మన వారసత్వంపై అశ్రద్ధ

భారతదేశంలోని 3678 ప్రాచీన కట్టడాలను, చారిత్రక స్థలాలను సంరక్షించే బాధ్యత ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ)కు అప్పగించింది ప్రభుత్వం. ఈ సంరక్షణ ఎంత బాగా జరుగుతోందో చూద్దామని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌…

భారతదేశంలోని 3678 ప్రాచీన కట్టడాలను, చారిత్రక స్థలాలను సంరక్షించే బాధ్యత ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఎస్‌ఐ)కు అప్పగించింది ప్రభుత్వం. ఈ సంరక్షణ ఎంత బాగా జరుగుతోందో చూద్దామని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) వాటిలో సగం కంటె తక్కువ అంటే 1655 కట్టడాలపై దృష్టి సారించి సర్వే నిర్వహించింది. ఫలితాలు చూసి 92 కట్టడాలు కనబడటం లేదని తెలిపింది. 2006లో ఎఎస్‌ఐ స్వయంగా పార్లమెంటుకి చెప్పిన దాని ప్రకారం 35 మిస్సింగ్‌!ౖ కానీ 92 అంటే మరీ ఎక్కువ. అన్ని కట్టడాల గురించి వెతికితే, పోయినవాటి సంఖ్య యింకా ఎక్కువ వుండవచ్చని విమర్శలు రావడంతో    కల్చర్‌ మినిస్టర్‌ చందేష్‌ కుమారీ కటోచ్‌ సెప్టెంబరులో ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి ‘‘కాగ్‌ వాళ్లు చెప్పిన 92 స్థలాల గురించి వెతికించాం. వాటిలో 38 కనబడ్డాయి. కావాలంటే ఫోటోలు చూపిస్తాం. ఇక తక్కిన 54 వాటిల్లో 22 బత్తిగా కనబడటం లేదు. 32 ఆక్రమణకు గురయ్యాయేమో తెలియదు. పూర్తిగా విచారించి చెపుతాం’’ అన్నారు. అనేక చారిత్రక స్థలాలను కబ్జా చేసేస్తున్నా నిరోధించడానికి ఎఎస్‌ఐకు శక్తి చాలటం లేదు. తవ్వకాలు జరుగుతాయి కదా వాటిపై నివేదికలు ప్రచురించడం కూడా ఎఎస్‌ఐ చేతకావటం లేదు. 2007 నుండి 2012 వరకు 113 చోట్ల తవ్వకాలు జరిగితే కేవలం ఒకే ఒక్క నివేదిక వెలుగు చూసింది. 

ఎందుకిలా? అని ఎఎస్‌ఐను అడిగితే వాళ్లు బోల్డు కారణాలు వల్లించారు. 3678 కట్టడాలుంటే వాటిని కాపాడడానికి వాళ్ల కిచ్చిన స్టాఫ్‌ 3458! వాటిలో  1279 పోస్టులు ఖాళీ. ఇంగ్లండులో యీ కట్టడాలు సందర్శించడానికి వచ్చేవారు వద్ద వసూలు చేసిన టిక్కెట్టు డబ్బు ఆర్కియాలజీ సంస్థకే యిచ్చేసి, వాటిని కాపాడమంటారు. మనదేశంలో అలాటి పద్ధతి లేదు. టిక్కెట్టు ఆదాయం వేరేవాళ్లకి పోతుంది. వీళ్లకు ప్రభుత్వం యిచ్చేదే ఆదాయం. వాళ్ల ఏడాది బజెట్‌ 750 కోట్ల రూ.లు. దానిలో 500 కోట్ల రూ.లు జీతభత్యాలకే పోతుంది. మిగిలినదానిలో యిన్ని కట్టడాలు కాపాడడం ఎలా? తక్కిన దేశాల్లో మ్యూజియంలో ఏదైనా అపురూపమైన వస్తువు పోతే వెంటనే వాళ్లు ప్రపంచంలో యిలాటి వస్తువులు వేలం వేసే వ్యాపారులకు వెంటనే డైరక్టుగా తెలియపరచగలుగుతారు. ఇక్కడ ఎఎస్‌ఐకు అలాటి అధికారం లేదు. దగ్గరున్న పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ రాయించి చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిందే. అందుకే గత 50 ఏళ్లలో 156 అపురూప కళారూపాలు చోరీకి గురయ్యాయి. ఇవి యిక్కడితో ఆగుతాయన్న నమ్మకం లేదంటుంది కాగ్‌. ‘ఢిల్లీ లోని నేషనల్‌ మ్యూజియంకు, హైదరాబాదులోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంకు సెక్యూరిటీ చాలదు, కలకత్తా మ్యూజియం గ్యాలరీలలో సెక్యూరిటీ కెమెరాలు కూడా లేవు. హరప్పా నాగరికత బయటపడిన రాఖిగఢీ (హరియాణా)లో ఆక్రమణలు జరిగి  జనావాసాలు ఏర్పడుతున్నాయి. ధోలావిరా (గుజరాత్‌) లో దొరికిన హరప్పా కాలం నాటి కుండపెంకులు, రాళ్లు ఏ రక్షణా లేకుండా బయటే పడి వున్నాయి. తక్కిన దేశాలు తమకు గతచరిత్ర లేదని తల్లడిల్లుతున్నాయి. మనకు మాత్రం చరిత్రను భద్రపరచుకోవాలనే తపనే లేదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]