నా కాన్‌సన్‌ట్రేషన్‌ మొత్తం ‘కరెంట్‌ తీగ’ మీదే..!!

కరెంట్‌ జనరేషన్‌లో కరెంట్‌ తీగలాంటి ఎనర్జిటిక్‌ హీరో మంచు మనోజ్‌. యాక్టింగ్‌తోపాటు.. స్టంట్స్‌, డాన్స్‌, సింగింగ్‌, రైటింగ్‌ వంటి మల్టిపుల్‌ టాలెంట్స్‌తో తన ప్రత్యేకతను ప్రకటించుకుంటుండే మంచు మనోజ్‌.. ఇకపై కేవలం నటనపై మాత్రమే…

కరెంట్‌ జనరేషన్‌లో కరెంట్‌ తీగలాంటి ఎనర్జిటిక్‌ హీరో మంచు మనోజ్‌. యాక్టింగ్‌తోపాటు.. స్టంట్స్‌, డాన్స్‌, సింగింగ్‌, రైటింగ్‌ వంటి మల్టిపుల్‌ టాలెంట్స్‌తో తన ప్రత్యేకతను ప్రకటించుకుంటుండే మంచు మనోజ్‌.. ఇకపై కేవలం నటనపై మాత్రమే దృష్టి పెడతానంటున్నాడు. 

మే 20న మంచు మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ తన తాజా చిత్రం ‘కరెంట్‌ తీగ’ గురించి, ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గురించి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. 

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే!!!

ఏ ప్రత్యేకత లేకపోవడమే ఈ పుట్టినరోజు ప్రత్యేకత

‘ఈ బర్త్‌ డే స్పెషల్‌ ఏంటి?’ అని చాలామంది అడుగుతున్నారు. పర్టిక్యులర్‌గా పుట్టినరోజు నాడు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనేమీ నేననుకోను. రోజూ ఎలా ఉంటానో.. ఆ రోజు కూడా అంతే. కాకపోతే.. పుట్టినరోజున మాత్రం ఫ్రెండ్స్‌ అంతా కలుస్తాం. ముఖ్యంగా.. అదే రోజు జూ॥ఎన్టీఆర్‌ బర్త్‌డే కూడా అవ్వడం వల్ల.. కుదిరితే ఇద్దరం కలిసి ఎంజాయ్‌ చేస్తాం.

నా బెండు తీస్తున్నాడు!

ఇప్పటివరకు నేను పని చేసిన దర్శకుల్లో చంద్రశేఖర్‌ ఏలేటి, కె.రాఘవేంద్రరావుగారు వంటి ఇద్దరుముగ్గురు దర్శకుల మినహా.. ఎవరికీ కూడా డైరెక్షన్‌ పట్ల క్లారిటీ లేదు. కథగా చెప్పింది సినిమాగా తీయడంలో విఫలమయ్యేవారు. అయితే.. నాగేశ్వర్రెడ్డిగారి శైలి ప్రత్యేకమైనది. సన్నివేశాన్ని వివరించినదానికంటే పదింతలు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. సీన్‌ టు సీన్‌ ఫుల్‌ క్లారిటీ ఉన్న దర్శకుడాయన. రఫ్‌గా చెప్పాలంటే.. నా బెండు తీస్తున్న దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి.

సన్నీలియోన్‌ను సాంప్రదాయబద్ధంగా..

‘కరెంట్‌ తీగ’ చిత్రంలో పోర్న్‌స్టార్‌ టర్న్‌డ్‌ హీరోయిన్‌ సన్నీ లియోన్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సినిమాకి క్రేజ్‌ తీసుకురావడంతోపాటు క్యారెక్టర్‌కి కూడా యాప్ట్‌ కావడంతో ఆమెను తీసుకోవడం జరిగింది. అయితే.. సన్నీ లియోన్‌ను ‘కరెంట్‌ తీగ’ చిత్రంలో చాలా సాంప్రదాయబద్ధంగా చూపిస్తున్నాం. ఒక పాటకు మాత్రమే ఇందుకు మినహాయింపు. అది కూడా లేకపోతే.. సన్నీ ఫ్యాన్స్‌ చితక్కొడతారని…!

మంచి టీమ్‌ కుదిరింది

ఇప్పటివరకు నేను పని చేసిన చిత్రాలన్నింట్లో ‘కరెంట్‌ తీగ’ టీమ్‌ ది బెస్ట్‌. దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి, సంగీత దర్శకుడు అచ్చు, కథానాయకి రకుల్‌, మా కెమెరామెన్‌, రైటర్‌.. ఇలా అందరూ సినిమా పట్ల విపరీతమైన ప్యాషన్‌ ఉన్నవారే. మంచి టీమ్‌ కుదరినప్పుడు సినిమా ఔట్‌పుట్‌ ఎలా వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా? అందుకే ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను.

ఎందులోనూ వేలు పెట్టడం లేదు!

ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో నటనతోపాటు మరికొన్ని విభాగాల్లోనూ ఇన్‌వాల్వ్‌ అయ్యేవాడ్ని. ఫస్ట్‌ టైమ్‌ ‘కరెంట్‌ తీగ’ చిత్రంలో ఎటువంటి ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌ పెట్టుకోకుండా కేవలం నా పని (యాక్టింగ్‌) నేను చూసుకొంటున్నాను. 

పల్లెటూరబ్బాయిగా..

‘కరెంట్‌ తీగ’ చిత్రంలో నా పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో పల్లెటూరబ్బాయిగా కనిపిస్తాను. ‘కరెంట్‌ తీగ’ అనే టైటిల్‌కు తగ్గట్లుగా.. మిలియన్‌ వాట్స్‌ ఎనర్జిటిక్‌గా ఉంటుంది నా క్యారెక్టరైజేషన్‌.

అన్నయ్య చాలా అన్యాయం చేస్తున్నాడు!

ఈ సినిమాకి మా అన్నయ్య మంచు విష్ణు నిర్మాత. అన్నగా నాతో ఎంత ఫ్రీగా ఉంటాడో.. నిర్మాతగా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటున్నాడు. అలాగే నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. కానీ.. ఇప్పటివరకు నాకు రెమ్యూనరేషన్‌ మాత్రం ఇవ్వలేదు. మీరే ఏదో ఒకటి చేసి నాకు డబ్బులు ఇప్పించండి (పెద్దగా నవ్వుతూ..).

ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకొంటున్నాం..

ప్రస్తుతానికి నా కాన్‌సన్‌ట్రేషన్‌ మొత్తం ‘కరెంట్‌ తీగ’ పైనే పెడుతున్నాను. జూన్‌ నెలాఖరుకు షూటింగ్‌ పూర్తి చేసి.. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకోసం మా చిత్ర బృందం అహర్నిశలు శ్రమిస్తోంది.

‘సన్నాఫ్‌ పెదరాయుడు’ ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే..

‘కరెంట్‌ తీగ’ తర్వాత నేను నటించబోయే సినిమా ఏది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ‘సన్నాఫ్‌ పెదరాయుడు’ అనుకొన్నాం కానీ.. ఆ సినిమా ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఉంది. అలాగే మరో ప్రోజెక్ట్‌ కూడా.

మేం సపోర్ట్‌ చేసిన మోడీ గెలవడం ఆనందం..

ఈ సార్వత్రిక ఎన్నికల్లో.. మా మంచు కుటుంబం సపోర్ట్‌ చేసిన పొలిటిషియన్‌ నరేంద్ర మోడి. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టబోతుండడం చాలా ఆనందంగా ఉంది. అలాగే.. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు-కేసియార్‌గార్లకు నా అభినందనలు.

ఇంత చిన్న వయసులో.. అంత పెద్ద బాధ్యతలు మోయడం కష్టమని..

ప్రతి పుట్టినరోజు నాడు.. అందరూ ‘పెళ్లి ఎప్పుడు’ అని అడుగుతుంటారు. అయితే.. ‘ఇంత చిన్న వయసులో.. అంత పెద్ద బాధ్యతను మోసేందుకు నేను సిద్ధంగా లేను’. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నేను కూడా ప్రస్తుతానికి ‘పెద్దలు కుదిర్చిన పెళ్లి’ వైపే మొగ్గు చూపుతున్నాను. ఒకవేళ ముందుముందు నా మనసుకి నచ్చిన ‘మెరుపుతీగ’లాంటి అమ్మాయి తారసపడితే.. అప్పుడు ‘లవ్‌ మ్యారేజ్‌’ గురించి ఆలోచిస్తా!