ఎమ్బీయస్‌ : కెసియార్‌ గడుసుదనం – 2/2

తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆశల పునాదిపై ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గన్న నాయకులందరూ – ఏ పార్టీకి చెందినవారైనా సరే – సకల కష్టాలకూ కారణం ఉమ్మడి రాష్ట్రమేననీ, సర్వ అనర్థాలకూ కారణం ఆంధ్రులేననీ…

తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆశల పునాదిపై ఏర్పడుతోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గన్న నాయకులందరూ – ఏ పార్టీకి చెందినవారైనా సరే – సకల కష్టాలకూ కారణం ఉమ్మడి రాష్ట్రమేననీ, సర్వ అనర్థాలకూ కారణం ఆంధ్రులేననీ నూరిపోశారు. వీరందరూ దశాబ్దాలుగా అధికారంలో వున్నవారే, పదవులు అనుభవించినవారే. తమ ప్రాంతాలకు తాము ఏం చేశారో, ఏం చేయలేకపోయారో చెప్పుకోకుండా ఆంధ్ర ముఖ్యమంత్రుల కారణంగానే అభివృద్ధి జరగలేదని సాకులు చెప్పారు. ఒక్కసారి రాష్ట్రమంటూ వచ్చేస్తే ఆంధ్రుల్ని తరిమివేయవచ్చనీ, అప్పుడు యింటికో ఉద్యోగం, ఉద్యోగంలో వున్నవారికి పదోన్నతి, ప్రతీ పేదవాడికీ పక్కా యిల్లు.. యిలా స్వర్గం భూతలంపై దిగివస్తుందని నమ్మించారు. కేంద్రాన్ని అడిగి విద్యుత్‌ ప్రాజెక్టులు, స్టీల్‌ ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు అన్నీ తెచ్చేసుకుంటామని ఊరించారు. 

వీటిలో ఎన్ని జరుగుతాయి చెప్పండి. చట్టరీత్యా ఆంధ్రుల్ని తరమగలరా? రాష్ట్రం విడిపోయినపుడు ఉద్యోగాల సంఖ్య తగ్గదా? అడిగినవాళ్లందరికీ కేంద్రం అప్పనంగా నిధులు యిస్తుందా? తమకు బయటనుండి మద్దతు యిచ్చే పార్టీలు పాలించే రాష్ట్రాలకు మాత్రమే యిస్తుంది. పైగా మన ప్రాంత ప్రతినిథులు గట్టిగా అడిగి తెచ్చుకుంటేనే యివి సాధ్యం. అడిగే శ్రద్ధ, దమ్మున్నవాళ్లయితే యీ పాటికే చాలా అడిగి వుండేవారు. విభజన తర్వాత తెలంగాణ ముఖచిత్రం హఠాత్తుగా మారుతుందని అనుకోలేం. అధికారంలోకి ఎవరు వస్తారో వారి పాలనాపటిమపై చాలాభాగం ఆధారపడి వుంటుంది. అసలు సుస్థిరప్రభుత్వం ఏర్పడుతుందా అన్నదే డౌటు. 

ఇలాటి పరిస్థితుల్లో ప్రజల ఆశలు నెరవేరకపోతే ఆ చివాట్లు కెసియార్‌కే పడతాయి. బ్రిటిషువాళ్లు వెళ్లిపోయాక ఏవో అద్భుతాలు జరిగి మన బతుకుల్లో వెలుగులే వెలుగులని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గన్నవారు మనసా, కర్మణా నమ్మారు. అవేమీ జరగకుండా, జరిగిన మేలేదో కొద్దికొద్దిగా నెమ్మదిగా జరగడంతో నిరాశపడి, స్వాతంత్య్రపోరాట సారథి ఐన గాంధీగార్ని తిట్టనారంభించారు. ‘గాంధీ గారు స్వాతంత్య్రం తెచ్చి ఏం ఉద్ధరించారు? ఇంగ్లీషువాళ్ల జమానాయే బాగుండేది.’ అనసాగారు. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే గాంధీగారు పోయారు. అనుకున్నంత ప్రగతి జరగకపోతే ఆయన్నెందుకు తప్పుపట్టాలి? అయినా గాంధీని ఉద్దేశించి సెటైర్లు, వెటకారాలు పేలుస్తూనే వున్నారు. అది చాలనట్టు ‘అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాబట్టి యీ అగచాట్లు’ అంటూ యిటీవల యింకో పాయింటు లాగారు. రేడియోలో ఆ ప్రకటన, ఉపన్యాసాలు వినేందుకు ఇంగ్లీషువాళ్లకి అనువైన టైము కాబట్టి అప్పుడు పెట్టి వుంటారు. కానీ దాన్నీ తప్పుపడుతున్నా రిప్పుడు. ఎందుకు? మన ఆశలు నెరవేరలేదు కాబట్టి! 

అందువలన రేపు తెలంగాణ విషయంలో కూడా ఆశాభంగం జరిగినపుడు ‘ఈ కెసియార్‌కు పని లేదు. తీరికూర్చుని తెలంగాణ అంటూ లల్లి చేసి తెచ్చిపెట్టాడు. ఏం మంచి జరిగింది? కలిసివున్నపుడే బాగుండేది’ అనవచ్చు. ఈ ప్రమాదం తనకు మాత్రమే వున్న విషయం తెలుసు కాబట్టే కెసియార్‌ తెలంగాణ భవిష్యత్తును యింకొకరి చేతిలో పెట్టి కూర్చోవడానికి సిద్ధంగా లేరు. చిరంజీవి అయితే స్వతహాగా రాజకీయనాయకుడు కాడు. పార్టీ నడపడం చాలా భారంగా ఫీలయి, దాన్ని కాంగ్రెసులో కలిపేసి హమ్మయ్య అనుకున్నారు. కెసియార్‌కు రాజకీయాలు వృత్తి. ఒక పార్టీ చైర్మన్‌గా అధికారం చలాయించడం ఆయనకు నచ్చిన పని.  ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవర్ని కావాలంటే వాళ్లను పల్లకి ఎక్కించడం లేదా పూచికపుల్లలా తీసిపారేయడం – ఆయన అలవాటు. కాంగ్రెసులో  విలీనం చేస్తే యీ ఆటలు సాగవు. సోనియా కటాక్షవీక్షణం కోసం మరో పదిమందితో పోటీపడాలి. 

ఈ వాదనలు యివాళ పుట్టుకుని వచ్చినవి కావు. ఎప్పణ్నుంచో వున్నవి. హరీశ్‌రావు బహిరంగంగా చెప్తున్నవి. అయితే యిన్నాళ్లూ కెసియార్‌ కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధంగా వున్నట్టు కలరింగ్‌ యిచ్చారు. అది నమ్మి తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియాకు హామీలు గుప్పించేశారు. ఆవిడ నమ్మిందనే అనుకోవాలి. ఎందుకంటే జాతీయ మీడియాతో సహా అందరూ రాస్తున్నది – ‘తెలంగాణలో కెసియార్‌ను, సీమాంధ్రలో జగన్‌ను కలుపుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి కాంగ్రెసు రాజకీయపరంగా వేసిన ఎత్తుగడకు లోబడే తెలంగాణ ప్రకటన వచ్చింది’ అని. తెలంగాణ ప్రకటిస్తే తెరాస భవనం వద్ద ఎవరూ వుండరని, అందరూ కాంగ్రెసువారి గాంధీ భవనంలోనే పడిగాపులు కాస్తారని టి-కాంగ్రెసు నాయకులు ప్రకటనలు చేశారు. సోనియా ప్రకటన చేయడమే కాదు, తెలంగాణ గుఱ్ఱాన్ని పరుగులు పెట్టిస్తోంది. కానీ జరుగుతున్నదేమిటి? మొన్న బోధన్‌లో మీటింగు పెడితే జనం రాలేదు. తెలంగాణ యిచ్చిన క్రెడిట్‌ను కాంగ్రెసు ఓట్లగా మార్చుకునే అవకాశం కనబడటం లేదు. వచ్చే ఎన్నికలలో తెరాసతో తలపడితే కాంగ్రెసు  నిలవదన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తోంది. తెలంగాణ ప్రకటించేవరకు తెరాసకు కాంగ్రెసుతో అవసరం వుంది కానీ, ప్రకటన తర్వాత కాంగ్రెసుకే తెరాసతో అవసరం వుంది అని స్పష్టంగా తెలుస్తోంది. 

ఇలాటి పరిస్థితుల్లో కాంగ్రెసుతో విలీనం కావాలని తెరాస ఎందుకు తహతహలాడుతుంది? కాంగ్రెసులో నాయకులెక్కువ. వారందరినీ తృప్తిపరచడం ఎవరి సాధ్యమూ కాదు. వారికి టిక్కెట్లిచ్చాక తెరాసలో ముందునుండీ వున్నవారికి టిక్కెట్లే మిగలవు. ఈ పరిస్థితుల్లో కెసియార్‌ కాంగ్రెసుతో విలీనం కారు. మహా అయితే పొత్తు పెట్టుకుంటారు. కెసియార్‌తో పొత్తు అంటే అది ఎంత లక్షణంగా వుంటుందో 2004, 2009 ఎన్నికలు చూపించాయి. తన జీవితంలో చేసిన ఘోరతప్పిదం తెరాసతో పొత్తు పెట్టుకోవడం అని బాబు అనేకసార్లు అన్నారు. మహా కూటమిని మహా కొలిమి చేసి కెసియార్‌ ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టారు. ఫైనల్‌గా తనూ బాగుపడలేదు, టిడిపిని బాగు పడనీయలేదు. అదంతా వైయస్సార్‌ ప్రోత్సాహంతో చేశారని కొందరు అంటారు. ఏది ఏమైనా కెసియార్‌ నమ్మదగ్గ భాగస్వామి కాదని గత అనుభవాలు చెప్తున్నాయి. అందువలన విలీనం అయితీరాలని ఢిల్లీ కాంగ్రెసు నాయకులు పట్టుబట్టి వుంటారు. ఎలాగోలా తెలంగాణ తెచ్చుకోవాలనే ఆతృతతో ‘అవశ్యము, అలానే జరుగుతుంది’ అని వాళ్లను టి-కాంగ్రెసువాళ్లు నమ్మించారు. కెసియార్‌ కూడా వాళ్లతో బాటు కలిసి నాటకం ఆడి ఢిల్లీని నమ్మించి, జులై 30 ప్రకటన వచ్చేట్లు చేశారు. 

ఇప్పుడు తోకఝాడించారు. విలీనం ప్రశ్నే లేదని. తెలంగాణను పాలించేది తెరాసయేననీ ఈటెల చేత చెప్పించారు. తర్వాత తనూ అదే మాట చెప్పారు. ఇంకోళ్లను గద్దె నెక్కించడానికై మావాళ్లు యిన్నాళ్లూ కష్టపడినది? మేమేమైనా సన్యాసులమా, పదవులు వద్దనడానికి? అని అడిగారు. జులై 30 ప్రకటన తర్వాత మౌనం పాటించిన కెసియార్‌, కాంగ్రెసు తెలంగాణ ప్రక్రియ వేగం పెంచినకొద్దీ మరిన్ని అవరోధాలు పెట్టసాగారు. ఉమ్మడి రాజధాని పదేళ్లు ఎందుకు? రెండు, మూడేళ్లు చాలు అంటున్నారు. అయినా ఉమ్మడి రాజధాని అన్నది దేశంలో ఎక్కడా లేదు, ఎక్కడా లేని చట్టం యిక్కడ పెడితే ఎందుకు ఊరుకుంటాం? అని అడిగారు. కేంద్రం చేతిలో శాంతిభద్రతలు అనే అంశాన్ని కూడా గట్టిగా ఎదుర్కుంటున్నారు. పాలన ఒకరి చేతిలో, అధికారం మరొకరి చేతిలో – అదెలా? ఎక్కడైనా వుందా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇవన్నీ జులై 30 న చెప్పిన అంశాలే. అప్పుడు అడగలేదాయన. అడిగి వుంటే కాంగ్రెసు వ్యవహారాన్ని మెల్లగా నడిపేది. జిఓఎమ్‌ ఏర్పరచాక, గడువు కూడా తీసేశాక యిప్పుడు అడుగుతున్నాడీయన. ఈ మోసాన్ని ఎదుర్కోవడానికి యుద్ధం చేస్తానంటున్నాడు. కేంద్ర హోం శాఖ విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పరచిన మాజీ డిజిపిల సమావేశానికి తమ పార్టీ సభ్యుడు పేర్వారం రాములును పిలవలేదేమని హుంకరిస్తున్నారు. 

టి-కాంగ్రెసువారికి కూడా యివే అభ్యంతరాలున్నా పైకి అనలేరు. అంటే ఢిల్లీ తాట తీస్తుంది. అనగలిగిన కెసియారే ఉద్యమకారులకు హీరో అవుతారు. తను చెప్పినవి అమలు కాకపోతే ఆ తప్పును కెసియార్‌ టి-కాంగ్రెసువాళ్లపై తోసేస్తారు. వాళ్ల వలననే మనం కోరుకున్న విధంగా సంపూర్ణ తెలంగాణ సిద్ధించలేదు అంటారు. ఇవన్నీ చూసి ఢిల్లీ వారు పిలిచి ‘మీరు విలీనం అవుతారనే మేం యీ స్టెప్‌ తీసుకున్నాం’ అని గట్టిగా ఒత్తిడి చేస్తే కెసియార్‌ ‘కార్యకర్తల అభిమతానికి వ్యతిరేకంగా వెళ్లడం కుదరదు. వారి మాటే నాకు శిరోధార్యం’ అంటారు. కాంగ్రెసుతో విలీనం జరిగితే కలిగే అనర్థాలన్నీ ఏకరువు పెడతారు. ఇవి జులై 30 కి ముందూ వున్నాయి, తర్వాతా వున్నాయి. అప్పుడు మౌనంగా వుండి, యిప్పుడు చెప్పడమే కెసియార్‌ గడుసుదనం. ఆయన రాజకీయం వరకూ ఆయన కరక్టు. కెసియార్‌ని ఎలాగైనా కాంగ్రెసులోకి తెచ్చి, తెలంగాణలో 15 పార్లమెంటు సీట్లు తెప్పిస్తామని నమ్మబలికిన టి-కాంగ్రెసు నాయకులు ఢిల్లీ నాయకులకు ఏం చెప్పుకుంటారో, అక్కడ మొహం ఎలా చెల్లుతుందో చూడాలి. తెరాసతో విలీనం లేకుండా కేవలం పొత్తు మాత్రమే అయితే కెసియార్‌ వీళ్లకు ఎన్ని పార్లమెంటు సీట్లు విదిలిస్తారు? మహా అయితే పదో పన్నెండో ! అవి కూడా సమైక్యవాదం బలంగా వుండి, తెరాసకు ఛాన్సు లేని హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం వంటి జిల్లాల్లో! అక్కడ సమైక్యవాదానికై నిలబడిన వైకాపాతో కాంగ్రెసు పోటీపడాలి. ఇలా చూస్తే అల్టిమేట్‌గా తెలంగాణలో కాంగ్రెసు గెలిచేవి మహా అయితే ఆరో ఏడో తేలతాయి. సీమాంధ్రలో జరిగే భారీ నష్టంతో పోలిస్తే యిది బఠానీ గింజల్లాటిది. ఇలా జరిగితే తెలంగాణ ప్రకటించి కాంగ్రెసు బావుకునేది ఏముంది? – (సమాప్తం)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

[email protected]

                                                       Click here For Part-1