లవ్‌లెటర్‌ 2 హరగోపాల్‌: ఒదగడం అంటే ఏంటి?

పూజ్యులైన హరగోపాల్‌ గారూ… Advertisement మేధావులు కూడా వక్రభాష్యాలు చెబితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? హరగోపాల్‌ అంటే జ్ఞానం ఉన్న మేధావిగా ఆయన కు అన్ని వర్గాల వారిలోనూ పేరుంది. అలాంటి మేధావులు…

పూజ్యులైన హరగోపాల్‌ గారూ…

మేధావులు కూడా వక్రభాష్యాలు చెబితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? హరగోపాల్‌ అంటే జ్ఞానం ఉన్న మేధావిగా ఆయన కు అన్ని వర్గాల వారిలోనూ పేరుంది. అలాంటి మేధావులు నిజానికి ఒక ఉద్యమానికి దన్నుగా నిలబడితే కచ్చితంగా ఆ పోరాటానికి కాస్త క్రెడిబిలిటీ వస్తుంది. అయితే మేధావులైన మీరు కూడా స్పష్టంగా కనిపించే అవాస్తవాలు మాట్లాడితే ఎలాగ? మేధావులు కూడా అబద్ధాలతో జనం మధ్య విద్వేషాలను పెంచే కుట్రలో భాగస్వాములు అయితే ఎలాగ? మీ వంటి పెద్దలు తెలంగాణ ఏర్పడబోతున్నదని అంతా అనుకుంటున్న ప్రస్తుత కీలక తరుణంలో కూడా భవిష్యత్తులో ఇరు ప్రాంతాల ప్రజలు అనివార్యంగా కలిసి ఉండాల్సి వస్తుందని అనుకుంటున్న తరుణంలో విద్వేషాలు పెంచే మాటలు చెబుతున్నారు.

మీరు చెబుతున్న మాటల్లో విషం ఎలా ఉన్నదంటే..

1) ‘‘ఆస్తులను దోచుకున్న వాళ్లు తప్ప ఎవ్వరూ పరాయివాళ్లు కాదని కాంటున్నారు.’’ ఇంతకూ ఆస్తులను దోచుకోవడం అంటే మీ నిర్వచనం ఏమిటో మాత్రం చెప్పలేదు. 

2) ‘‘దశాబ్దాల కాలంగా అనేక ప్రాంతాల వారు హైదరాబాదు సంస్కృతిలో ఇమిడిపోయారని.. కానీ తెలుగువారైన సీమాంధ్రులే ఒదిగిపోలేదని’’ మీరు అంటున్నారు. 

ఒదిగిపోవడం అంటే తమ  నిర్వచనం ఏమిటో ఆయన ముందు స్పష్టం చేయాలి. ఆయన మాటలు హైదరాబాదులో స్థిర నివాసాలు ఏర్పరచుకున్న గుజరాతీలు, ఇతర ప్రాంతాల వారు అనేకులు వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడి ఉన్నారు. హైదరాబాదులో గుజరాతీల గురించి చాలా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. వీరి ఉదాహరణ తీసుకుని చర్చిద్దాం. (ఇది ఒక ఉదాహరణ మాత్రమే .. వారి మీద నింద కాదు.. అది వారి అలవాటు అంతే)

1) గుజరాతీలు ప్రధానంగా ఒక్కరు కూడా ఉత్పాదక రంగంలో ఉన్న వ్యాపారాల్లో ఉండరు. ‘ప్రొడక్టివ్‌’ వ్యాపారాల్లో కాకుండా దళారీ పాత్ర పోషించే వ్యాపారాలు మాత్రమే చేస్తుంటారు. ‘ఇధర్‌ కా మాల్‌ ఉధర్‌, ఉధర్‌ కా మాల్‌ ఇధర్‌’ చేతులు మార్చి మధ్యలో లాభాలు ఆర్జించడం తప్ప.. ఉత్పాదక రంగంతో నిమిత్తం ఉన్న వ్యాపారం చేసేవారు ఒక్కరూ ఉండరు. 

2) గుజరాతీల మీద సాధారణంగా హైదరాబాదులో ఒక నానుడి ఉంటుంది. కోట్లకు కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తుంటారు గానీ.. హైదరాబాదులో కనీసం ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ కూడా కొనరని, ఆస్తులు అన్నీ తమ స్వస్థలాల్లో మాత్రమే కొంటుంటారని చెబుతుంటారు. 

3) గుజరాతీలో పెట్టుబడులు పెట్టరు. కమిషన్‌ దందా వ్యాపారాలే తప్ప.. వ్యాపార రంగంలో వారు వెళ్లిపోయినా ఇక్క ఉండగల వ్యాపారాల జోలికి అస్సలు వెళ్లరు.

4) విద్యాసంస్థలు లాంటి విషయంలో వారు తమ పిల్లల్ని కనీసం ఇక్కడి ఇంగ్లీషు మీడియా స్కూళ్లలో కూడా చేర్చరు. తమ కోసం ప్రత్యేకంగా గుజరాతీ స్కూల్స్‌ను తామే ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే చదువుకుని గుజరాత్‌కు ఉపయోగపడగల ఒక మంచి నవయువతరాన్ని ఇక్కడ తయారుచేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి తెలుగు పిల్లల వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాంతం బాగుపడడానికి ఒక్క నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఏమీ చేయరు. కనీసం నిర్దిష్ట వ్యాపారం కూడా ఏమీ చేయరు.

అలాంటిది.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లంతా, హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్జించే వందల వేల కోట్ల రూపాయల సొమ్మును మాత్రం తమ రాష్ట్రానికి తరలించి.. అక్కడ మౌలిక పెట్టుబడులు, ఉత్పాదకరంగం అభివృద్ధి చేసుకుంటూ.. ఇక్కడ కేవలం అద్దెఇళ్లలో మాత్రమే జీవితం గడుపుతూ ఉండేవాళ్లు హైదరాబాద్‌ సంస్కృతిలో ఇమిడిపోయినట్లు అంటున్నారు తమరు!

ఇది మనది అనుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి, విద్యాసంస్థలు పెట్టి, ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ఇక్కడ పిల్లలు కూడా మంచి విద్యను పొందగలిగే అవకాశాలు మెరుగుపరుస్తూ వచ్చినవారంతా… బతుకుతున్న వారంతా.. దోపిడీదారులని వాక్రుచ్చుతున్నారు తమరు! హరగోపాల్‌ జీ! మీ విజ్ఞతకు, వివేచనకు ఇది పాడియేనా?

ఇక్కడ దళారీ వ్యాపారాలు చేస్తూ.. ఆర్జించిన సమస్త ఆదాయాన్నీ తమ సొంత రాష్ట్రాలకు తరలించుకుంటూ.. అక్కడ సంపద వృద్ధి చెందడానికి కారకులు అవుతూ ఉండేవారంతా మీలో ఒదిగిపోయినట్లా? ఇక్కడ సంపాదించే ప్రతిపైసాను, అదనంగా ఊర్లలో ఉన్న ఆస్తులను అమ్ముకుంటే వచ్చిన సొమ్ములను సమస్తంగా ఇక్కడే పెట్టుబడులు పెడుతూ ఇక్కడి మౌలిక ఆస్తులు వృద్ధి చెందడానికి కారకులు అవుతున్న వారు.. ఇక్కడి సంస్కృతిలో ఇమడలేదని అంటారా? ఇలాంటి దుర్మార్గమైన, ద్వేషపూరితమైన, విషపూరితమైన ప్రచారం చేయడానికి మీకు నోరెలా వచ్చింది. తెలంగాణను దోచుకున్నారనే అభిప్రాయం మీకు కొందరు వ్యక్తుల మీద ఉంటే ధైర్యంగా వారి పేర్లు చెప్పి వారి మీద మాత్రమే పోరాడండి. విమర్శలు గుప్పించండి. మిమ్మల్ని అనగల సాహసం చేయలేను గానీ.. మీ సరసన కూర్చుని వేదికల మీద నుంచి ద్వేష విషాన్ని సభికులతో పాటు మీకూ ఎక్కించడానికి ప్రయత్నించే రాజకీయ తైనాతీల గురించి ఖరారుగా చెప్పగలను. వారు అందుకు మాత్రం సాహసించరు. వారినుంచి వచ్చే దందాలు ఆగిపోతాయని భయం. అలాంటి నేపథ్యంలో… నిర్దిష్టత లేని ద్వేషాన్ని యావత్తు జాతిమీద విస్తరిస్తూ.. ఇరుగు పొరుగు ఇళ్లలో కలిసి బతుకుతున్న ప్రజల మెదళ్లలో విషం నింపే హక్కు మేధావి ముసుగు కింద మీకు ఉన్నదని ఎలా అనుకుంటారు?

మీరు రాష్ట్రం తీసుకోండి మంచిదే. అది వచ్చేలోగా ఇక్కడి మనుషుల్ని విషకీటకాల్లాగా మార్చకండి.. వచ్చింతర్వాత విద్వేషాగ్నులు రగిలేలాగా ఇప్పటినుంచే పెట్రోలు క్యాన్లతో సిద్ధం కాకండి దయచేసి. మీ పెద్దరికాన్ని, మీ మేధస్సు, మంచితనం మీద మాకందరికీ ఉన్న అపారగమైన గౌరవాన్ని దయచేసి నిలవనీయండి. 

-కపిలముని 

[email protected]