ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నదనే వార్తలు వ్యాఖ్యానాలు గత కొన్ని రోజులుగా ముమ్మరంగా షికారు చేస్తున్నాయి. గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో తిష్టవేసి ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి మార్పు గురించి ముమ్మరంగా చర్చ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి లలో ఒకరిని సీఎం పదవిలో కూర్చుండబెడతారని వార్తలు వచ్చాయి. కావూరి సాంబశివరావును కూడా అడగినట్లుగా చెప్పుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో… రాష్ట్రానికి చెందిన కీలక నాయకులు కొందరిని ముఖ్యమంత్రి పదవి గురించి కేంద్రంనుంచి సంప్రదించిన మాట నిజమే గానీ.. నాయకులు ఎవ్వరూ సుముఖత వ్యక్తం చేయలేదని కూడా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యమంత్రి పదవి చేపట్టడం గురించి అడిగినప్పుడు.. నాయకులు మాత్రం.. తమకు ఇష్టం లేదని చెబుతున్నారట. ప్రధానంగా ఇది అల్పాయుష్షు సీఎం పోస్టని, దీనిద్వారా పరువునష్టం తప్ప లాభం ఏమీ లేదని భావిస్తున్నారట. ఇప్పుడు సీఎం ను మార్చడానికి కసరత్తు ప్రారంభించినా.. తంతు పూర్తయి ప్రమాణస్వీకారాలు జరిగే సమయానికి నెలరోజులు పట్టవచ్చుని అంచనా. కనీసం డిసెంబరునుంచి కొత్త ముఖ్యమంత్రి ఉంటారనుకుంటే.. ఎన్నికలు లోగా విభజన జరక్కపోయినా కూడా.. పదవీ కాలం మహా అయితే అయిదు నెలల ఉంటుంది. ఈలోగా విభజన జరిగితే.. ఇంకా తగ్గిపోతుంది. అంటే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువకాలం పదవిలో ఉన్న నాయకుడిగా అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది. అవును ముఖ్యమంత్రుల గణాంకాలు పరిశీలిస్తే వాస్తవాలు అలాగే ఉన్నాయి.
ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం అయిన, దిగిపోయిన నాదెండ్ల భాస్కరరావును మినహాయిస్తే.. కాంగ్రెసు ముఖ్యమంత్రుల్లో భవనం వెంకట్రాం అత్యల్పంగా 211 రోజులు మాత్రమే సీఎం పదవిలో ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత.. రోశయ్యను గద్దె ఎక్కించినప్పుడు కూడా.. రోశయ్య అనేక సందర్భాల్లో.. తాను 212 రోజులు ఈ పదవిలో ఉంటే చాలునని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యల్పకాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అనే అపకీర్తి తన రికార్డుల్లో లేకుండా ఉంటే చాలునని పలుసందర్భాల్లో తన సన్నిహితులతో అంటుండే వారని వార్తలు వస్తుండేవి. ఆయన అంతకంటె సుదీర్ఘ కాలమే ఆ పదవిలో ఉండి, దాన్ని కాస్తా కిరణ్ రెడ్డి చేతుల్లో పెట్టి పోయారు. తీరా ఇప్పుడు సదరు అల్పాయుష్షు పదవి మరొకరి కోసం వెతుకుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే రోశయ్య సూత్రాన్నే అనుసరిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు మాకొద్దంటే మాకొద్దంటూ సీఎం పదవిని తిరస్కరిస్తున్నారట.
మొత్తానికి అల్పాయుష్షు సీఎం పదవిని స్వీకరించడానికి ఎవ్వరూ సుముఖంగా లేరని, కిరణ్‌ను మార్చలేకపోవడానికి అది కూడా ఒక కారణం అవుతుందని పలువురు భావిస్తున్నారు.
-కపిలముని