నాగపూర్ టెస్ట్‌లోనూ భారత స్పిన్నర్లు తిప్పేశారు. సౌతాఫ్రికా మళ్ళీ విలవిల్లాడింది. 310 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 185 పరుగలకు కుప్ప కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 79 పరుగులకు ఆలౌట్ అయిన విషయం విదితమే. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ని అశ్విన్ ఏడు వికెట్ల మాయాజాలంతో కుప్పకూల్చేశాడు. అమిత్ మిశ్రా కీలక సమయంలో వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా చేతులెత్తేసింది.
రెండో టెస్ట్ వర్షార్పణం కాగా, తొలి టెస్ట్, మూడో టెస్ట్‌ని గెలుచుకున్న టీమిండియా సిరీస్‌లో 2-0 లీడ్‌తో ఓ మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్‌ని కైవసం చేసుకుంది. 'ఇదేమి పిచ్.?' అని అంతా ముక్కున వేలేసుకున్నా, ఓ దశలో సౌతాఫ్రికా నిలదొక్కుకున్నట్లే కనిపించింది. ఆమ్లా, డుప్లెసిస్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. సరిగ్గా ఈ టైమ్‌లోనే మిశ్రా అద్భుతమైన స్పెల్‌తో ఆమ్లా, డుప్లెసిస్‌ని ఔట్ చేయడంతో టీమిండియా విజయం ఖరారైపోయింది.
మొత్తంగా ఈ టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కేవలం 40 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఒక్క అర్థ సెంచరీ కూడా ఈ టెస్ట్‌లో నమోదు కాలేదు. వంద బంతులు పైబడి ఎదుర్కొన్నది కేవలం ముగ్గురే ముగ్గురు బ్యాట్స్‌మన్ కాగా, అందులో ఇద్దరు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్, అదీ రెండో ఇన్నింగ్స్‌లోనే. ఆమ్లా 165 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేస్తే, డుప్లెసిస్ 152 పరుగులు చేసి 39 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా నుంచి సాహా తొలి ఇన్నింగ్స్‌లో 106 బంతుల్ని ఎదుర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.