కపిలముని : హోంశాఖ ప్రత్యుత్తరం కీలకం!

రాష్ట్ర విభజన అనే చర్య రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నదంటూ.. ముఖ్యమంత్రి కిరణ్‌, రాజ్యాంగ పరిరక్షకుడు, రాజ్యాంగ బద్ధమైన అధికారాల పరంగా సర్వోన్నతుడు అయిన దేశాధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. బాగానే ఉంది. కిరణ్‌ ప్రధానంగా…

రాష్ట్ర విభజన అనే చర్య రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నదంటూ.. ముఖ్యమంత్రి కిరణ్‌, రాజ్యాంగ పరిరక్షకుడు, రాజ్యాంగ బద్ధమైన అధికారాల పరంగా సర్వోన్నతుడు అయిన దేశాధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. బాగానే ఉంది. కిరణ్‌ ప్రధానంగా చేసిన ఆరోపణ రాజ్యాంగ విరుద్ధంగా ప్రక్రియ సాగుతోందన్న విషయం మాత్రమే. ఆ విషయాన్ని పర్యవేక్షించేది హోం శాఖ గనుక, ఆ ఆరోపణలు వారికే వర్తిస్తాయి గనుక.. రాష్ట్రపతి ఆ లేఖను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపేశారు. ఈ లేఖను తన చెంతనుంచి అటువైపునకు ఫార్వార్డ్‌ చేయడంలో ప్రథమ పురుషుడు అనుసరించిన వేగాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. 

హైదరాబాదు నుంచి ఢిల్లీకి లేఖ వెళ్లిన మరురోజే ఆ లేఖ హోంశాఖకు వెళ్లిపోయింది. నిజానికి ఆయన ఇంత త్వరగా స్పందించాల్సిన అవసరం లేదు. తన పరిశీలనకు కేబినెట్‌ నిర్ణయాలు వచ్చినా కూడా వాటి మీద తనకు ఇచ్చమొచ్చినంత సమయం తీసుకుని పరిశీలించడానికి ఆయనకు అధికారం ఉంది. ప్రశ్నార్హం కాని అధికారాలు ఆయనవి. అయితే ఆయన తన చేతికి ఏ పాపమూ అంటకూడదనే ఉద్దేశంతోనే వెంటనే లేఖను ఫార్వార్డ్‌చేసినట్లు కనిపిస్తోంది. 

అయితే రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖను కేంద్ర హోంశాఖ నానుస్తూ కూర్చోవడానికి వీల్లేదు కదా! పైగా ఆయన అంత వేగంగా స్పందించి పంపినప్పుడు… అందులో తమ మీద వ్యక్తమైన ఆరోపణలకు సంబంధించి వారు ఎంతో కొంత వేగంగానే రాష్ట్రపతికి ప్రత్యుత్తరం ఇవ్వాల్సి ఉంటుంది కదా!

ఆ ప్రత్యుత్తరం అనేది ఇప్పుడు చాలా కీలకం. రాజ్యాంగ విరుద్ధ వ్యవహార సరళిపై వచ్చిన ఆరోపణలను హోంశాఖ ఎలా సమర్థించుకుంటుందో తెలిస్తే.. విభజన విషయంలో భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉండబోతాయో కూడా తేటతెల్లం అయిపోతుంది. ఒక్క విషయం మాత్రం నిజం. రాజ్యాంగ పరంగా తమకు అధికారం ఉన్నదని, అర్థసత్యాలతో హోంశాఖ రాష్ట్రపతిని వంచించే ప్రయత్నం చేయగలదేమో గానీ.. ముంజేతి కంకణంలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు.. రాష్ట్ర విభజన సమయంలో గతంలో పాటించిన సాంప్రదాయాలను ఇప్పుడు తుంగలో తొక్కేస్తున్న సంగతిని మాత్రం దాచిపెట్టడం దుస్సాధ్యం. 

అలాంటి నేపథ్యంలో హోంశాఖ ప్రత్యుత్తరంలో కేంద్రం అనుసరించబోతున్న వ్యూహం గురించిన చాలా మర్మం దాగి ఉంటుందని పలువురు భావించడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్రపతి లేఖ పంపారంటే.. వీరు ఊరకనే అక్నాలెడ్జిమెంటు మాత్రం ఆయనకు పంపి, పట్టించుకోకుండా ఉండడం కుదరదు. స్పందించాల్సిందే. అయితే సదరు హోంశాఖ స్పందన ఏమిటో అది ఓపెన్‌  డాక్యుమెంట్‌గా ఉండాలి. తాము వంచనకు గురవుతున్నామని భావిస్తున్న ప్రజలకు ఆ ప్రత్యుత్తరంలో ఏముందో తెలిస్తే కాస్త కుదుటపడతారు. 

ఆ ప్రత్యుత్తరం బహిరంగ పరచాలి. అది తెలుగు ప్రజల హక్కు అని వారు గుర్తించాలి. ఒక రాష్ట్రాన్ని చీల్చడానికి జరుగుతున్న ప్రయత్నానికి కాన్ఫిడెన్షియల్‌ అని ముసుగు వేస్తే గనుక.. అది వంచనే అని మనం గ్రహించాలి. 

-కపిలముని