భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామమైన సూతియాలో వరుణ్ బిశ్వాస్ అనే 30 ఏళ్ల స్కూలు టీచరు హత్యకు జులై 2012లో గురయ్యాడు. ఎందుకంటే అతను తన వూళ్లో పెద్ద తలకాయలను ఎదిరించాడు. గూండాగిరీని, రాజకీయాలను కలగలపిన కొందరు ఆ గ్రామాన్ని ఏలారు. వరుణ్ ఆ వూళ్లో టీచరుగా పని చేస్తూ తన జీతంతో పేదలకు పుస్తకాలు, మందులు కొనిపెట్టేవాడు. ఇచ్ఛామతి నది వరదల్లో మునిగిపోతున్న తమ గ్రామాన్ని కాపాడడానికి కాలువలు తవ్వాలని ఉద్యమం ప్రారంభించాడు. చివరకు ప్రభుత్వమే యీ పని చేపట్టింది. అయితే యీ పెద్ద తలకాయలు దానికి అడ్డుకట్ట కట్టి తమ వ్యాపారాలకై యీ నీళ్లను మళ్లించుకోసాగారు. ఎవరైనా అడ్డగిస్తే వాళ్ల యింటి స్త్రీలపై వీళ్లు సామూహిక మానభంగాలు చేసేవారు. ఆ వూళ్లో 2000-2002 మధ్య 33 బలాత్కారాలు, 12 హత్యలు జరిగాయంటే వూహించుకోవచ్చు వారెంతటి నరరూప రాక్షసులో. వరుణ్ వీరికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి, కేసులు పెట్టాడు. ఎవరు బెదిరించినా అదరలేదు. చివరకు అతని ప్రయత్నాలు ఫలించి 2012లో ఆ గూండా నాయకుడు సుశాంత చౌధురీతో బాటు మరో నలుగుర్ని కటకటాల వెనక్కి పంపగలిగాడు. యావజ్జీవ శిక్ష పడిన చౌధురీ వూళ్లో కొంతమంది కుర్రాళ్లకు సుపారీ యిచ్చి రైల్వే స్టేషన్ పార్కింగ్ ఆవరణలో వరుణ్‌ను చంపించాడు. ఐదురుగు అరెస్టు అయ్యారు.
బతికుండగా వరుణ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ రాజ్ చక్రవర్తి అనే సినిమా దర్శకుడికి ఆయన కథ ఆధారంగా ‘‘ప్రళయ్’’ అనే బెంగాలీ సినిమా తీయాలనిపించింది. సినిమాలో ఊరి పేరు దుఖియా. సినిమా ప్రథమార్ధం యథార్థ ఘటనలతో తీస్తూనే మెలోడ్రామా కోసం వరుణ్‌ను యువకుడిగా, ప్రేమికుడిగా చూపించాడు. అంతేకాదు, ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఘట్టాలు కల్పించాడు. హత్య తర్వాత నేరస్తులు -రాజకీయనాయకులు -పోలీసుల కలిసికట్టుగా వాస్తవాలు బయటపడకుండా దుర్మార్గంగా ప్రవరిస్తూ వుంటే ఒక పోలీసు అధికారి వాళ్ల ఆట కట్టిస్తాడు. అతనికి రూల్సన్నా, గాంధేయవిధానాలన్నా మహా చికాకు. చట్టాన్ని చేతిలో తీసుకుని వీళ్లకు బుద్ధి చెప్తాడు. ‘‘కహానీ’’ సినిమాలో బాబ్ బిశ్వాస్ పాత్రలో తళుక్కుమన్నశాశ్వత చటర్జీ ఆ పాత్ర వేశాడు. అతనికి సహాయపడిన వృద్ధుడి పాత్రలో పరన్ బెనర్జీ వేశాడు. కోర్టు కెళితే న్యాయం ఆలస్యమవుతోందని, నిర్భయ కేసులో మైనర్ లా నియమాల చాటున నేరస్తులు తప్పించుకుంటున్నారని మండిపడుతున్న ప్రజలు యీ సినిమాలో చూపిన ‘తక్షణన్యాయం’ చూసి హర్షిస్తున్నారు.
– ఎమ్బీయస్ ప్రసాద్