పివి గారి నవలలో కథానాయకుడు కాంగ్రెసు నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి, ఒక మహిళతో సంబంధం కలిగి వుంటాడు. ఆ సందర్భంగా లైంగిక వర్ణనలు ఎక్కువగా వుంటాయి. ఔట్‌లుక్‌లో వేసినపుడు వినోద్ ఆ భాగాలనే ఎక్కువగా హైలైట్ చేశాడు. దానితో బాటు కథానాయకుడు ఇందిరా గాంధీ గురించి చేసిన ఘాటైన విమర్శలూ అవీ..! దాంతో పివికి కోపం వచ్చింది. నిఖిల్‌ను పిలిచి 'నువ్వే యిచ్చావా?' అని అడిగాడు. తప్పయిపోయిందని క్షమాపణలు చెప్పి ఆ తర్వాత వినోద్‌కు ఫోన్ చేసి ఎంత పని చేశావయ్యా? అన్నాడు. మీరే కదా యిచ్చినది, ఆర్టికల్ రాసిన సాగరికా ఘోష్ మిమ్మల్ని యింటర్వ్యూ చేసింది కూడా అని జవాబిచ్చాడు వినోద్. నిజమేలే, కానీ మధ్యలో నేను సారీ చెప్పాల్సివచ్చింది అని నిఖిల్ వాపోయాడు. ఇంకో రెండు గంటలకు ప్రధాని ఆఫీసు నుంచి ఔట్‌లుక్‌కు ఫోన్ వచ్చింది. పివి వినోద్‌ను సూటిగా అడిగారు – 'మ్యానుస్క్రిప్ట్ ఎవరిచ్చారు?' అని. 'మీరంటే ఎంతో గౌరవం నాకు. కానీ సోర్స్ చెప్పడం పాత్రికేయుడికి ధర్మం కాదు' అన్నాడు వినోద్. పివి ఫోన్ పెట్టేశారు. ఔట్‌లుక్‌లో వచ్చిన పివి పుస్తకభాగాలు విదేశీ పత్రికలు చాలా ఆసక్తితో చదివి వాటి గురించి వ్యాసాలు రాశాయి. లండన్ నుంచి వెలువడే సండే టైమ్స్ ప్రతినిథి 'పివికి ఒక డల్ యిమేజి వుంది. రెండు వారాల విదేశీ పర్యటనకై బయలుదేరబోయేందుకు నాలుగు రోజుల ముందుగా ఆయన ఆఫీసువాళ్లు కావాలని యీ పుస్తకభాగాలను పత్రికలకు లీక్ చేశారు. పైకి కనిపించేటంత 'నీరసుడు' కాడనీ, రసికుడనీ చూపించి విదేశీ నాయకులలో ఆసక్తి రగిలించడానికి యిదంతా చేశారు.' అని రాశాడు. పశ్చిమ దేశాల్లో యిలాటి ట్రిక్కులు వాళ్లకు అలవాటు.
ఈ రిపోర్టు చూసి టైమ్స్ ఆఫ్ ఇండియా 'మ్యాగజైన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రాధేయపడితే ప్రధానే పుస్తకభాగాలను వాడుకోనిచ్చారు అని పిఎంఓ ఆఫీసులో పేరు చెప్పడానికి యిష్టపడని వ్యక్తి తెలిపారు. ఆయన పబ్లిసిటీ మేనేజర్లు చేసిన యీ చిట్కా ఫలించింది. సిఎన్‌ఎన్, బిబిసిలలో కూడా ఆ పుస్తకం గురించి, ప్రధాని గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. లండన్ టైమ్స్, గార్డియన్, ఎకనమిస్ట్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు పత్రికలు 'స్కాలర్ రావ్స్ సీక్రెట్ సెక్స్ నావెల్' అంటూ దీని గురించి విస్తారంగా రాశారు.'' అని మొదటి పేజీలో వేశారు. ఈ లోపున కాంగ్రెసు పార్టీలో సోనియా విధేయులు, పివి వ్యతిరేకులు అయినవారు గోల చేశారు. కెకె తివారి పివిని 'సెక్స్ మానియాక్' అన్నాడు. అర్జున్ సింగ్ నెహ్రూ-ఇందిరాలను విమర్శించినందుకు దుమ్మెత్తిపోశాడు. ఇవన్నీ చూసి నిఖిల్ సలహాపై వినోద్ తరువాతి సంచికలో ఒక వివరణ వేశారు – 'ఆ మ్యానుస్క్రిప్ట్ ప్రధాని నుండి కానీ, ప్రధాని కార్యాలయం నుండి మాకు అందలేదు. దీనికి వచ్చిన స్పందన చాలా పాజిటివ్‌గా వుంది. ఏది ఏమైనా దీనివలన ప్రధానికి యిబ్బంది కలిగి వుంటే క్షంతవ్యులం.' అని. ఆ తర్వాత యితరుల సలహాపై పివి తన పుస్తకంలో శృంగారం పాలు తగ్గించారు. చివరకు ''ఇన్‌సైడర్'' పేరుతో 1998లో పుస్తకంగా తయారై అప్పటి ప్రధాని వాజపేయి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. పెంగ్విన్ వారు ప్రచురించారు. పివి వినోద్ మెహతాను యీ విషయమై ఎప్పుడూ సతాయించలేదు. కక్ష కట్టలేదు.
''ఔట్‌లుక్'' పత్రిక ప్రారంభ సంచికలో వేసిన కశ్మీర్ సర్వే యింకో రకమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. బాల్ ఠాక్రే ఆ సర్వే జాతివ్యతిరేకమని ప్రకటించి ఆ సంచిక కాపీలు ఎక్కడ కనబడితే అక్కడ తగలబెట్టమని శివసైనికులను ఆదేశిస్తూ తన పత్రిక సంపాదకీయంలో రాశాడు. అప్పట్లో మహారాష్ట్రలో శివసేన-బిజెపి ప్రభుత్వం నడిచేది. బిజెపి శివసేనకు వంతపాడింది. ఠాక్రే ఆదేశాల పుణ్యమాని ''ఔట్‌లుక్'' అనే ఓ కొత్త పత్రిక మార్కెట్లోకి వచ్చిందని ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. వార్తాపత్రికల్లో, టీవీల్లో ఎక్కడ చూసినా అందరూ దాని గురించి మాట్లాడినవారే. మేనేజ్‌మెంట్ ఎంత డబ్బు కుమ్మరించినా అంత పబ్లిసిటీ వచ్చేది కాదు. శివసేన చర్యలను ప్రెస్ కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్, కాంగ్రెసు పార్టీ, ప్రజాహక్కుల సంఘాలు, ఎన్‌జిఓలు ఖండిస్తూ ప్రకటనలు చేసి మరి కొంత పబ్లిసిటీ సమకూర్చాయి. శివసేన అడావుడి రెండు రోజుల్లో చప్పబడిపోయింది. ఈ రెండు కథనాల ద్వారానే కాక ఔట్‌లుక్ మ్యాగజైన్ అందరికీ నచ్చింది. అందరూ వినోద్‌ను మెచ్చుకుంటూనే, యీ ఉద్యోగమైనా నిలుపుకుంటాడా, పత్రిక నాలుగుకాలాల పాటు నడుస్తుందా అంటూ సందేహాలు వెలిబుచ్చారు. వాళ్ల సందేహాలు పటాపంచలు చేస్తూ వినోద్ చివరిదాకా ఔట్‌లుక్‌లోనే వున్నాడు. అనేక వివాదాలను ధైర్యంగా పాఠకుల ముందుకు తెచ్చాడు. ఒక పాఠకుడు అభిప్రాయపడినట్లు వినోద్ గురించి గొప్పగా రాయడం నా లక్ష్యం కాదు. పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకుల మధ్య వున్న అక్రమబంధాన్ని, వారు మీడియాను మేనేజ్ చేసే విధానాన్ని అతను తన ఆత్మకథ ద్వారా వెలుగులోకి తెచ్చాడు. అదే నాకు ఆసక్తికరమైన విషయం. అందుకే అతని బాల్యం, యవ్వనం, కుటుంబం, లండన్ జీవితం గురించిన కథంతా వదిలేశాను.
1993 బొంబాయి పేలుళ్ల తర్వాత వాటికి కారకుడైన దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పారిపోయాడు. రాజకీయ నాయకుల అండ లేకుండా అతను ఆ స్థాయికి చేరి వుండడని అందరూ అనడంతో నేరస్తులకు, నాయకులకు గల సంబంధాలపై పరిశోధించమని ఎన్‌ఎన్ వోరా అనే హోం సెక్రటరీ అధ్యక్షతన కమిటీ వేశారు. ఆయన రెండేళ్లు శ్రమించి తన నివేదికను పార్లమెంటులో సమర్పించారు. అయితే అది 12 పేజీలు మాత్రమే వుంది. అంతా జనరల్‌గా రాసి వుంది తప్ప ఎవరి పేర్లూ పేర్కొనలేదు. ప్రతిపక్షాలు దాన్ని చీల్చి చెండాడాయి. ఎందుకూ పనికిరాని చెత్తగా తేల్చాయి. అయితే ఆ రిపోర్టుకు అనుబంధాలు (ఎనక్జర్స్) వున్నాయని, వాటిని తొక్కిపెట్టారనీ ఢిల్లీలో పుకార్లు పుట్టాయి. అనుబంధాలు వున్నాయని హోం మంత్రి ఎస్‌బి చవాన్ ఒప్పుకుంటూనే అవి మిస్సయిపోయాయన్నారు. ఔట్‌లుక్ కరస్పాండెంట్ రాజేష్ జోషీ అలా మిస్సయిన అనుబంధాలలో ఒక దాన్ని చేజిక్కించుకున్నాడు. దానిలో దావూద్‌కు గుజరాత్, మహారాష్ట్రలలోని రాజకీయ నాయకులతో సత్సంబంధాలు వున్నాయని రాసివుంది. మహారాష్ట్ర నాయకుల్లో గాఢానుబంధం వున్న నాయకుడు శరద్ పవార్ అని కూడా వుంది. జోషీకి దొరికిన కాగితాలలో కోఫెపోసా చట్టం కింద పలుమార్లు అరెస్టయిన హవాలా ఆపరేటరు, దావూద్ తరఫున సిండికేట్ నడిపే మూల్‌చంద్ చోక్సీ 1979 డిసెంబరు 1992 అక్టోబరు మధ్య రూ. 72 లక్షలు యిచ్చినట్లు ఆధారం వుంది. గతంలో వైబి చవాన్ గూఢచర్యం ఉదంతంతో తల బొప్పి కట్టిన వినోద్ యీసారి యిది అసలైనదో, కల్పితమో కనుక్కుకుని అప్పుడు ఉపయోగిద్దామనుకున్నాడు. వోరాకు స్నేహితుడైన జెఎన్ దీక్షిత్‌ను తన పత్రికకు ఎడిటోరియల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా వోరాకు పంపి ఓ సారి చూడమన్నాడు. వోరా పబ్లిక్‌గా, లిఖితపూర్వకంగా నిర్ధారించడం సాధ్యం కాదు కాబట్టి, నోటిమాటగా చెప్తే చాలన్నాడు. ఆయన చెప్పాడు. అంతే 1996 ఫిబ్రవరి 7 సంచికలో 'దావూద్ హవాలా ఏజంట్లతో శరద్ పవార్ లింకు' అని కవర్ స్టోరీ వేసేశాడు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర పత్రికలన్నీ ఔట్‌లుక్ కథనాన్ని పునర్ముద్రించాయి. గుజరాత్ సమాచార్ పత్రిక దావూద్‌తో టెలిఫోన్ యింటర్వ్యూ చేసి 'శరద్ పవార్‌తో మీకు సత్సంబంధాలున్నాయా?' అని అడిగితే అతను ఔనన్నాడు. అందరూ ఔట్‌లుక్ కథనం కరక్టే అనడంతో శరద్ పవార్‌కు ఒళ్లు మండిపోయింది. గతంలో వైబి చవాన్ విషయంలో వినోద్‌కు బుద్ధి చెప్పినట్లే యీసారి చెప్పాలనుకుని అతనిపై, అతని పత్రికపై బొంబాయి హైకోర్టులో రూ.100కోట్లకు పరువునష్టం దావా వేశాడు. వోరాపై చాలా ఒత్తిడి తెచ్చి ఆ అనుబంధంతో తనకే సంబంధం లేదని చెప్పించారు. వినోద్ పబ్లిషరు రాజన్ రహేజా శరద్ పవార్‌కు వ్యక్తిగతంగా మిత్రుడైనా తన సంపాదకుడు వినోద్‌కు దన్నుగా నిలబడ్డాడు. వీళ్లు కేసు విచారణకు హాజరవుతూండేవారు. కేసు సాగుతున్న కొద్దీ పవార్‌కు బెంగ పట్టుకుంది. దావూద్‌తో లింకు వుందని కోర్టులో నిరూపణ అయినా కాకపోయినా, కేసు పెండింగులో వుందంటే ప్రజలు అతన్ని అసహ్యించుకుంటారు. అందువలన 18 నెలల తర్వాత ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్‌కై ప్రయత్నించాడు. కేసు విత్‌డ్రా చేసుకుని, ఇరుపక్షాల లాయర్లు కూర్చుని ఓ స్టేటుమెంటు తయారు చేసి ఔట్‌లుక్‌లో వేయించారు. దాని సారాంశం యిది – ''శరద్ పవార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. పవార్‌కు దావూద్‌కు లింకు వుందని నిరూపించే డాక్యుమెంట్లేవీ తన ముందుకు రాలేదని వోరా పవార్ లాయర్లకు చెప్పారు. ఔట్‌లుక్ వారిద్దరి స్టేటుమెంట్లను ఆమోదిస్తూనే యీ ఆర్టికల్ ఆయనను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో వేసినది కాదని స్పష్టం చేస్తోంది. పవార్ ఒక జాతీయ నాయకుడు కాబట్టి పాఠకులకు ఆసక్తి కలిగించే ఒక న్యూస్ రిపోర్టుగా భావించి అచ్చు వేయడం జరిగింది.'' (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)