తరతరాల కథ….మనం

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగానే కాక, ఎఎన్నార్, నాగ్, చైతన్య ముగ్గురు కలిసి నటించిన సినిమాగా ఓ క్రేజ్ ను సంతరించుకున్న చిత్రం మనం. జాతీయ విఖ్యాత నటుడు…

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగానే కాక, ఎఎన్నార్, నాగ్, చైతన్య ముగ్గురు కలిసి నటించిన సినిమాగా ఓ క్రేజ్ ను సంతరించుకున్న చిత్రం మనం. జాతీయ విఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ అలా మెరుపులా కనిపించడం మరో విశేషం. ఈ సినిమాకు సంబందించిన ముచ్చట్లను హీరో నాగార్జున 'గ్రేట్ ఆంధ్ర'తో పంచుకున్నారు.

మనం ప్రయాణం గురించి చెప్పండి

100%లవ్ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ నాగ్ చైతన్య స్టామినా గురించి చెప్పడం, ఆ తరువాత సినిమా చూడడంతో, నాన్నగారు, ముగ్గురం కలిసి ఓ సినిమా చేద్దామన్నారు. అందరికీ మనవలు వుంటారు. కానీ ఎదిగిన మనవడు వుండడం..నటుడిగా ప్రూవ్ చేసుకోవడం..అందుకే ఆయన ముచ్చటపడ్డారు. దాంతో కథలు వినడం ప్రారంభించాం. ఎంత సేపూ రొటీన్ కథలే. తాత ఓ జెనరేషన్, మనవడు ఓ జెనరేషన్, కాన్ఫ్లిక్ట్..ఇలాంటివే. వదిలేసాం. అలాంటి సమయంలో విక్రం కుమార్ కథ లైన్ వచ్చింది. మంచి లైన్ కానీ, కాస్త కష్టంగా, క్లిష్టంగా వుందని పించింది. రాఘవేంద్రరావుగారు, నాన్నగారు కూడా అదే అభిప్రాయపడ్డారు. ఇది చాలా ఈజీగా చెప్పగలగాలి అని. ఈ లోగా ఇష్క్ చూసాను. విక్రం చేయగలడనిపించింది. ఓకె అన్నాను. కానీ విక్రం స్క్రిప్ట్ కే ఏడాది టైమ్ అడిగాడు. సరే అన్నాను కానీ, నాన్నగారు ఎందుకో త్వరగా చేయి..వయసు మీదపడుతోంది అంటూ వచ్చారు. నేను స్క్రిప్ వినడానికి రెండున్నర గంటలు పడితే, నాన్నకు ఏడు గంటలు పట్టింది. అంత ఓపిగ్గా అన్నీ అడిగి, సవరణలు చెప్పి, అంతా చర్చించారు ఆయన. తాత మనవళ్ల కామెడీ మాంచి కమర్షియల్ ఫార్ములా అని చెప్పి, ఆయనే జోడింపంచేసారు కూడా. 

బేసిక్ లైన్ ఏమిటి?

1920 నుంచి 2013 మధ్యలో జరిగే జన్మజన్మల కథ. ఎవరికైనా ఏమైనా జరిగితే..అయ్యో అనుకుంటాం. కానీ ఆ జరిగిన అన్యాయం మరో జన్మలో సరిదిద్దుతుంది తెలియని శక్తి లేదా కాలం. కానీ అలా సరిదిద్దిన సంగతి మనకు తెలియనే తెలియదు. అలాంటి కథ ఇది.

వినడానికే కాస్త ఇబ్బందిగా వున్నట్లుంది..?

నిజమే. కానీ తెరపై చూడండి. ఎంత సింప్లిఫై చేసి చెప్పామో? అసలు ఈ జన్మలు, వాటి వ్యవహారాలు అవేమీ అర్థం కానీ సాదా సీదా జనాలకు కూడా ఇట్టే పట్టేస్తుంది. 

అంత సింప్లిఫై చేసాం. చాలా హోమ్లీగా వుంటుంది. ఆనాటి కాలం. ఆ పరిసరాలు, బ్రిటిష్ కాలం నాటి క్లాక్ టవర్, అదే కీలకంగా జరిగే మ్యాజిక్..భలేగా వుంటాయి. ఇటీవల కాలంలో ఇలా ఆనాటి కాలం సెట్ వేయడం అరుదు.

మద్రాసు పట్టణం వచ్చింది కదా.?

అవును..

ఎఎన్నార్ మనం లో షేర్ చేసుకున్న స్క్రీన్ టైమ్ ఏ మేరకు.?

ఆయన పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఆ పై సెకండాఫ్ అంతా వుంటుంది. నిజానికి సినిమా చైతన్య పాత్రతో ప్రారంభం అవుతుంది. ఆపై కొంత సేపటికి నా పాత్ర వస్తుంది. తరువాత నాన్నగారి పాత్ర. ఇలా స్టెప్ బై స్టెప్ అన్నమాట.

మనం సినిమా మీ ముగ్గురు నటించడం వల్ల గొప్ప సినిమా అనుకుంటున్నారా..అసలు కథే అటువంటిదా..?

రెండూను. కథ అద్భుతమైనది. దానికి తోడు మేము ముగ్గరు వుండడం వల్ల, డైలాగులకు అదనపు అర్థాలు వస్తాయి. ప్రేక్షకులు మమ్మల్ని వాటికి కనెక్ట్ చేసుకుంటారు.

అడియో ఫంక్షన్ చేయను అన్నారు..?

నేను ఎక్కడా అనలేదే..కానీ ఒకటి ఫంక్షన్ అనగానే అభిమానులు వస్తారు. కింగ్ అంటూ కేకలువేస్తారు. ప్రతి ఒక్కరు స్టేజ్ పైకి వచ్చిన తరువాత అక్కినేని లేని లోటు కనిపిస్తోంది అంటారు. నేను భరించలేను..అందుకే వదిలేసాను. ఫైగా అది ప్లస్ అయింది. ఒక్కోపాట విడుదల చేయడం.

మరి సంగీతోత్సవం ఎందుకు చేసారు?

ఏక్ట్యువల్ గా అది నేను నా క్లోజ్ సర్కిల్ తో కలిసి చేసింది. అది కూడా చానెల్ కోసం.

మీ నాన్నగారి మెమోరియల్ మాటేమిటి?

చేయాలి. గుర్తుంది. ఆలోచిస్తున్నాను. మ్యూజియం..ఇంకా చాలా చాలా. ఎలా వుండాలా అని.

ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారా?

మనకెందుకుండీ..మనకు లేదా ఏమిటి?

ఎన్టీఆర్ కు చేసారు కదా..?

వదిలేయండి ప్లీజ్..

మీలో ఎవరు కోటీశ్వరుడు సంగతులు?

9న ప్రారంభమవుతోంది. 45 ఎపిసోడ్లు పస్ట్ సీజన్. ఆ తరువాత చూద్దాం ఆదరణ బట్టి. కానీ ఒకటి. పాల్గొనే ప్రతి ఒక్కరి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. 

మీ తరువాతి ప్రాజెక్టులు..?

ఒకటైతే అనుకున్నాం. వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ నేను. చూద్దాం. అవుతుందనే అనుకుంటున్నా

మణిరత్నం ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది?

నాకు తెలియదు. వచ్చారు. ఓకె అన్నాను.మహేష్ కూడా ఓకె అన్నాడు. తరువాత మణే ఫోన్ చేసి, డేట్లు అవీ ఇవీ అంటే ఏదో చెప్పి, ప్రస్తుతానికి చేయడం లేదన్నాడు.

లైన్ మీకు నచ్చలేదని..?

అదేం లేదు. మంచి లైన్ ..నాకు నచ్చంది.

గీతాంజలి మీ కెరీర్ బెస్ట్ ఛాయిస్ అన్నారు..మరి వరస్ట్..?

వుంటాయి.. లేటెస్ట్ గా భాయ్..హాంటింగ్ వన్. చాలా మందికి నష్టం. వంద రూపాయిలు టికెట్ కొని చూసిన వాళ్ల దగ్గర నుంచి, చాలా మందికి.

ఎవరిది తప్పు.?

నాదే. నాకు నప్పని స్క్రిప్టును ట్రయ్ చేయడం. ఎవర్నో ఎందుకు నిందిస్తాను. రజనీ సినిమా రజనీయే చేయాలి. కమల్ సినిమా కమలే చేయాలి.

చిన్న సినిమాలు నిర్మించడం.?

రెండు అనుకుంటున్నాను.రామ్ మోహన్ (ఉయ్యాల జంపాల)తో ఒకటి . మరొకటి కూడా వుంటుంది.

మనం గురించి చివరిగా ఏం చెబుతారు..?

ఇదో మెమరబుల్ సినిమా అవుతుంది. చూసినవాళ్లకు, చేసిన మాకు కూడా.

చాణక్య

[email protected]