రాష్ట్రాన్ని విభజిస్తే తప్పేమిటి? అని కొంతకాలం బొత్స సత్యనారాయణ అడుగుతూండేవారు. పెద్ద ఉమ్మడి కుటుంబం నడుపుతూ మీరిలాగ ఆలోచించడమేమిటి? మీరంతా విడిపోతే యిప్పుడున్నంత బలం వుంటుందా? అని విజయనగరం వాసులు ఆయన్ని ప్రశ్నించారు. బొత్స కుటుంబసభ్యులందరూ కలిసి ఓటేస్తే ఓ కౌన్సిలరు గెలవగలడు, లేదా ఓడగలడు. అలాటి కథే ఒకటి మిజోరాంలోని బక్త్వాంగ్ గ్రామంలో ఎదురైంది. ఆ నియోజకవర్గంలో ఎవరైనా గెలవాలంటే జియోనా చనా అనే 69 ఏళ్ల పెద్దమనిషి ఆశీర్వాదం వుండాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఎంత పెద్దదంటే ఆయన ఒక్కడే కానీ ఆయనకు 39 మంది భార్యలు, 90 మంది పిల్లలు, 45 మంది మనుమలు, మనుమరాళ్లు వున్నారు. కొందరు భార్యల తాలూకు అత్తమామలు కూడా వారితో బాటు వుంటున్నారు. మిజోరాం వంటి చిన్న రాష్ట్రంలోని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలంత పెద్దవి కూడా కాదని గుర్తుంచుకుంటే ఆ యింట్లో వున్న 160 ఓట్లతో ఫలితాలు ఎలా తారుమారు చేయవచ్చో మీరే వూహించుకోండి.
చనా తండ్రి కూడా యిలాగే చాలామందిని పెళ్లి చేసుకుంటే కాథలిక్ చర్చివారు అభ్యంతర పెట్టి మాట వినకపోతే అతన్ని వెలివేశారు. అతను బయటకు వచ్చేసి తనకంటూ ఒక మతశాఖను ప్రారంభించి ఓ చర్చి పెట్టాడు. ఇది 70 ఏళ్ల క్రితం మాట. ఆ చర్చిలో యితను పూజారిగా కూడా వ్యవహరిస్తాడు. కానీ అది యితని హాబీ మాత్రమే. ఇతనిది ఫర్నిచర్ బిజినెస్. పొలాలు, కోళ్ల ఫారం, పందుల ఫారం కూడా వున్నాయి. తన ఓట్లతో సాధారణంగా కాంగ్రెసు పార్టీకి మద్దతు యిస్తూ వుంటాడు. స్థానిక ఎమ్మెల్యే యితనితో సత్సంబంధాలు నెరపుతూ వుంటాడు. నిరుద్యోగులకు ప్రభుత్వ పథకం ప్రకటించినపుడు యితను ఆ పథకం ద్వారా తన వూళ్లో అనేకమంది యువతీయువకులకు జీవనోపాధి కల్పించాడు. ఇలాటి మంచితనం వలన అనేకమంది యితని చర్చిలో చేరారు. ప్రస్తుతం 4 వేలమంది అనుయాయులున్నారు. వాళ్లందరికీ అతను ఓ దేవుడిలాటి వాడు. ఇంట్లో కుటుంబసభ్యుల మాట చెప్పనే అక్కర్లేదు. అందరూ అతన్ని ఆరాధిస్తారు.
అతని తొలి వివాహం 17 వ ఏట జరిగింది. వధువు అతని కంటె నాలుగేళ్లు పెద్దది. ఆ తర్వాత అతను వరసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూనే వున్నాడు. వారిలో కొందరు అతని కంటె పెద్దవాళ్లు కూడా వున్నారు. తాజా భార్య వయసు 33. 13 ఏళ్ల క్రితం చేసుకున్నాడు. ఏడుగురు భార్యలు 30 ఏళ్ల పడిలో వుంటే, పదిహేనుమంది 40 ఏళ్ల పడిలో వున్నారు. వీళ్లందరూ కలిసి నివసించడానికి నూరు గదుల భవంతి వుంది. భార్యలు 5 డార్మిటరీల్లో వుంటారు. ఒక్కోదానిలో ఎనిమిదేసి మంది. ఇతనికి విడిగా ఒక పెద్ద బెడ్‌రూమ్, రోజుకి ఒకర్ని చొప్పున పిలుస్తాడు. రోజుకి 40 కిలోల బియ్యం, 24 కిలోల పప్పు, 50 కిలోల కూరగాయలు, 40 కోళ్లు ఖర్చవుతాయి. ఈ వింతకాపురాన్ని చూడడానికి టూరిస్టులు వస్తూ వుంటారు. మనవాడు దాన్ని కూడా ఆదాయమార్గంగా మార్చుకున్నాడు. వాళ్లకోసం గెస్ట్‌హౌస్ కట్టించి అద్దె వసూలు చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తామంటే టిక్కెట్టు అంటాడు. కుటుంబంతో కలిసి ఫోటో దిగుతానంటే 150 డాలర్ల ఫీజు అంటాడు!
– ఎమ్బీయస్ ప్రసాద్