హీరో కార్తీతో ఇంటర్వూ…
పట్టుమని పది సినిమాలు చేయలేదు. కానీ తెలగునాట ఓ క్రేజ్ సంపాందించుకున్నాడు. సగటు ప్రేక్షకుల నడుమ తిరిగే కుర్రాడిలా వుంటాడేమో, మన జనాలకు ఇట్టే నచ్చేసాడు. చేసేవన్నీ కమర్షియల్ సినిమాలే. కానీ కాస్త వైవిధ్యం అన్నది అదనపు ఆకర్షణ. అందుకే.. అతని సినిమాలకు తెలుగునాట కూడా కాస్త మార్కెట్ ఏర్పడింది. అలాగని దూసుకుపోయే వ్యవహారం కాదు. ఎనిమిదేళ్ల ప్రయాణంలో చేసినవి ఏడు సినిమాలే. అతడాడే కార్తీ. తమిళనటుడైనా తెలుగు స్పష్టంగా మాట్లాడగలడు. తాజాగా బిరియాని అంటూ పసందైన వంటకాన్ని తెలుగు ప్రేక్షకులకు వడ్డించబోతున్నాడు. ఈనెల 20న కార్తి నటించిన బిరియాని తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా గ్రేట్ ఆంధ్ర ఆయనతో ముచ్చటించింది. ఆ వివరాలు ఇవి.
* వెంకట్ ప్రభు టిపికల్ సబ్జెక్ట్ లు, క్లాస్ స్క్రీన్ ప్లే..మీరే పక్కా మాస్. పైగా పేరు బిరియాని. ఏమిటీ కాంబినేషన్?
– బిరియానీ అంటేనే అది కదా. అన్ని రకాలుగా బాగుండే హైదరాబాద్ దమ్ బిరియాని లాంటి సినిమా ఇది.
* అది సరే. పేరు ఎలా సూటవుతుందని?
– ఓ సమయంలో సరదాగా బిరియాని తిందామని వెళ్లిన కుర్రాడి జీవితంలో సంభవించిన అనుకోని మలుపు, ఆపై జరిగిన కథ ఇది. మరి ఇంతకన్నా మరే పేరు సూటవుతుంది?
* పక్కా మాస్ కథన్నమాట..మరి వెంకట్ ప్రభు డైరక్షన్ అంటే?
– వెంకట్ ప్రభు ది టిపికల్ స్క్రీన్ ప్లే స్టయిల్. థ్రిల్ వుంటుంది. మధ్యమధ్యలో కథలో మిళితమై కామెడీ వుంటుంది. దానికి నా స్టయిల్ యాక్షన్ కలుస్తుంది. అందువల్ల ఇది ఇలాంటి సినిమా అని ముద్ర వేయడానికి లేదు. అందరికీ నచ్చే సినిమా. పైగా ఈ సినిమాలో ఎమోషన్స్.. ముఖ్యంగా అక్క సెంటిమెంట్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకొంటుంది.
* అన్న సూర్యతో నటించిన హన్సిక ఇప్పుడు మీతో నటిస్తున్నారు. ఎలా వుంది కాంబినేషన్
-మంచి నటి. మామూలుగా చెప్పడం లేదు. పైగా వెయిట్ కూడా తగ్గంది.సినిమా ప్రారంభించిన నాటికి కొద్ది రోజులకు 12కిలోలు తగ్గిపోయింది. మీరు హన్సిక చెల్లినా అని జోక్ కూడా చేసాం.
*ఈ సినిమా కోసమేనా?
-అదేమీ కాదు. ఆమె చాలా సినిమాలు చేస్తోంది కదా. ఆమెకూ అవసరమే తగ్గడం. మాకు మాత్రం కాస్ట్యూమ్స్ అన్నీ మళ్లీ మార్చాల్సి వచ్చింది.
* ఈ సినిమా యువన్ శంకర్ రాజాకు వందో సినిమా. మీకు గాయకుడిగా తొలిసినిమా? ఏదైనా లింక్ వుందా?
– అది సరదా పాట. అలా అలా మామూలుగా పాడేది. తమిళంలో పాడినపుడు చిన్న చిన్న తప్పులు కూడా వచ్చాయి. కానీ యువన్ అలాగే వుంచేసాడు. అలాగే వుండాలి అన్నాడు. కానీ తెలుగులో పాడినపుడు నేను వాటిని సరిచేసాను. నాకు సంగీతం అంటే ఇష్టమే,.ముఖ్యంగా ఎస్పీబీ సార్ ప్రభావం చాలా వుంది. అయినా పాటలు పాడడం అంత సులువు కాదు. ఏదో ఈ ఒక్కసారికి సరదాగా.
*ఇక కొనసాగిస్తారా? ఇలా?
-అది దర్శకులు చాన్సిస్తే. అయినా ఇవాళ అందరూ పాటలు పాడేస్తున్నారు. అన్ని గొంతులు బాగానే వున్నాయనేస్తున్నారు.
*మల్టీస్టారర్ గా మీ అన్నతో సినిమా?
-మల్టీస్టారర్ నాకు ఇష్టం వుండదండీ.సోలోగానే చేస్తాను. అన్నయ్యతో కలసి అంటే ఓకె. కానీ అలాంటి గొప్ప కథ కావాలి. వినగానే ఇద్దరం చేయాలి అనుకోవాలి
*తెలగులో నేరుగా చేసే సంగతి
-అందరూ అడుగుతున్నారు. కానీ సరియైన కథ రావడం లేదు. ఏదో చెబుతున్నారు. నాకు నచ్చడం లేదు. ఏదో కథతో చేసేద్దాం అని ఎప్పుడూ అనుకోను. అలా అయితే ఇప్పటికి చాలా సినిమాలు చేసేద్దును.
*ఒక్కో హీరో సిక్స్ ప్యాక్ వైపు వస్తున్నారు. మరి మీరు?
-అదేంటో కొరుండి సిక్స్ ప్యాక్ అంటే గిల్టీగా వుంటుంది నాకు. వీధుల్లో తిరిగే సాదా సీదా కుర్రాడి పాత్రలు వేస్తున్నాను.అలాంటి ఏ కుర్రాడికి సిక్స్ ప్యాక్ వుంటుంది. నాకు నచ్చదు. అది. సూపర్ మాన్ కు సిక్స్ ప్యాక్ కావాలి. అందుకే ఆ పాత్ర చేయను (నవ్వుతూ)
*తరువాతి సినిమా?
-ప్రయోగాత్మక సినిమా చేస్తున్నా. తమిళంలో అట్టకత్తి అని ఓ సినిమా చేసాడో కొత్త దర్శకుడు. అది పెద్ద హిట్. ఆయనతో నార్త్ చెన్నయ్ బ్యాక్ డ్రాప్ లో ఓ కుర్రాడి కథ. మున్సిపాల్టీ లెవెల్ రాజకీయాలు ఆ కుర్రాడి జీవితంతో ఎలా ఆడుకున్నాయన్నది లైన్. రియల్ లొకేషన్లలో తీస్తున్నాం.
*ఆ మధ్య వరుసగా రెండు సినిమాలు విజయానికి దూరమయ్యాయి.
-అవును..ఏం చేయగలం. హిట్ కావాలనే చేస్తాం. కానీ ఎక్కడో తేడా వస్తుంది. సినిమా అంటే రెండు వందల మంది శ్రమ. అన్నింటినీ సరిసమానంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందే.
*తెలుగు ప్రేక్షకులకు ఏం చెబుతారు?
-బిరియాని మంచి సినిమా. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి.
– చాణక్య