నాగ్ చైతన్య. అక్కినేని మూడో తరం హీరో. ప్రేమ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లలో మంచి విజయాలు నమోదు చేసిన హీరో. యాక్షన్ జోనర్ లో కూడా మాంచి సక్సెస్ చూడాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఈసారి 'యుద్ధం శరణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన క్లాస్ మేట్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించిన యుద్దం శరణం విడుదల సందర్భంగా నాగ్ చైతన్యతో ఇంటర్వూ.
యుద్ధం శరణం, మరి విజయం తథ్యమేనా?
యుద్ధం ముగిసే వరకు తెలియదు కదా? విజయం సంగతి. విజయం వరించాలనే ఎవరైనా యుద్ధం చేసేది. నేనూ అదే చేస్తున్నా.
అక్కినేని వారి వారుసడిగా, మిమ్మల్ని లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లలో చూస్తామని ముద్ర వేసేసారు. మీరు మళ్లీ యాక్షన్ అంటున్నారు?
ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. ఒకటి నాకు అంటూ ఓ సరదా వుంటుంది కదా? ఈ జోనర్ లో కూడా నన్ను ప్రూవ్ చేసుకోవాలని. అలాగే ఇక రెండో పాయింట్. ఈ జోనర్ లో ఎక్కడ తేడా కొడుతోంది అన్నది కూడా తెలుసుకుని తప్పు దిద్దుకోవాలి కదా? అందుకే చేస్తున్నా.
అంటే మాస్ ముద్ర కోసమా? యాక్షన్ హీరో ముద్ర కోసమా?
మాస్ ఇమేజ్ కోసం కాదు. మాస్ సినిమాలు వేరు. ఇప్పుడు నేను చేస్తున్న తరహా యాక్షన్ సినిమాలు వేరు. ఇక్కడ యాక్షన్ వుంటుంది. కానీ ఒక్కడు పాతిక మందిని కొట్టేయడం వుండదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. ఈ జనరేషన్ ఎలా వుంటోందో, యాక్షన్ కూడా అలాగే వుంటుంది.
సరే, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు చేసారు. యాక్షన్ సినిమాలు ట్రయ్ చేస్తున్నారు. ఈ తరం యూత్ ఇష్టపడుతున్న క్లాస్ ఫన్ జోనర్ సినిమా ఎప్పుడు?
అది కూడా చేయాలనే. మారుతి డైరక్షన్ లో ఆ కోరిక తీరుతుందేమో?
మారుతి సినిమా పెళ్లి నేపథ్యం అనీ, సమంత హీరోయిన్ అనీ..?
అదేం కాదు. ఇంకా స్క్రిప్ట్ విననే లేదు. జస్ట్ లైన్ ఏదో వుందని చెప్పారు. ఆయన, నేను ఫ్రీ అయ్యాక స్క్రిప్ట్ వినాలి.
క్లాస్ ఫన్ అంటే ఇంద్రగంటి గుర్తుకు వస్తారు. ఆయనతొ సినిమా ఏమయింది?
అది కూడా వుంటుంది. ఆయనతో కూడా సినిమా చేస్తాను.
సమంతతో మళ్లీ సినిమా చేయాలని వుందా? పెళ్లి తరువాత?
చేయాలనే వుంది. కానీ ఈసారి పూర్తిగా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చేయాలని వుంది. మాంచి ఎమోషన్లు, డెప్త్ పండేంత మాంచి స్క్రిప్ట్ కావాలి. అది తెచ్చే డైరక్టర్ కావాలి.
మణిరత్నం రేంజ్ లోనా?
అలాగే అనుకోండి.
కమింగ్ టు యుద్ధం శరణం. మీ క్లాస్ మేట్ అని చాన్స్ ఇచ్చారా? స్క్రిప్ట్ లో విషయం వుందా?
కృష్ణ నేను చాన్స్ ఇవ్వడానికి ముందే చాలా నేర్చుకున్నాడు. చాలా మంది దగ్గర పని చేసాడు. ఈ స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేసాకే చాన్స్ ఇచ్చాను.
ఈ సినిమా సురేష్ నుంచి ఇటెందుకు వచ్చింది?
మామయ్య సంగతి తెలుసుగా. ఆయన ఒక సినిమా చేయాలంటేనే వంద ఆలోచిస్తారు. అలాంటిది నేనే రాజు నేనే మంత్రి చేస్తూ, ఈ సినిమా చేయడం ఎలా? అందుకే నేనే అడిగా బయటకు ఇచ్చేయండి మామయ్యా అని.
మరి సురేష్ తో ఎప్పుడు సినిమా?
చేయాలి. అది కూడా కచ్చితంగా వుంటుంది.
ఈ సినిమాకు కూడా కట్ లు, రీషూట్ లు చేసారా?
నాన్న నేర్పింది అదే. సినిమా థియేటర్లోకి వెళ్లాక మనం ఏమీ చేయలేం. ఏం చేసినా ముందే చేయాలి. మనకు నమ్మకం వున్న నలుగురికి చూపించి, అభిప్రాయాలు తెలుసుకుని, అన్ని విధాలా సరి చేసుకుని విడుదల చేస్తే మంచిదే కానీ, తప్పు కాదు. ఈ సినిమాకు కూడా అన్నీ చూసుకున్నాం. కానీ సరైన డేట్ కోసం ముందుగానే వచ్చేస్తున్నాం.
అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా రష్ చూసారా?
నాన్నగారు కీలకంగా చూస్తున్నారు. నేను కూడా ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాను. చాలా బాగా వస్తోంది ఆ సినిమా. అఖిల్ మాంచి హిట్ కొడతాడని నాకు గట్టి నమ్మకం వుంది.
సమంత, పెళ్లి వ్యవహారంపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పీ, చెప్పీ బోర్ కొడుతోందా?
తప్పదు కదా? అడిగినపుడు చెప్పాలి. అయినా లైఫ్ లో వన్ టైమ్ ఈవెంట్. ఎంజాయ్ చేయడమే వాటిని కూడా.