1929లో 46 ఏళ్ల సావర్కార్‌ను గోడ్సే మొదటిసారి కలిసేనాటికి అతనికి 19 ఏళ్లు. అప్పటికి మెట్రిక్ తప్పి వున్నాడు. గాంధీ ప్రబోధం చేత ఆంగ్ల ప్రభుత్వోద్యోగాలపై ప్రయత్నించకూడదని నిశ్చయించుకుని, వండ్రంగం వంటి వృత్తివిద్యలు నేర్చుకుంటున్నాడు. ఇంతలో పోస్టల్ డిపార్టుమెంటులో పనిచేసే అతని తండ్రికి రత్నగిరికి బదిలీ కావడం, అక్కడ ఆంక్షల మధ్య జీవిస్తున్న సావర్కార్‌ను కలిసి అతని వద్ద సెక్రటరీగా పనిచేయం జరిగాయి. సావర్కారు వద్ద పనిచేయడం చేతనే గోడ్సేకు ఇంగ్లీషు బాగా రాయడం, ఉపన్యాసాలు యివ్వడం వచ్చాయి. రెండేళ్లు గడిచాక తన తండ్రి రిటైరై, సాంగ్లీలో స్థిరపడినపుడు గోడ్సే కూడా అక్కడే టైలరింగు దుకాణం, పళ్ల దుకాణం తెరిచాడు. సావర్కారు శిష్యులు నాగపూర్ ముఖ్యకేంద్రంగా హిందూ సంఘటన్ ఉద్యమాన్ని ఆరంభించి, దాని శాఖను సాంగ్లీలో తెరిచినపుడు గోడ్సే ఆ శాఖకు సెక్రటరీగా పనిచేశాడు. 1937 తర్వాత సావర్కారు వూరూరూ తిరిగి ఉపన్యాసాలు యిస్తూ వుంటే గోడ్సే వెన్నంటే వున్నాడు. సావర్కార్ హిందూ మహాసభ పార్టీ పెట్టినపుడు సాంగ్లీ నుంచి పూనాకు మకాం మార్చి, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 1938లో నైజాం రాజ్యంలో హిందువులపై జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ హిందూ మహాసభ పంపిన వాలంటీర్ల మొదటి జట్టుకు నాయకత్వం వహించినది గోడ్సేయే.
''అగ్రణి'' (తర్వాత 'హిందూ రాష్ట్ర'గా పేరు మార్చారు) పత్రికకు సావర్కారు సహాయపడ్డారు. గాంధీపై హత్యాప్రయత్నం జరిపినపుడు గోడ్సే, సహచరులు బస చేసినది ఢిల్లీలోని హిందూ మహాసభ ఢిల్లీ కార్యాలయంలోనే. ఈ లింకుతోనే సావర్కారును గాంధీ హత్య కేసులో యిరికించారు. దానికి కారణం గాంధీ హత్య కేసు విచారించిన నగర్‌వాలా! సావర్కారు ఆశీస్సులు లేకుండా యీ కుర్రవాళ్లు యింత సాహసానికి ఒడిగట్టరని అతనికి గట్టి నమ్మకం ఏర్పడింది. హత్య జరుగుతూనే సావర్కారును అరెస్టు చేసి, ఆయన యింటి నుంచి జప్తు చేసిన కాగితాలన్నీ గాలించినా ఒక్క ఆధారమూ దొరకలేదు. ఇక ఎప్రూవరుగా మారిన దిగంబర్ బాహ్‌డగేను వాడుకున్నాడు. ''గోడ్సే ఆప్టేలు సావర్కారు ఆశీస్సులు పొందుతుండగా తను చూశాన'ని స్టేటుమెంటు యిచ్చాడు. దాని ఆధారంగా ఆయనను జైల్లోనే వుంచారు. కాంగ్రెసు నాయకులెవరూ సావర్కారును రక్షించడానికి ప్రయత్నించ లేదు. కానీ కోర్టులో ప్రాసిక్యూషన్ వాదనలు చెల్లలేదు. 1949, ఫిబ్రవరి 10న వెలువడిన తీర్పు ప్రకారం ఆయనను నిర్దోషిగా విడిచిపెట్టారు. కానీ కేసు కలిగించిన మానసిక క్షోభ, ఏడాది జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని క్రుంగదీశాయి, రాజకీయజీవితానికి చరమగీతం పాడాయి. హిందూ మహాసభ పార్టీ ప్రభ అంతరించింది. నిరాశానిస్పృహలతో సావర్కార్ 1966లో మరణించారు. హైదరాబాదులో మహారాష్ట్రులు ఎక్కువగా వుండే కాచిగూడా చౌరస్తాలో ఆయన విగ్రహం పెట్టారు.
ఇక డా|| శ్యామా ప్రసాద్ ముఖర్జీ గురించి ''అర్ధరథుడు ఆడ్వాణీ'' సీరియల్‌లో ఎక్కువగా చెప్పబోతాను కాబట్టి యిప్పుడు కొద్దిగానే చెప్తాను. బెంగాల్ హైకోర్టు న్యాయాధీశుడు, కలకత్తా యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన 'సర్' అశుతోష్ ముఖర్జీ కొడుకాయన. ఈయనా బారిస్టరయ్యాడు, కలకత్తా యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు. కలకత్తా యూనివర్శిటీ ప్రతినిథిగా కాంగ్రెసు తరఫున బెంగాల్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యాడు. కృషికార్ ప్రజాపార్టీ – ముస్లింలీగ్ సంకీర్ణ ప్రభుత్వం 1937-41లో అధికారంలో వుండగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ౖప్రతిపక్ష నాయకుడిగా వున్నాడు. ఆ తర్వాత ఫజుల్ హక్ సంకీర్ణ ప్రభుత్వంలో ఫైనాన్స్ మంత్రిగా ఏడాది పాటు పనిచేసి, ముస్లింల చేతిలో హిందువులకు అన్యాయం జరుగుతోందంటూ బయటకు వచ్చేశాడు. హిందూ మహాసభలో చేరి 1944లో దానికి అధ్యకక్షుడయ్యాడు. జిన్నాకు వ్యతిరేకంగా గళమెత్తాడు. దేశవిభజనకు ఆయన మొదట్లో వ్యతిరేకి కానీ నవ్‌ఖాలీ హింసాకాండ తర్వాత ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో వుండడం హిందువులకు ప్రమాదకరం కాబట్టి విడిపోతేనే మంచిదని భావించసాగాడు. సుహ్రవర్దీ-శరత్ బోసు ప్రతిపాదించిన అవిభక్త బెంగాల్ దేశం ఐడియాను యీయన ప్రతిఘటించాడు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ కోరికపై ఆయన మంత్రివర్గంలో చేరాడు. ఇరుదేశాలలోని మైనారిటీల సంక్షేమంకై మైనారిటీ కమిషన్స్ ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ ప్రధాని లియాకత్ ఆలీ ఖాన్‌తో కలిసి నెహ్రూ ఒప్పందం చేసుకోవడానికి వ్యతిరేకంగా 1950 ఏప్రిల్‌లో రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు.
ఆయన 1942 నుంచి ఆరెస్సెస్‌తో కలిసి పనిచేస్తూ వుండేవాడు. కాబినెట్‌లోంచి బయటకు వచ్చాక ఆరెస్సెస్ అధినేత ఎమ్మెస్ గోల్వాల్కర్‌ను సంప్రదించి భారతీయ జనసంఘ్ అనే పార్టీని 1951 అక్టోబరులో స్థాపించి దానికి తొలి అధ్యకక్షుడయ్యాడు. 1952 ఎన్నికలలో ఆ పార్టీకి 3 ఎంపీ స్థానాలు దక్కాయి. వాటిలో ఒకటి ఆయనదే. కశ్మీర్‌ను భారతదేశంలో కలుపుకోవడానికి ఆర్టికల్ 370 కింద దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడాన్ని ఆయన వ్యతిరేకించాడు. హిందూ మహాసభ, రామరాజ్య పరిషత్‌లతో కలిసి కశ్మీర్‌లోనే సామూహిక సత్యాగ్రహం నిర్వహించడానికి 1953లో కశ్మీర్‌కి వెళ్లబోయాడు. ప్రభుత్వం ఆయన రాకపై నిషేధం ప్రకటించింది. మే 11 న ఆయన బలవంతంగా సరిహద్దులు దాటుతూంటే అరెస్టు చేశారు. ఒక యింట్లో నిర్బంధంలో వుంచారు. కొన్నాళ్లకు అక్కడి వాతావరణానికి ఆయనకు శ్వాససంబంధమైన వ్యాధులు వచ్చాయి. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూండగానే, ఆసుపత్రిలో ఆయన జూన్ 23 న మరణించాడు. ఆసుపత్రిలో చికిత్సలో భాగంగా పెన్సిలిన్ యిచ్చారని, అది ఆయనకు పడలేదని అంటారు. ఆ మరణం ఒక వివాదంగా పరిణమించిన విశేషాలను ఆడ్వాణీ సీరియల్‌లో చర్చిస్తాను. ప్రస్తుతానికి మనం తెలుసుకోవలసిన దేమిటంటే గోడ్సే నిరసించిన సావర్కార్, శ్యామా ప్రసాద్ యిద్దరూ గొప్ప వ్యక్తులే. దేశభక్తిలో కానీ, ప్రతిభలో కానీ వేలెత్తి చూపదగినవారు కారు. సిద్ధాంతపరంగా వాళ్లిద్దరూ గోడ్సేకు వ్యతిరేకులు కారు. అయినా గోడ్సే యిద్దర్నీ తీసిపారేయడానికి, తృణీకరించడానికి కారణం ఏమిటి? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)