ఎమ్బీయస్‌ : వికె మూర్తి కెమెరా విన్యాసం – 2

''ఆర్‌ పార్‌'' సినిమా తీసేటప్పుడు జరిగింది ఆ సంఘటన. దానికి ముందు తీసిన ''బాజ్‌'' ఆర్థికంగా గురుదత్‌ను చాలా దెబ్బ తీసింది. అందువలన యీ సినిమా త్వరత్వరగా తీద్దామని తొందరపడుతున్నాడు. మూర్తి సరైన లైటింగ్‌…

''ఆర్‌ పార్‌'' సినిమా తీసేటప్పుడు జరిగింది ఆ సంఘటన. దానికి ముందు తీసిన ''బాజ్‌'' ఆర్థికంగా గురుదత్‌ను చాలా దెబ్బ తీసింది. అందువలన యీ సినిమా త్వరత్వరగా తీద్దామని తొందరపడుతున్నాడు. మూర్తి సరైన లైటింగ్‌ గురించి తంటాలు పడుతూంటే ''ఏమిటీ చాదస్తం మూర్తీ, టైము వేస్ట్‌ చేయకు, త్వరగా కానీయ్‌'' అంటూ కేకలేసేవాడు. ఓ షాటుకి పెట్టిన లైటింగ్‌ మూర్తికి తృప్తి నివ్వలేదు. ఇంకా టచెస్‌ చేద్దామన్నాడు. ''అక్కర్లేదు, వున్నది చాలు.'' అని గురుదత్‌ గట్టిగా చెప్పి షాటు తీయించేశాడు. మూర్తికి బాధేసింది. అందరూ లంచ్‌కు వెళ్లినపుడు ఓ మూల కూర్చుని కన్నీరు కార్చసాగాడు. సినిమా నుండి తప్పుకుందామన్న ఆలోచన వచ్చింది. లంచ్‌ దగ్గర మూర్తి కనబడకపోయేసరికి గురుదత్‌కు అనుమానం వచ్చి స్టూడియోకి వచ్చి చూశాడు. మూర్తి వద్దకు వచ్చి అనునయంగా ''నా ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా. అందుకే యిలా కానిచ్చేయమంటున్నాను. మళ్లీ నిలదొక్కుకోనీ. నీ ప్రతిభ యావత్తు చూపించే సినిమా ఒకటి తీస్తానని మాట యిస్తున్నాను. ఒక సినిమా డైరక్టర్‌ కథ అది. విశాలమైన స్టూడియోల్లో కథ నడుస్తుంది. అనేక మూడ్స్‌ వుంటాయి. బ్రైట్‌ లైట్‌, సబ్‌డ్యూడ్‌ లైట్‌, కాండిల్‌ లైట్‌.. రకరకాల లైటింగులతో నువ్వు రెచ్చిపోదువు గాని…'' అని ఓదార్చాడు. 
ఇది జరిగిన ఐదేళ్లకు ఆ సినిమా తయారైంది. మధ్యలో ''ప్యాసా'' (తెలుగులో ''మల్లెపూవు''గా తీశారు) వంటి క్లాసిక్‌ వచ్చింది. అది విమర్శకులను మెప్పించడంతో బాటు వాణిజ్యపరంగా కూడా విజయవంతం అయింది. గురుదత్‌ కెరియర్‌లో అది మైలురాయిగా నిలిచిపోయింది. దానిలో తన సంతాపసభకు తనే హాజరైన గురుదత్‌ ద్వారం వద్ద నిలబడి వున్న దృశ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. అలాగే వేశ్యావాటిక సెట్టింగును కూడా. నలుపుతెలుపు రంగుల్లో వెలుగునీడల విన్యాసం చూడాలంటే అలాటి సినిమాలు చూడాలి. ఇక ''కాగజ్‌ కే ఫూల్‌'' సినిమా వచ్చేవరకు మూర్తి చెలరేగిపోయాడు. 

దానిలో ఒక ప్రత్యేకమైన లైటింగు గురించి ప్రస్తావించి తీరాలి. ఆ సినిమా నిర్మాణం జరిగిన మెహబూబ్‌ స్టూడియోలో పై నున్న రేకుల మధ్య కన్నం లోంచి మధ్యాహ్నం పూట సూర్యకాంతి ఒక కాంతిపుంజంలా పడేది. ఒకసారి దాన్ని చూస్తూ గురుదత్‌ ''మూర్తీ నాకు స్టూడియో లైట్లతో ఆ ఎఫెక్టు యివ్వగలవా? క్లయిమాక్స్‌లో డైరక్టరు కుర్చీలో కూర్చుని హీరో చచ్చిపోతాడు. అప్పుడు అలాటి లైటింగ్‌ ఒక కాంతిజలపాతంలా అతనిపై పడాలి.'' అన్నాడు. ''సూర్యకాంతి పడే సమయానికి ఆ సీను తీయాలి తప్ప లైట్లతో దాన్ని సృష్టించలేం. కాంతి చెదిరిపోతుంది.'' అన్నాడు మూర్తి. ''ప్రయత్నించి చూడు. నీకు మార్గం దొరికేవరకూ ఆ సీను చిత్రీకరణ వాయిదా వేస్తాను.'' అన్నాడు గురుదత్‌. మూడు నాలుగు రోజులు పోయాక మేకప్‌మన్‌ ఒకతను చేతిలో అద్దం పట్టుకుని స్టూడియో బయటకు వెళితే సూర్యకిరణం అతని అద్దం మీద పడి, ప్రతిఫలించింది. అది వీళ్లు అనుకున్నట్టే కాంతిస్తంభంలా పడింది. మూర్తికి ఐడియా వచ్చేసింది. 4 అడుగుల పొడుగు, 3 అడుగుల వెడల్పు వున్న అద్దాలు రెండు తెప్పించాడు. ఒకదాన్ని టెర్రేస్‌పై పెట్టి సూర్యుడి వెలుగు పడేట్లు చేశాడు. సూర్యకిరణం దాని నుండి పరావర్తనం చెంది, స్టూడియో లోపల పెట్టిన మరొక అద్దం మీద పడేట్లు చేస్తే అనుకున్న ఎఫెక్టు వచ్చేసింది. దాని చుట్టూ కాస్త దుమ్ము, కాస్త పొగ చేర్చేటప్పటికి ఒక మూడ్‌ క్రియేట్‌ అయింది. లోపలి అద్దం కోణం మార్చుకుంటూ తమకు తగినట్టుగా షాట్లు తీసుకున్నారు. 

సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌ ఫరీదూన్‌ ఇరానీ అటువైపు వెళుతూ యిది చూసి ''మూర్తీ, సన్‌లైట్‌లో షూటింగు చేస్తున్నావా?'' అని అడిగాడు. మూర్తి తన పద్ధతి చెప్పేసరికి, 'ఇదెక్కడి వింతపద్ధతిరా బాబూ' అని ఆయన తెల్లబోయాడు. రషెస్‌ చూశాక వచ్చి అద్భుతంగా వుందని మెచ్చుకుంటూ కౌగలించుకున్నాడు. దాంతో గురుదత్‌కు ధైర్యం వచ్చి, ''వక్త్‌ నే కియా, క్యా హసీ సితమ్‌'' పాటకు కూడా యిదే టెక్నిక్‌ ఉపయోగించాడు. దురదృష్టమేమిటంటే సినిమా ఫ్లాపయింది. దీని తర్వాత గురుదత్‌ వేరే ఏ సినిమాకు దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు.

1962లో ''సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌'' తీసినప్పుడు డైరక్టరుగా రచయిత అబ్రార్‌ అల్వీ పేరు వేశాడు. సినిమా తనే డైరక్టు చేశానని, పాటలు మాత్రం గురుదత్‌ డైరక్టు చేశాడనీ అబ్రార్‌ అంటాడు. అతనికి బెస్ట్‌ డైరక్టర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది కూడా. ఫోటోగ్రాఫర్‌గా మూర్తికి రెండో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. ''సాహిబ్‌..'' కూడా నలుపు, తెలుపు సినిమాయే. జమీందారు భవనంలో భర్త చేత నిరాదరించబడి ఒంటరి జీవితం గడుపుతున్న కథానాయిక జీవితంలోని వెలుగునీడలను కెమెరా చక్కగా పట్టుకుంది. సినిమా విజయవంతం అయినా గురుదత్‌ వ్యక్తిగత సమస్యలతో విషాదంలో మునిగిపోయాడు. ఆత్మహత్యా ప్రయత్నాలు చేశాడు. సినిమాలు ప్రారంభించడం, మధ్యలో ఆపేయడం ఎక్కువైంది. మూర్తి మద్రాసుకి తరలిపోయి అక్కడ తీస్తున్న ''సూరజ్‌'' వంటి సినిమాలకు పనిచేస్తూండేవాడు. 1964లో గురుదత్‌ ''బహారేం ఫిర్‌ భీ ఆయేంగే'' (1966లో రిలీజైంది. తెలుగులో ''కూతురు-కోడలు''గా వచ్చింది) ప్లాన్‌ చేశాడు. మూర్తి తన అసిస్టెంటు కె జి ప్రభాకర్‌ను ఫోటోగ్రాఫర్‌గా సిఫార్సు చేశాడు. ''సూరజ్‌'' లోని కొన్ని దృశ్యాలు బొంబాయిలోని మెహబూబ్‌ స్టూడియోలో తీస్తూండగా అక్కడికి గురుదత్‌ వచ్చి ''ఇక్కడ నీ పని అయిపోయిన తర్వాత వచ్చి మా సినిమాకు కొన్ని సీన్లు తీసిపెట్టాలి'' అని కోరాడు. సరేనని మూర్తి మాలా సిన్హాతో కొన్ని దృశ్యాలు, జానీ వాకర్‌ పాట తీశాడు. 

ఆ రోజుల్లో గురుదత్‌ తన పెద్దార్‌ రోడ్‌ ఫ్లాట్‌లో ఒంటరిగా వుండేవాడు. భార్య విడిపోయి పిల్లలతో వేరే చోట వుండేది. డిప్రెషన్‌లో వుండి విపరీతంగా మద్యం సేవించేవాడు. రతన్‌ అనే ఒక పనివాడు మాత్రం వుండేవాడు. మూర్తిని ఒక రోజు పిలిపించి ''చూశావా, నేను ఒక్కణ్నే అయిపోయాను. నువ్వు మద్రాసు వెళ్లిపోయావు. అక్కడ నీకెంత అడ్వాన్సు యిచ్చారు? అది నీకు యిచ్చేస్తాను. వెనక్కి యిచ్చేసి బొంబాయి వచ్చేసేయ్‌.'' అన్నాడు. మితభాషి అయిన గురుదత్‌ అంత ఎమోషనల్‌గా మాట్లాడడం చూసి మూర్తి చలించిపోయాడు. కానీ తన వృత్తిపరమైన బాధ్యతలను విస్మరించలేకపోయాడు కాబట్టి మద్రాసు తిరిగి వెళ్లిపోయాడు. ఆ అక్టోబరులోనే గురుదత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 
కొసమెరుపు – 1997 లో నేను ఆంధ్రజ్యోతి వీక్లీకై గురుదత్‌పై సుదీర్ఘవ్యాసం రాస్తూ వికె మూర్తి ఫోటోగ్రఫీని మెచ్చుకుంటూ ఆయన తెలుగువాడు అని రాశాను. సుప్రసిద్ధ విమర్శకులు, మిత్రులు విఎకె రంగారావుగారు 'ఫోటోగ్రఫీకి, తెలుగువాడు కావడానికి సంబంధం ఏముంది? అదెందుకు రాయడం?' అని చివాట్లు వేశారు. 'పాఠకులు కనెక్ట్‌ అవుతారు కదాని…' అని నసిగాను. 'అయినా ఆయన కన్నడిగుడు. మైసూరువాడు. తప్పు రాశావ్‌.' అన్నాడాయన. అప్పట్లో సినిమా సమాచారం సేకరించడం కష్టసాధ్యంగా వుండేది. 'తెలుగువాడని ఎవరో చెపితే రాశాను. సరిదిద్దుకుంటాను.' అన్నాను. కొన్నాళ్లకి వికె మూర్తి జీవితగాథ కన్నడంలో వెలువడింది. దానిలో తమది కర్ణాటకలో స్థిరపడిన తెలుగు కుటుంబమే అని ఆయన రాసుకున్నారట! 

ఆయన ప్రతిభను అక్షరాల్లో కుదించడం కష్టం. వీలైతే పైన చెప్పిన సినిమాలు చూడండి. లేకపోతే గూగుల్‌ యిమేజిలకు వెళ్లి ఆ సినిమా స్టిల్స్‌ చూడండి. ఆయన ప్రతిభకు జోహార్లు తెలపండి. (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]