బహుశా కొన్ని చానెళ్లకే ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించడం ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ను కిర్రెక్కించినట్లుంది. ఇన్నాళ్లు దాచుకున్నదంతా కక్కేస్తోంది. టాలీవుడ్ బడా హీరోలను, దర్శకులను టాలీవుడ్ వ్యవహారాలను మూడు రోజులుగా ఉతికి ఆరేస్తోంది. ఎందుకు రాస్తున్నారన్నది పక్కన పెడితే రాస్తున్నది అక్షర సత్యం అని అంగీకరించాల్సిందే. ఎవరికీ తెలియని నిజాలు కావు. నిత్యం ఫిల్మ్ నగర్ లో తిరుగుతూ, సినిమా యూనిట్ జనాలతో భుజం భుజం రాసుకుని నడిచే మీడియా జనాలకు ఇవన్నీ తెలిసినవే.
అయితే వివిధ కారణాల రీత్యా తొంభైశాతం మీడియా సినిమా పెద్దలకు వ్యతిరేకంగా ఏమీ రాయదు. సుమారు పదిహేనేళ్ల క్రితం ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇలా అన్నాడు…'నేను ఓ లీడింగ్ సినిమా పత్రికలో పనిచేసేవాడిని, హీరోకి వంగి వంగి దండం పెట్టాల్సి వచ్చేది..ఎందుకు? ఎప్పుడు మా పత్రికకు అతగాడి స్పెషల్ ఫొటో కవర్ పేజీగా కావాల్సి వస్తుందో, ఎప్పుడు అతగాడి ఇంటర్వూ కావాల్సి వస్తుందో తెలియదు. అతగాడి గుడ్ లుక్స్ లో లేకుంటే ఇవ్వడు. అలా తేలేకపోతే నేను అన్ ఫిట్ కింద లెక్క..ఉద్యోగం తీసేస్తారేమో అన్న భయం. అందుకే హీరోలకు వంగి వంగి వుండేవాళ్లం' …సినిమా రంగంలో మీడియా ఇబ్బందిని ఈ మాటలు స్పష్టం చేస్తాయి. ఇప్పటికీ పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. అప్పుడు ప్రింట్ మీడియా హవా వుంటే, ఇప్పుడు విజువల్ మీడియా, వెబ్ మీడియా వచ్చిందంతే.
జనరల్ మీడియాకు, సినిమా మీడియాకు తూర్పు పడమరలకు వున్నంత తేడా వుంటుంది. జనరల్ మీడియా అంటే పొలిటికల్, అధికార వార్తలు రాసేవారంటే ఆయా రంగాలు ఒదిగి వుంటాయి. కానీ సినిమా మీడియాలో ఇది రివర్స్. ఇది మీడియా తప్పిదమో, బలహీనతో కాదు. సినిమా రంగం హీరోయిజం చుట్టూ తిరగడం, ఆ ప్రకటనలపై ఆధారపడడం వంటివి అందుకు కారణాలు. పత్రికల సంగతి ఎలా వున్నా చాలా చానెళ్లకు సినిమా ప్రకటనలే ఆధారం. సినిమా విడుదలవుతుంటే ప్యాకేజీ తేగలగాలి..నటులను స్టూడియోకి రప్పించగలగాలి. ఆ మాత్రం ప్రభావితం చేయగల సత్తా వుండాలి. అలా వుండాలి అంటే అందరితో మంచిగా వుంటూ, రాపో మెయింటెయిన్ చేయగలగాలి.
దాంతో ఇప్పుడు ఆంధ్ర జ్యోతి రాస్తున్న లాంటి రాతలు రాయడం అన్నది కష్టం అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి మేనేజ్ మెంట్ పూనుకుని వుండొచ్చు. లేదా ఎడిటోరియల్ పెద్దలు పూనుకుని వుండొచ్చు. అలా పూనుకుని వుండకపోతే, ఇంతటి వార్తలు రావడం అన్నది సినిమా రంగంలో కష్టం. ఇక్కడ ఆంధ్ర జ్యోతి గురించి కాదు చెబుతున్నది. అన్ని ప్రింట్, విజువల్ మీడియాలో కూడా సినిమా రంగంపై స్వేచ్ఛగా వాస్తవాలు బయటకు రావడం అన్నది కష్టం. ప్రకటనలు రావు, ప్రకటనలు అక్కర్లేదు అనుకున్నవారు మాత్రమే ధైర్యం చేయగలుగుతున్నారు. మిగిలిన వారు అన్నీ తెలిసినా సైలెంట్ గా వుంటున్నారు. ఇటీవల ఓ సంఘటన జరిగింది.
ఓ దినపత్రిక సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే తన వెబ్ సైట్ లో సమీక్షలు నికార్సుగా ప్రకటించేది. దాంతో ఇబ్బంది ఎదురైంది. సినిమా పెద్దలు పత్రిక పెద్దలకు చెప్పడం అలా చేయడం ఆపేయడం చకచకా జరిగిపోయింది. మళ్లీ బాగుండదని కొన్నాళ్లకు ప్రారంభించారు. అయితే వెంటనే కాదు, సినిమా విడుదలయిన ఒకటి రెండు రోజులకు, అది కూడా కాస్త అటు ఇటుగా ఆచి తూచి రాయడం.
ఇప్పుడు సినిమా రంగం ఓ విష వలయంలా తయారైంది. పంపిణీ రంగం, ఫైనాన్స్, ఇన్ ఫా స్ట్రక్చర్ ఈ మూడింటిని గుప్పిట్లో వుంచుకుని సినిమాను శాసిస్తున్నారు. అలా ఈ మూడింటిలో తమ ప్రభావం కనబర్చగలిగిన వారు ఎలాంటి వారినైనా హీరోను చేయగలుగుతున్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇలా తీసుకుంటూ వెళ్తే, ఎప్పటికైనా హిట్ కొట్టచ్చు. కానీ అన్ని తీసుకుంటూవెళ్లాలంటే, స్టామినా వుండాలి.
తెలంగాణ నుంచి ఒక్క హీరో మాత్రమే ఆ స్థాయికి ఎందుకు చేరుకోగలిగారు? అంటే అంతటి నేపథ్యం వుంది కనుక. పంపిణీ రంగం తమ గుప్పిట్లో వుంటే, సరైన కాంబినేషన్ సెట్ చేయగలరు. భారీగా పెట్టుబడులు పెట్టించగలరు. అటు కిలో మీటర్, ఇటు కిలో మీటర్ దూరంలో సరైన సినిమా లేకుండా చేసి, సీజన్ చూసి తమ సినిమాను వదుల్తారు. జనం చూస్తే, అది తమ హీరో ఘనతే అని డప్పేయగలరు. అలఅలా ఓ పెద్ద హీరోను తయారుచేస్తున్నారు. ఎన్టీఆర్ ఎఎన్ఆర్ కాలంలో సినిమాలు హీరోలను తయారు చేసాయి. ఇప్పుడు కొన్ని శక్తులు కలిస్తే హీరో తయారవుతున్నాడు. ఇక్కడ హీరోలు పుట్టరు..హీలోలను పుట్టిస్తారు.
మొన్నటికి మొన్న ఓ నిర్మాత కమ్ డిస్ట్రబ్యూటర్..సినిమా రంగంలో నల్లధనం ఎంత ఎత్తున ప్రవహిస్తోందో చెప్పుకొచ్చాడు. సినిమా హాలు డిసిఆర్ దగ్గరే వైట్ హాఫ్ బ్లాక్ హాఫ్ అన్నది ప్రారంభమైపోతోంది. రికార్డలు చెప్పడానిని యాభై కోట్ల వసూళ్లు, డెభై కోట్ల వసూళ్లు అని వుంటాయి. ప్రెస్ నోట్ లు వస్తాయి. మరి ఇన్ కమ్ టాక్స్ వాళ్లు ఆ ప్రెస్ నోట్ ను అధికారిక ప్రెస్ నోట్ కింద స్వీకరించి, దాని ప్రకారం లెక్కలు కట్టి, పన్ను వసూలు చెస్తున్నారా అంటే అనుమానమే.
అసలు లెక్కలు వేరే వుంటాయి. సినిమా రంగంలో మూడు రూపాయిల నుంచి అయిదురూపాయిల వడ్డీ కి ఫైనాన్స్ వ్యాపారం జరుగుతోందని అందరూ చెబుతారు. కానీ ఇదంతా లీగలేనా? ఆర్బీఐ నిబంధనల ప్రకారమే జరుగుతోందా? నిజానికి లెక్కల్లో కూడా ఇంత మొత్తం చూపిస్తున్నారా? అంటే ఎవరికీ తెలియదు.
సినిమా హాళ్ల లీజు వ్యవహారాలను అన్నింటినీ పర్యవేక్షించడానికి అవసరమైన నియమ నిబంధనలు రూపొందించే తీరుబాటు ప్రభుత్వానికి వుండదు. పై పై పూతలే తప్ప, శస్త్ర చికిత్స జరగదు. ఎవరికి కోపం వస్తే, ఎవరికి నొప్పి పుడితే వారు అరుస్తారు..లేని వారు చూస్తూ పట్టనట్లు వుంటారు. మళ్లీ కొన్నాళ్లకు మరెవరికో నొప్పి పుడుతుంది..కోపం వస్తుంది..వారు అరుస్తారు..వీరు సైలెంట్ గా వుంటారు. ఇదో సర్కిల్ అంతే.
'చిత్ర'గుప్త