భూమి మీద పడిన హీరోయిన్ గాలీ, తుపాను అడావుడిలోనే పిల్లవాణ్ని కంది. అయితే ఆ పిల్లవాణ్ని చూసి ఓ పులి గాండ్రించింది. ఈమె పరిగెట్టి కాలు జారి ఏట్లో పడి కొట్టుకుపోయింది. ఆ పిల్లవాడు ఓ గొల్లవాడి కంట పడి అతను ఆ పిల్లవాణ్ని పెంచుకుందామనుకున్నాడు. ఏట్లో పడ్డ హీరోయిన్‌ని రమణారెడ్డి రక్షించాడు.
రేలంగితో విడిపోయాక తన వాటాకు వచ్చిన మంత్రదండాన్ని ఉపయోగించుకుని డబ్బులు ఎలా సంపాదించుకోవాలా అని రమణారెడ్డి ఆలోచించి ఓ ట్రిక్కు కనిపెట్టాడు. దారిన పోయేవాళ్లని దండించి, వారి మూటల్ని ఎత్తుకురమ్మని ఆ దండాన్ని పురమాయించేవాడు. వాళ్లలో ఆడవాళ్లను దండంతో అదిలించి తన గుహకు తరలించేవాడు. హీరోయిన్‌ను రక్షించి గుహకు చేర్చాక ఆమెను అనుభవిద్దామని చూశాడు. అప్పటికే గుహంతా ఆడవాళ్లతో బిలబిలలాడుతోంది. ఆ సమయంలో ఎక్కణ్నుంచో హీరో వచ్చాడు. బలాత్కరించబడుతున్న తన భార్యను చూసి ఎవరో ఆడకూతురికి సహాయ పడదామనుకుని రమణారెడ్డిని చితక్కొట్టాడు. అతని వద్దనున్న దండంతోనే మెడ పట్టించి ఊరినుండి గెంటించేశాడు. ఆ దండాన్ని తిరిగి సంపాదించుకుని ఆడవాళ్లను విడిపించి ఎవరి దారిన వాళ్లను పొమ్మన్నాడు. తన భార్యను గుర్తుపట్టలేదు పాపం. ఈమెకు తెలుసు కానీ బయటకు చెపితే అతను ముట్టుకుంటాడేమో పాషాణం అయిపోతాడేమోనని భయం. అందువల్ల మౌనంగా ఊరుకుంది. అప్పుడు బందీలోంచి విడుదలైన ఓ మహిళ 'మా యింటికి రా' అని ఆమెను పిలుచుకుని వెళ్లింది. అక్కడకు చేరాక అంజలి ఓ కొయ్యబొమ్మను పెట్టుకుని పిల్లవాణ్ని తలుచుకుంటూ 'జో, జో' అని జోలపాట పాడుతుంది. అప్పుడే గుమ్మడి 'ఏలేలో' అని తన తరహాలో పాట పాడుతూ పిల్లవాణ్ని పెంచుతున్నాడు. ఆ పిల్లవాడు కాస్త పెద్దవాడై మేకల్ని తనే కాసే స్థాయికి వచ్చాడు.
హీరో ఓ రోజు తన దారిన తాను పోతూ ఓ చోట శిల్పాలు కనబడితే ఆగి చూస్తున్నాడు. పక్కనే పుట్టలో ఓ పాము కనబడితే దాన్ని అదిలించాడు. ఆ పాము బుసకొట్టింది. మంత్రదండంతో దాన్ని కొట్టాడు. అది నాగకన్యగా మారి 'ఉత్తిపుణ్యానికి నన్ను కొట్టి గాయపరచావు. నువ్వు స్త్రీవై పో.' అంది. 'నువ్వు పామురూపంలో కనబడి అడలగొడితే కొట్టడం తప్పేముంది? అంతమాత్రానికే శాపమా?' అని హీరో తర్కించాడు. 'సరే, పగటిపూట శాపం పగటిపూటకే పరిమితం. రాత్రి పూట నీకు అసలు రూపం వచ్చేస్తుందిలే. అమృతజలంలో స్నానమాడితే శాపవిమోచనం జరుగుతుంది' అని అంది నాగకన్య. ఇక ఇక్కణ్నుంచి హీరో పాత్ర రెండుగా విడిపోతుంది. రాత్రి జయంతుడు – నాగేశ్వరరావు, పగలు జయంతి – రాజసులోచన. అంటే ఆయన పోర్షన్ తగ్గిపోయిందన్నమాట. ఈ సినిమా కథ విన్నపుడు నాగేశ్వరరావుగారు 'ఈ సినిమాకి నేనెందుకు?' అన్నారట. 'మీరు లేకపోతే హీరోయిజం లేదు' అని అంజలీవారు ఒప్పించారు. ఆయనకు అంజలీ ప్రొడక్షన్స్‌తోనూ, వేదాంతం రాఘవయ్యగారితోనూ వున్న మొహమాటం వల్ల ఒప్పుకున్నారు.
పగటిపూట స్త్రీగా వుండడం వల్ల జయంతి దొంగల గుంపుకి చిక్కుతుంది. దొంగల నాయకుడు పెళ్లిచేసుకున్నదాకా వుండి చంద్రోదయం కాగానే జయంతి ఠక్కున జయంతుడైపోయి వాళ్లను చావబాదతాడు. మంత్రదండంతో కాదు, దాన్ని పక్కన పడేసి పూర్తిస్థాయి జానపద ఫక్కీలో ఫైటింగ్. కాగడాలతో యుద్ధం కూడా వుంది. ఇంకో పక్క అంజలి తనకు ఆశ్రయం యిచ్చినామెకు జ్వరం వచ్చిందంటే ఆమెకు బదులు బొమ్మలమ్మడానికి తను వెళ్లింది. 'బొమ్మాలమ్మా బొమ్మలు' పాట పాడి బొమ్మలు బాగా అమ్మింది. అంతవరకూ బాగానే వుంది కానీ బయటకు వెళ్లడంతో రమణారెడ్డి కంటబడింది. అతను రాత్రి పూట యింటికి వస్తా జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు. అతని బారినుండి తప్పించుకోవడానికి ఈమె మగవేషంలో బయటపడింది. ఇవతల ఈ పిల్లవాణ్ని సాకుతున్న గుమ్మడి హరీమన్నాడు. 'పోయి మీ అమ్మను వెతుక్కో' అని చెప్పి కన్నుమూశాడు. ఇప్పుడు ఓ నేపథ్యగీతం వస్తుంది. 'అమ్మా..' అని. అందులో ముగ్గురి గురించి వస్తుంది. ఆడవేషంలో తండ్రి, మగవేషంలో తల్లి, వాళ్లని గుర్తు పట్టలేని పిల్లవాడు ముగ్గురి అవస్థా చూస్తే ప్రేక్షకుడికి దిగులుగా వుంటుంది. కథ ఎలా సుఖాంతం అవుతుందాని బెంగ పెట్టుకున్నారా? ఏం భయంలేదు. అన్నిటికీ ఆ దేవుడే వున్నాడు. ముఖ్యంగా జానపద సినిమావాళ్లకు బోల్డంత వున్నాడు. భక్తిమూలంగానే ఈ చిక్కుముడిని విప్పారు రచయిత, దర్శకుడు. తలిదండ్రులకోసం వెతుకుతూ పిల్లవాడు తన తలిదండ్రుల ప్రేమ చిగురించిన శివపార్వతుల గుహకు చేరాడు. వాళ్లే తన తలిదండ్రులనుకున్నాడు. మొక్కాడు. పార్వతి తల్లిమనసు కరిగింది. శివకుమారుడని పేరు పెట్టుకుని వాణ్ని సాకింది. వాడికి తండ్రి పారేసిన ఫ్లూట్ దొరికింది. దాన్ని ఊదుతూ పాములను ఆడిస్తాడు. శివుడు ముచ్చటగా చూస్తాడు.
జయంతి – అంటే ఆడవేషంలో తిరుగుతున్న జయంతుడు – ఓ రాజ్యం చేరింది. రాజుగారు సియస్సార్. అతని కూతురు గిరిజ. ఆమె చెలికత్తెగా ఈమె చేరింది. తాను గంధర్వలోకం నుండి వచ్చానని, నాట్యం నేర్పుతానని అంది. ఆమెను చూస్తే గిరిజకు ఏదో వ్యామోహం. మారువేషాల గురించి చెప్పినపుడు చెప్పాను కదా, ఆ వ్యామోహం ఎందుకో ప్రేక్షకుడికి తెలుసు, బయటికి రాజసులోచన కనబడుతున్నా లోపల నాగేశ్వరరావు వున్నాడని తోచి యిలాటి ఘట్టాలు గిలిగింతలు పెడతాయి.
ఈ రాజుగారికి మంత్రి లేడు. కాశీయాత్రకని వెళ్లి ఏడాదిన్నరయింది. కొత్తమంత్రిని వెతికే పని భద్రగజానికి అప్పగించారు. అంటే ఏనుగు ఓ దండ పట్టుకెళ్లి తనకు ఎవరు తోస్తే వాళ్లకు వేస్తుందన్నమాట. రేలంగి పాపం వెళ్లి ముందువరుసలో నుంచున్నాడు. రేలంగికి చాప దొరికిందని చెప్పాను కదా. దాన్ని ఉపయోగించుకుని అతను రాత్రిపూట ఆకాశంలో తిరుగుతూ ఎవరైనా పెరట్లో లంకెబిందులు కప్పెడుతూంటే దోచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. పగటిపూట జ్యోతిష్కుడి వేషాలు వేస్తున్నాడు. ఏనుగు అతన్ని పక్కకు నెట్టేసి మగవేషంలో తిరుగుతూ ఆ రాజ్యానికి వచ్చిన హీరోయిన్ మెడలో దండ వేసింది. దెబ్బకి హీరోయిన్ మగవేషంలో మంత్రి అయిపోయింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)