ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన బాహుబలి – ది కంక్లూజన్ సినిమా అమెరికాలో కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో ఇండియన్ సినిమా రికార్డుల్ని తుడిచిపెట్టేసిన ఈ సినిమా తన సక్సెస్ ఫుల్ రన్‌ను ఈ వీకెండ్ కూడా కొనసాగించబోతోంది. ఓవర్సీస్‌లో గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేసింది. ఒక్క అమెరికాలోనే 6రోజుల్లో 12.7 మిలియన్ డాలర్లు వసూలు చేయడంతో ఈ కంపెనీ ఖుషీగా ఉంది. బాహుబలి-2 సినిమా సాధించిన విజయం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందంటున్నారు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ అధినేతలు సోమ, సుధాకర్ రెడ్డి.
బాహుబలి-2 సక్సెస్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..?
చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సినిమాతో మాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. మరీముఖ్యంగా హాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కింది.
ఈ సినిమాకు చాలా ఎక్కువ మొత్తం చెల్లించారని విన్నాం. ఈ ప్రాజెక్టుపై అంత నమ్మకం ఎలా వచ్చింది?
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని 200శాతం నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకమే మా అసలైన పెట్టుబడి.
ప్రచారానికి, ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఎక్కువగా ఖర్చు చేసినట్టున్నారు..?
సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని అనుకున్నాం. అందుకే అలా చేశాం. ప్రస్తుతం ఆ ఫలితాలు చూస్తున్నాం. నిజమే ప్రమోషన్ కోసం, భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు బాగానే ఖర్చుపెట్టాం.
టిక్కెట్ ధరలు భారీగా పెంచడంపై విమర్శలు చెలరేగాయి కదా.. దీనిపై మీరేమంటారు..?
గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ ఎప్పుడూ అందుబాటు ధరల్నే నిర్ణయిస్తుంది. నిజానికి కొన్ని భారీ బడ్జెట్ సినిమాలతో మేం పోటీని మిస్‌అయ్యాం. ఎందుకంటే మా రెవెన్యూలో పెంచిన టిక్కెట్ ధరల్ని లెక్కించలేదు. బాహుబలి-2 సక్సెస్‌ను ఇష్టపడని వ్యక్తులు కొందరు ఈ తరహా విమర్శలు చేశారు. చాలామంది అర్థంచేసుకొని సహకరించారు.టికెట్ ధరల్ని పెంచడాన్ని మేం సమర్థించం. అలా చేస్తే ఏదోఒక రోజు బాక్సాఫీస్‌పై దాని ప్రభావం గట్టిగా పడుతుంది. అయితే ఐమ్యాక్స్ లేదా త్రీడీ లాంటి ప్రత్యేకమైన హంగులున్నప్పుడు మాత్రం సర్ చార్జ్ పడుతుంది. ప్రయాణంలో ఫస్ట్‌క్లాస్, ఎకానమీ క్లాస్ మధ్య తేడాలాంటిదే ఇది.
ఈ సినిమా యూనిట్ లేదా నటీనటులతో ఏమైనా సక్సెస్ సంబరాలు ప్లాన్ చేశారా..?
లేదండి. ప్రస్తుతానికి అంతా రిలాక్స్ మూడ్‌లో ఉన్నారు. వాళ్లను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మా ఎగ్జిబిటర్లు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో చిన్న సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి..?
ఇప్పటికింకా బాహుబలి-2 పనులతోనే బిజీగా ఉన్నాం. రెండోవారం నుంచి అదనంగా మరో 60 షోలు వేసే ప్రయత్నాల్లో ఉన్నాం. మే 12 నుంచి బాహుబలి-2 మలయాళం వెర్షన్‌ను కూడా విడుదల చేయబోతున్నాం. ఆఆ తర్వాతే నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటిస్తాం.
మా పాఠకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా..?
అమెరికాలో బాహుబలి-2 సినిమాను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టినందుకు.. మాకు సహకరించిన ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
ఎన్ని థియేటర్లలో ప్రీమియర్స్ వేశారు? ఒక్కో లాంగ్వేజ్‌కు ఎన్ని స్క్రీన్స్ కేటాయించారు? ఒక్కో భాషలో ప్రీమియర్స్‌కు ఎంత వసూళ్లు వచ్చాయి?
425 థియేటర్లలో, 1000 స్క్రీన్స్‌పై ప్రీమియర్స్ వేశాం. ఎన్ని ప్రీమియర్స్ అనేది మాకు తెలీదు. ఎందుకంటే శుక్రవారం కూడా ప్రీమియర్స్ కొనసాగాయి.
మొదటి రోజు నుంచి వారం వరకు ఎన్ని థియేటర్లు కేటాయించారు?
425 థియేటర్లు.. వెయ్యికి పైగా తెరలు.
ఐమ్యాక్స్ స్క్రీన్స్ నుంచి వచ్చిన మొత్తమెంత?
ఐమ్యాక్స్ రన్ ఈరోజుతో ముగుస్తోంది. పైనల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. వచ్చేవారంలో తెలుస్తుంది.
ఒక్కో భాషలో బాహుబలి-2 సినిమాకు ఎంత వచ్చింది? టోటల్ కలెక్షన్ ఎంత?
ప్రస్తుతానికి పక్కాగా చెప్పలేం కానీ మొత్తం వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి 65శాతం, హిందీ వెర్షన్ నుంచి 20శాతం, తమిళ వెర్షన్ నుంచి 15శాతం వాటా ఉంది.
మీ మొత్తం ఖర్చు ఎంతో చెప్పండి? రైట్స్ కోసం ఎంత ఖర్చుపెట్టారు. ప్రచారానికి, ప్రింట్స్‌కు ఎంత ఖర్చుపెట్టారు? ఇప్పటివరకు ఎంత వెనక్కి వచ్చింది?
ఇప్పటివరకు బ్రేక్-ఈవెన్ చూడలేదు. కానీ అన్ని ఖర్చులతో కలుపుకొని 7.5 మిలియన్ డాలర్లు అయింది.
ప్రస్తుతం మీరు లాభాల్లోకి వచ్చారా లేదా..?
ప్రస్తుతానికి ఇంకా లాభాల్లోకి రాలేదు. మరో 2-3 రోజుల్లో ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటరవుతాం.
వచ్చేవారం ప్రమోషన్ కోసం ప్రభాస్ లేదా రాజమౌళిలో ఎవరినైనా తీసుకొస్తున్నారా..?
ఎవర్నీ తీసుకురావడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నాడు. మరోవైపు మేం కూడాబాహుబలి-2 మలయాళం వెర్షన్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాం.
దంగల్ సృష్టించిన లైఫ్ టైం గ్రాస్ రికార్డును బాహుబలి-2 క్రాస్ చేయడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు..?
చాలా ఆనందంగా ఉంది.
ఓ తెలుగు సినిమా అమెరికాలో ఉన్న భారతీయులందర్నీ ప్రభావితం చేయడం ఇప్పటివరకు చరిత్రలో జరగలేదు. దీనికి మీరు చెప్పే రీజన్ ఏంటి..?
సినిమాలో అన్నీ సమపాళ్లలో కుదిరాయి. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ప్రచారం బాగా చేశాం. అన్నివర్గాల నుంచి మద్దతు దొరికింది.
భారీ మొత్తానికి రైట్స్ కొన్నారు. రిలీజ్‌కు ముందు వత్తిడి ఫీలవ్వలేదా..? ఇదేదో పెద్ద రిస్క్ అనిపించలేదా..?
ఇంతకుముందే చెప్పినట్టు ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. షెడ్యూల్స్, ఎగ్జిక్యూషన్ లాంటి టెక్నికల్ అంశాల్లో వత్తిడి తప్పితే, సినిమా ఫలితంపై ఎప్పుడూ టెన్షన్ పడలేదు.
భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మీరు అనుసరించిన వ్యూహం ఏంటి..?
గత సినిమాలు సాధించిన వసూళ్లతో పాటు మార్కెట్‌ను అధ్యయనం చేయడానికి చాలారోజులు కేటాయించాం. మా రీసెర్చ్ ఆధారంగానే థియేటర్లు, లొకేషన్లను ఎంపిక చేసుకున్నాం. మేం చేసిన రీసెర్చ్ మంచి రిజల్ట్ ఇచ్చింది.
ఇంకా ఎంత వసూలు చేస్తుందని ఆశిస్తున్నారు..? ఈ వసూళ్లు ఎంత ఎమౌంట్ వద్ద ఆగొచ్చు..?
17 నుంచి 18 మిలియన్ డాలర్ల వసూళ్లను అంచనా వేస్తున్నాం.
నెక్ట్స్ సినిమాలేంటి..? భవిష్యత్తులో కూడా పెద్ద సినిమాలకు ఇదే విధంగా భారీ స్థాయిలో వెళ్తారా..?
త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాం.
అమెరికాలో తెలుగు సినిమాలకు ఎందుకు ఒక్కసారిగా మార్కెట్ పెరిగింది? పెళ్లిచూపులు లాంటి సినిమాకు కూడా 1.2 మిలియన్ డాలర్లు వచ్చాయి కదా..?
గడిచిన కొన్నేళ్లలో కొత్తగా చాలామంది తెలుగువాళ్లు అమెరికాకు రావడమే మార్కెట్ పెరగడానికి కారణం. అయితే మా ప్రేక్షకులకు మంచి సినిమాల్ని అందించడంలో మేం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే చాలా సినిమాలు యూఎస్ మార్కెట్లో ఆడవు. చాలా సినిమాలకు ప్రింట్ ఖర్చులు, డిజిటల్ డబ్బులు కూడా రావు.