నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అవుతాడని చాలాకాలం క్రితమే స్పష్టమైంది. మధ్యలో కొందరికి సందేహాలు ఎందుకు వచ్చాయంటే 2014 మోదీ వేవ్ మళ్లీ పునరావృతం కాదని, అందుచేత బిజెపికి గతంలో కంటె 50 సీట్లు తక్కువ వచ్చి, ఎన్‌డిఏకు యితరుల మద్దతు అవసరం పడుతుందని, వాళ్లు మోదీ కాకుండా వేరేవారిని ప్రధానిని చేయమని షరతులు పెడతారని అనుకోవడం జరిగింది.
గడ్కరీ, రాజనాథ్ సింగ్ పేర్లు కూడా కొంత ప్రచారంలోకి వచ్చాయి. కానీ నేను వాటిని నమ్మలేదు. గడ్కరీ కానీ మరొకరు కానీ తనకు పోటీదారుగా వస్తారని ఏ మాత్రం శంక కలిగినా మోదీ వాళ్లను ఏవేవో కేసుల్లో యిరికించి మధ్యదారిలోనే ఆపేయగలడని అనుకున్నాను. పైగా అమిత్ షా వంటి టక్కరి పక్కన ఉండగా ఫిరాయింపులను ప్రోత్సహించైనా మళ్లీ గద్దె నెక్కుతాడు తప్ప, చేజారనివ్వడని నమ్మాను. చివరికి చూస్తే బిజెపికి గతంలో కంటె ఎక్కువ వచ్చి (282-303) మోదీ మరింత బలపడ్డాడు.
ఎన్‌డిఏలో బిజెపికి 303 రాగా 12 మిత్రపక్షాలకు కలిపి 50 వచ్చాయి. అంటే ఎన్‌డిఏలో బిజెపి బలం 85%. యుపిఏకు 92 వస్తే దానిలో కాంగ్రెసు బలం 52 అంటే 57%. ఎన్‌డిఏకు గతంలో కంటె 17 ఎక్కువ వచ్చాయి. దీనికి దోహదపడినది జెడియు. 2014లో ఎన్‌డిఏతో కలవకుండా 2 తెచ్చుకున్న ఆ పార్టీ యీసారి ఎన్‌డిఏలో చేరి 16 తెచ్చుకుంది. ఎడిఎంకె గతంలో 'ఇతరులు' లో ఉండటం చేత ఆ సంఖ్య 2014లో 147 ఉంది. ఇప్పుడది ఎన్‌డిఏలో చేరి 37 సీట్లు పోగొట్టుకుంది. టిడిపి గతంలో ఎన్‌డిఏలో ఉండి 16 తెచ్చుకున్నది, యీసారి విడిగా పోటీ చేసి మూడే తెచ్చుకుంది. ఎన్‌డిఏలోని యితర పక్షాలలో శివసేన (18), ఎల్‌జెపి (6), అప్నాదళ్-ఎస్ (2), ఎన్‌పిఎఫ్ (1), ఎన్‌పిపి (1) సీట్లలో మార్పు లేదు. సీట్లు పెంచుకున్నవాటిలో ఎజెఎస్‌యు (0-1), ఎంఎన్‌ఎఫ్ (0-1), ఎన్‌డిపిపి (0-1), ఆర్‌ఎల్‌పి (0-1) పోగొట్టుకున్నవారిలో అకాలీదళ్ (4-2), ఇలా చూస్తే బిజెపి మిత్రపక్షాలలో జెడియుయే బాగా బాగుపడింది. జెడియుకు సొంతబలం ఉందన్న విషయమూ విస్మరించలేం.
యుపిఏలో ఉన్న కాంగ్రెసు 2014లో 44 తెచ్చుకుంటే 2019లో 52 తెచ్చుకుంది. దాని భాగస్వామ్య పక్షాలలో బాగా బలం పెంచుకున్నది డిఎంకె (0-23) మాత్రమే. నేషనల్ కాన్ఫరెన్స్ (0-3) ఐయుఎమ్‌ఎల్ (2-3), విసికె (0-1) కాస్త పెంచుకున్నాయి. కెఇసిఎమ్ (1), ఆర్‌ఎస్‌పి (1) కు అలాగే వున్నాయి. తక్కినవన్నీ పోగొట్టుకున్నాయి. ఎన్‌సిపి (6-5), ఆర్‌జెడి (4-0), జెఎంఎం (2-1), జెడిఎస్ (2-1). యుపిఏకు గతంలో కంటె 32 పెరిగి 92 వచ్చాయంటే దానికి కారణం తమిళనాడే. అక్కడ డిఎంకె 23, కాంగ్రెసు 8, ఐయుఎంఎల్ 1 తెచ్చుకున్నాయి. ఇతరులలో సిపిఎం (0-2), సిపిఐ (0-2) తమిళనాడులోనే లాభపడ్డాయి. ఇతరులకు 147 నుంచి 97కు తగ్గాయి. వారిలో బలం పెంచుకున్నవి వైెసిపి (9-22), బియస్పీ (0-10), మజ్లిస్ (1-2), స్వతంత్రులు (3-4) బలం నిలుపుకున్నది ఎస్పీ (5) ఎన్‌పిఎఫ్ (1) మాత్రమే. ఇక తక్కినవన్నీ బలహీనపడ్డాయి. తృణమూల్ (34-22), బిజెడి (20-12), తెరాస (11-9), సిపిఎం (9-3), ఆప్ (4-1), పిడిపి (3-0), ఏఐయుడిఎఫ్ (3-1), టిడిపి (16-3)!
బిజెపికి గతంలో కంటె ఎక్కువ వస్తాయని యిటీవలి దాకా ఎవరూ అనుకోలేదు. 2014లో బిజెపి శిఖరాలకు చేరిందని, అక్కణ్నుంచి దిగజారడమే తప్ప మరో మార్గం లేదని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడం వలన, మోదీ యిచ్చిన హామీలు నెరవేరక పోవడం వలన, ద్రవ్యోల్బణం వలన, నిరుద్యోగం వలన, రాజకీయ సమీకరణాల చేత యుపిలో భారీగా నష్టం వాటిల్లడం వలన – తగ్గడమే తప్ప పెరగడం ఉండదనే అంచనాలు వేశారు. కానీ గత మూడు నెలలుగా పరిస్థితి మారిపోయింది.
2014లో మోదీ పఠించినది అభివృద్ధి మంత్రం, గుజరాత్ మోడల్, నల్లధనం కక్కించడం వగైరాలు. 2019 వచ్చేసరికి అవి మాయమయ్యాయి. జాతీయవాదం ముందుకు వచ్చింది. తన గెలుపుకు కారణాన్ని మోదీయే స్వయంగా చెప్పుకున్నారు. అరిథ్మెటిక్ కంటె కెమిస్ట్రీ వర్కవుట్ అయిందని! జిడిపి, ద్రవ్యోల్బణం, ఎగుమతి-దిగుమతి వ్యత్యాసం వంటి గణాంకాల నుండి మోదీ దృష్టి మరల్చి ప్రజలను ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. తను తప్ప తక్కినవారందరూ దేశభక్తి లేనివారే, ఆ మాటకొస్తే దేశద్రోహులే అని ప్రజల్ని నమ్మించగలిగారు.
ప్రతిపక్షం బలంగా ఉండి ఉంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాకుండా ఉంటే బిజెపిని ఓ మేరకు అడ్డుకోగలిగేవారు. వీళ్ల చేతకానితనం మోదీకి కలిసి వచ్చింది. ఫలితాలు చూసేదాకా తనెంత అసమర్థుడో రాహుల్‌కి తెలియలేదంటే అదే పెద్ద అసమర్థత. కాంగ్రెసుకు 140 వస్తాయని, 52 రావడంతో హతాశుడయ్యాడని వార్తలు వచ్చాయి. చూడబోతే రాహుల్ లెక్కల్లో కూడా వీక్ ఏమో! 140 రావాలంటే ఎన్ని స్థానాల్లో గెలవాలో తెలియలేదేమో!
బిజెపికున్న సంస్థాగతమైన నిర్మాణం, ఆరెస్సెస్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనడం యివన్నీ దాని విజయానికి ఎంతో ఉపయోగపడ్డాయి. చాలా ఏళ్లగా సమాజాన్ని కులపరంగా విడగొట్టి కొన్ని పార్టీలు లాభపడితే, యీసారి మతపరంగా విడగొట్టి ఓట్లు సాధించడంలో బిజెపి సఫలమైందన్న దానికి రెండో మాట లేదు. గ్యాస్ పొయ్యిలు యివ్వడాలు, టాయిలెట్స్ కట్టించడాలు వంటి కేంద్ర పథకాల లబ్ధిదారులే తమను గెలిపించారని బిజెపి చెప్పుకుంటోంది. ఇలా బిజెపి గెలుపుకు ఎన్నో కారణాలు చెపుతున్నారు. అయితే యివన్నీ జనరల్‌గా మాట్లాడుకునేవి.
ఈ ప్రతిపాదనలకు విపర్యాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇవిఎంలను దుర్వినియోగం చేసిన మాట నిజమైతే కేరళలో బిజెపి నెగ్గలేదేం? బిజెపి రాజకీయ చతురత తమిళనాడులో పని చేయలేదేం? దేశభక్తే ప్రధాన అంశమైతే సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో అది పారలేదేం? గ్యాస్ పొయ్యి మనకు కొత్తా? 'దీపం' పథకం ద్వారా ఎప్పుడో యిచ్చారు కదా! టాయిలెట్స్ గత ప్రభుత్వాలు ఏవీ కట్టించలేదా? గతంలో నిర్మల్ అభియాన్ అన్నారు, యిప్పుడు స్వచ్ఛ భారత్ అంటున్నారు. ఆ మాత్రానికే ఓట్లేసేస్తారా!? ఏది ఏమైనా 2019లో మోదీ గెలుపు అపూర్వమైన గెలుపు.
2014 దైతే యుపిఏ పాలనపై విసుగు, మోదీపై ఆశలు.. యిలాటివన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఐదేళ్ల పాలనలో ప్రజల స్థితిగతులు మెరుగుపడకపోయినా, బిజెపి గతంలో కంటె మిన్నగా గెలవడం ఒక అద్భుతం. దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. మనకు స్పష్టమైన చిత్రం గోచరించాలంటే రాష్ట్రాల వారీగా విశ్లేషిస్తూ పోవాలి. అక్కడ మరిన్ని గణాంకాలు, సర్వే ఫలితాలు యిస్తాను. అప్పుడే యీ గెలుపుసూత్రాన్ని అర్థం చేసుకోగలం. మన విశ్లేషణ బెంగాల్‌తో మొదలుపెడదాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2019)
[email protected]