1976లో ఎమ్జీయార్‌తో చేతులు కలిపి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఇందిర 1980లో పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఎందుకు చేసింది? 1977 పార్లమెంటు ఎన్నికలలో ఇందిరతో కలిసి పొత్తు కట్టిన ఎమ్జీయార్ ఆ ఎన్నికలలో ఆమె ఓటమి తర్వాత ఆమెను వదిలిపెట్టేశాడు. కేంద్రంలో ఎవరున్నా వారిని మంచి చేసుకుని తన సంక్షేమ పథకాలకు నిధులు తెచ్చుకోవాలనే ఆలోచనతో అప్పుడు అధికారంలో వున్న జనతా పార్టీతో సఖ్యంగా వుండేవాడు. 1979లో మొరార్జీతో విభేదించి జనతా నుండి బయటకు వచ్చి జనతా (ఎస్) పెట్టిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరణ్ సింగ్‌కు కూడా మద్దతిచ్చాడు. ఎడిఎంకె తరఫున సత్యవాణి ముత్తు, అరవింద బాల పజనోర్‌కు ఆ కాబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయి. అయితే చరణ్ సింగ్ తన మెజారిటీని నిరూపించుకోలేక పోవడం చేత రాజీనామా చేసి 1980 ఎన్నికల వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగవలసి వచ్చింది. 1980 జనవరిలో పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి ఎమర్జన్సీకాలంలో బద్ధశత్రువులుగా వున్న డిఎంకె ఇందిరా కాంగ్రెసు, యితరులు జట్టు కట్టాయి. వారికి ప్రతిగా ఎడిఎంకె, జనతా పార్టీ, సిపిఐ జట్టు కట్టాయి. మొత్తం 39 పార్లమెంటు సీట్లలో కాంగ్రెసు కూటమికి 56% ఓట్లతో 37 (కాంగ్రెసు 20, డిఎంకె 16, ముస్లిం లీగు 1) రాగా ఎడిఎంకెకి 40% ఓట్లతో రెండే రెండు సీట్లు వచ్చాయి. దాంతో జట్టు కట్టిన కమ్యూనిస్టులకు ఏమీ రాలేదు. దాంతో ఎమ్జీయార్‌కున్న పలుకుబడంతా పోయిందని ప్రజలు అతని అవినీతిని అసహ్యించుకుంటున్నారని రుణానిధి, ఇందిర నమ్మారు. అంతే నాలుగేళ్ల క్రితం అవినీతి ఆరోపణలపై డిఎంకె ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లే యీ ఫలితాలు వచ్చిన నెల తిరక్కుండా అవే ఆరోపణలపై ఎడిఎంకె ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించి, మే నెలలో ఎసెంబ్లీ ఎన్నికలు జరిపించింది ఇందిర.
డిఎంకె, కాంగ్రెసుల మధ్య సీట్ల సర్దుబాటు అంత సజావుగా సాగలేదు. ఎమ్జీయార్ ఓటమి ఎలాగూ ఖాయం కాబట్టి, కాబోయే ముఖ్యమంత్రి తమ పార్టీవాడే అవుతాడని కాంగ్రెసు తరఫున జికె మూపనార్, డిఎంకె తరఫున కరుణానిధి యిద్దరూ అనుకుని ఎక్కువ స్థానాల కోసం పోటీ పడ్డారు. చివరకు యిద్దరూ సగంసగం అనుకున్నారు. కాంగ్రెసు 114 సీట్లకు పోటీ చేయగా డిఎంకె 112టికి పోటీ చేసి, 2 సీట్లలో యిండిపెండెంట్లకు మద్దతు యిచ్చింది. ముస్లిం లీగుకు 6 యిచ్చారు. తమ కూటమి నెగ్గితే రుణానిధియే ముఖ్యమంత్రి అని ఇందిర ప్రకటించింది. మరో కూటమిలో ఎడిఎంకె 177, సిపిఎం 16, సిపిఐ 15, గాంధీ కామరాజ్ కాంగ్రెసు పార్టీ (జికెసి) 10, ఇందిరకు వ్యతిరేకంగా ఏర్పడిన కాంగ్రెసు యు 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, ఎడిఎంకె మద్దతిచ్చిన స్వతంత్రులు 11 మంది వున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఫలితాలకు పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. ఎడిఎంకె కూటమి 49% ఓట్లతో 234 సీట్లలో 162 సీట్లు గెలుచుకుంది. (ఎడిఎంకెకు గతంలో కంటె 1 తక్కువగా 129 వచ్చాయి, సిపిఎంకు 11, సిపిఐకు 4, జికెసికి 6, ఫార్వర్డ్ బ్లాక్‌కు 1, స్వతంత్రులు 6 గెలిచారు. డిఎంకె కూటమికి 44% ఓట్లు 69 సీట్లు వచ్చాయి. డిఎంకెకు గతంలో కంటె 11 తగ్గి 37, కాంగ్రెసుకు 31, స్వతంత్రుడికి 1 వచ్చాయి. ఇతర పార్టీలను కూటమిలో చేర్చుకుని వారికి ఉదారంగా సీట్లు యిచ్చిన ఎమ్జీయార్ రాజకీయ పరిణతితో కాంగ్రెసు, డిఎంకెల కలలను కల్లలు చేశాడు. ఎమ్జీయార్ శక్తిని తక్కువగా అంచనా వేసినందుకు ఇందిర నాలుక కరుచుకుంది. ఎమ్జీయార్‌కు నిధుల ఆశ చూపో, భయపెట్టో తక్కిన ప్రతిపక్షాలతో కలవకుండా చూసింది.
ఎమ్జీయార్ రెండో సారి ముఖ్యమంత్రి అయినపుడు అతనికి ధైర్యం పెరిగింది. జయలలితతో తన సాన్నిహిత్యం వలన ప్రజల్లో యిమేజి పోతుందన్న భయం అధిగమించాడు. తన సహచరులు వారిస్తున్నా పదేళ్ల గ్యాప్ తర్వాత జయలలితను మళ్లీ దగ్గరకు తీసుకున్నాడు. ఈ పదేళ్లలో జయలలిత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఎమ్జీయార్ సరసన వేయడం మానేసినా తక్కిన హీరోలతో నటిస్తూ 1977 నాటికి కెరియర్‌లో అగ్రస్థానానికి చేరింది. అప్పణ్నుంచి వేషాలు తగ్గిపోయాయి. 1980లో వచ్చిన తెలుగు సినిమా ''నాయకుడు-వినాయకుడు'' హీరోయిన్‌గా ఆమె ఆఖరి సినిమా అనుకోవచ్చు. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె జీవితంలో శూన్యం ఆవరించింది. తల్లి చనిపోయింది. పెళ్లి కాలేదు. తెలుగు నటుడు శోభనబాబుతో సాన్నిహిత్యం ఏర్పడింది కానీ అతను అప్పటికే వివాహితుడు కాబట్టి అది వైవాహికబంధంగా మారలేదు. పైగా ఎమ్జీయార్‌కు కోపం వస్తుందేమోనని భయపడి దూరంగా తొలగిపోయాడు. వేరేవారు కూడా యిదే భయంతో జయలలిత జోలికి వచ్చేవారు కారు. ఇటు ఎమ్జీయార్ తన పబ్లిక్ యిమేజి కాపాడుకోవడానికి ఆమెను దూరం పెట్టేవాడు. ఈ విధంగా ఎంత అందం, తెలివితేటలు, టాలెంట్ వున్నా, జయలలితకు ఒంటరిగా మిగిలింది. చిత్రసీమలో కాని, బయట కాని ఆమెకు స్నేహితులు కూడా ఎవరూ లేరు. జీవితం ఎటూ కదలకుండా స్తంభించిపోయింది. తన దురవస్థకు కారణం ఎమ్జీయారే అని ఆమెకు ఉక్రోషం వచ్చి నిరంతరవ్యథకు లోనై, చిత్తస్వాస్థ్యం కోల్పోయి, ఆరోగ్యం దెబ్బ తీసుకుంది.
ఈ దశలో ఎమ్జీయార్ ఆమెను చూసి జాలిపడ్డాడు. ఆమెను కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి సముచిత స్థానం యిద్దామనుకున్నాడు. నిజానికి తన పార్టీకి కూడా జయలలిత వంటి ప్రతిభావంతుల అవసరం వుంది. అటు కరుణానిధి అద్భుతమైన తన వక్తృత్వంతో తన అవినీతిపై విరుచుకు పడుతున్నాడు. అతనికి దీటుగా తన తరఫున మాట్లాడగల శక్తి వున్నవారు కావాలి. జయలలితకు గ్లామర్ వుంది. కానీ మాట్లాడగలదా? ఒక అవకాశం యిచ్చి చూడాలి అనుకున్నాడు. 1982లో ఆమె వద్దకు వెళ్లి అనునయంగా మాట్లాడి తన పార్టీలో చేరమని ఆహ్వానించాడు. రాబోయే ఎడిఎంకె పార్టీ సమావేశంలో స్త్రీ శక్తి గురించి ఉపన్యసించమని అడిగాడు. ఆమె సరేనంది. తనకు ఉపన్యాసాలు రాసి పెట్టే చోళైౖ అనే అతన్ని ఆమె తరఫున ఉపన్యాసం రాసి తీసుకెళ్లమన్నాడు. జయలలిత అతన్ని చదవమని చెప్పి కళ్లు మూసుకుని వింది. అలా మూడుసార్లు చదివించుకుంది. అంతే నేను రెడీ అంది. అక్షరం పొల్లు పోకుండా అద్భుతమైన భావప్రకటనతో అప్పచెప్పింది. ఇది తెలిసి ఎమ్జీయార్ పొంగిపోయాడు. సమావేశంలో ఆమె ఉపన్యాసానికి కరతాళధ్వనులు మోగాయి. అంతే, ఎమ్జీయార్ వచ్చే ఏడాదే అంటే 1983 జనవరిలో ప్రాపగాండా సెక్రటరీ అనే పదవి సృష్టించి పార్టీ ప్రచారబాధ్యతలు ఆమెకు అప్పగించాడు. నెల తిరక్కుండా తిరుచెందూరులో అసెంబ్లీ ఉపయెన్నికలలో ఎడిఎంకె అభ్యర్థి తరఫున ప్రచారం చేసింది. ఆ అభ్యర్థి విజయం సాధించాడు. ఎమ్జీయార్‌కు ఆమెపై నమ్మకం పెరిగింది. 1984లో తన పార్టీ తరఫున రాజ్యసభకు పంపించాడు. ఆమె రాజ్యసభలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో అద్భుతంగా, అతి గంభీరమైన విషయాలపై లోతైన అవగాహనతో ప్రసంగించి అన్ని పార్టీల వారినీ ఆకట్టుకుంది. ఎమ్జీయార్ ఆనందం పట్టలేకపోయాడు. ఆమెకు విపరీతంగా ప్రాధాన్యత యివ్వసాగాడు. అది అతని సన్నిహితులలో మళ్లీ అసూయ రగిలించింది. జయలలితలో గతకాలపు అహంకారం పురివిప్పింది. ఆమె చుట్టూ కొందరు భజనపరులు చేరారు. ఆమెకు వ్యతిరేకంగా ఏర్పడిన గ్రూపుకు ఆర్‌ఎమ్ వీరప్పన్ నాయకత్వం వహించాడు. ఎమ్జీయార్ కొన్ని విషయాల్లో జయలలిత వైపు, మరి కొన్నివాటిల్లో వీరప్పన్ వైపు మొగ్గేవాడు. (సశేషం) ఫోటో – జయలలిత తన నివాసంలో శోభన్‌బాబుకు భోజనం వడ్డిస్తూ…
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)