, చాలా బాగా వుందండి. ఆ భాష ముఖ్యంగా, గతంలో జంధ్యాల సినిమాల్లో కామెడీ లాంటిది. నాకు బాగా నచ్చుతోంది.

యాభై వ సినిమా సంగతులు?

అసలు నేను ఆ ఫీలింగ్ లో లేనండీ. అందరూ అంటుంటే నాకూ టెన్షన్ పెరిగేలా వుంది. మరీ స్పెషల్ అనేమీ అనుకోవడం లేదు. మంచి సినిమా అయితే చేయాలని వుంది. అది వచ్చే ఏడాది జనవరిలో వుంటుంది. 

ఇప్పుడు వస్తున్న కామెడీ ఎలా వుంటోంది

కాస్త ఆరోగ్యవంతమైన కామెడీ వస్తే బాగుండును అని వుంది. నేను, అమ్మ, వదిన కూర్చుని చూస్తాం. అలాంటపుడు టీవీలో అయినా, సినిమాలో అయినా కాస్త మంచి కామెడీ వుంటే కదా చూడగలం. 

మీ సినిమాలకు ప్రచారం కూడా అంతగా వుండడం లేదన్న టాక్ వుంది.

కొంతవరకు మీరన్నది నిజమే. ఆ మధ్య కొన్ని సినిమాలకు విడుదల తరువాత వివిధ కారణాల వల్ల ప్రచారం జరగాల్సిన రేంజ్ లో జరగలేదు. కానీ నేనేం చేయగలను. సినిమా నిర్మాతే, అమ్మేసాను కదా అని వదిలేస్తే..వీలయినంత వరకు చెబుతుంటాను. అంతకన్నా ఏం చేయాలి అర్థం కావడం లేదు.

మీరు మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్ కారని..

అదేం లేదండీ..అలా అని గిరి గీసుకోలేదు. ఎవరు వచ్చినా మాట్లాడతాను.

పెళ్లి పెళ్లి అని వాయిదాలు వేస్తూనే వున్నట్లున్నారు

అదేం లేదండి. అమ్మ ఎవర్ని చూపించి, తాళి కట్టమంటే కట్టేయడమే. అమ్మకు కాస్త సెంటిమెంట్లు, జాతకాల నమ్మకాలు వున్నాయి. అన్నయ్య, వదినకు కూడా నచ్చాలి. ఆ ముగ్గురూ కలిసి ఓకె అంటే నాదేం ఆలస్యం లేదు. వాళ్లకూ అదే చెప్పాను. 

అమ్మతో అటాచ్ మెంట్ బాగానే వున్నట్లుంది.

అమ్మ కదండీ..నాన్న పోయాక మూడేళ్లుగా ఇల్లు కదలలేదు. అందుకే ఈ సారి ఓ పది రోజులు ఎటయినా తీసుకెళ్లాలనీ వుంది. 

యాభైవ సినిమా, మీ పెళ్లి వచ్చే ఏడాదికి గ్యారంటీ అనుకోమంటారా..

తప్పకుండా.

బెస్టాఫ్ లక్ 

థాంక్యూ

చాణక్య

[email protected]