బిహార్‌లోని దర్భంగా జిల్లాలో భద్‌వా గ్రామంలో కమలేశ్ యాదవ్ అనే బిజెపి కార్యకర్త ఉన్నాడు. మోదీపై భక్తితో తన యింటి ప్రాంగణంలో 'మోదీ చౌక్' అనే బోర్డు రాయించి పెట్టేసుకున్నాడు. ఇది 2016లో జరిగింది. అప్పణ్నుంచి ఆ సెంటర్‌ను మోదీ చౌక్ అని బిజెపి వాళ్లు పిలవసాగారు కానీ మొన్నటిదాకా బిజెపికి వ్యతిరేకంగానే ఉన్న నీతీశ్ కుమార్ ప్రభుత్వం ఆ సెంటరుకు ఆ పేరు ఆమోదించలేదు. సొంత యింట్లోనే పెట్టుకున్న బోర్డు కాబట్టి ఎవరూ పీకి పారేయలేదు. ఇదీ నేపథ్యం.
మార్చి 15 రాత్రి ఓ పాతిక మంది కత్తులు, హాకీ కర్రలతో కమలేశ్ యాదవ్ యింటిపై పడ్డారు. కమలేశ్‌ను తీవ్రంగా కొట్టారు. అతని 61 ఏళ్ల తండ్రి రామచంద్ర యాదవ్ పీకను కత్తితో తెగనరికారు. పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. కమలేశ్‌ను దర్భంగా మెడికల్ కాలేజీ హాస్పటల్‌లో చేర్చడంతో ప్రాణప్రమాదం తప్పింది.
అతను పోలీసులతో, 'నేను ఆ సెంటరుకు మోదీ చౌక్ అని పేరు పెట్టడం తక్కిన పార్టీల వాళ్లకు రుచించలేదు. అందుకే నాపై దాడి జరిగింది. మా నాన్నను చంపారు.' అని స్టేటుమెంటు యిచ్చాడు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు నిరసనలు తెలుపుతూ ఆందోళనలు చేయసాగారు – 'ఓ చౌక్‌కు మోదీ పేరు పెట్టినంత మాత్రాన ప్రాణాలు తీసేస్తారా?' అంటూ. వెంటనే నీతీశ్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్ మోదీ 'అబ్బే, అది మోదీ చౌక్ పేరు గురించి జరిగిన గొడవ కాదు. వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడి.' అని స్పష్టీకరించాడు.
కానీ బిహార్‌కు చెందిన కొందరు బిజెపి నాయకులు దీనికి ఆ కలరింగే యివ్వదలచుకున్నారు. సుశీల్ స్టేటుమెంటు యిచ్చిన మర్నాడే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు నిత్యానంద రాయ్ 'మోదీ చౌక్ పేరు గురించి జరిగినదే యీ దాడి' అని ఉద్ఘాటించాడు. బిహారుకు చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అది మోదీ చౌక్ గురించిన గొడవే అని పునరుద్ఘాటించడంతో బాటు మరింత ముందుకు వెళ్లి దానికి కులం రంగు కూడా పులమబోయాడు.
'ఒక కులం వారు, వారికి సంబంధించిన పార్టీ వారు విషం చిమ్ముతున్నారని నాకు తెలుసు' అన్నాడు. బిహారులో యాదవులు లాలూ యాదవ్‌కు ఓటేస్తూంటారు. ఈ కేసులో కమలేశ్ యాదవుడే అయినా బిజెపి పక్షపాతి కావడాన్ని తోటి యాదవులు సహించలేక అతనిపై దాడి చేశారని స్ఫురించేట్లా మాట్లాడాడు. ఇలా మాట్లాడాన్ని నీతీశ్ ఖండించాడు. బిజెపి పేరు ఎత్తకపోయినా సమాజాన్ని కులాలపరంగా విడగొట్టే ధోరణిని సహించనని హెచ్చరించాడు.
ఈ లోగా జిల్లా డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) 'ఇది ఏడాదిగా నలుగుతున్న భూమి తగాదాకు సంబంధించిన హత్య. ఆ బోర్డు రెండేళ్లగా అక్కడున్నా జరగని గొడవ యిప్పుడే ఎందుకు జరుగుతుంది?' అని వివరణ యిచ్చాడు. ఇలా స్టేటుమెంటు యిచ్చిన డిఎస్పీకి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ యిచ్చిన ఉపన్యాసాల వీడియోలు వైరల్ కావడంతో నీతీశ్‌కు ఏం చేయాలో పాలుపోవటం లేదు.
కులాల ఘర్షణలకు పేరు బడిన భాగల్పూరులో యీ విషయంపై బిజెపి నాయకులు అల్లర్లు చేయడంతో 21 మందిపై నాన్‌బెయిలబుల్ వారంటు జారీ అయింది. ఆ 21 మందిలో కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు ఆర్జిత్ శాశ్వత్ ఒకడు. అతను భాగల్పూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి టిక్కెట్టుపై పోటీ చేసి ఓడిపోయాడు. అతనిపై వారంటు ఉన్నా పోలీసులు అరెస్టు చేసినట్లు లేదు. ఎందుకంటే మార్చి 25న పట్నాలో జరిగిన రామనవమి ఉత్సవాల్లో అతను పాల్గొన్న వీడియోలు బయటకు వచ్చాయి. బిజెపి నాయకులు ఏం చేసినా వారిపై నీతీశ్ ఏ చర్యా తీసుకోలేకుండా ఉన్నాడని చెప్పడానికి యిది ఒక ఉదాహరణ.
2005-13 మధ్య బిజెపి-జెడియు సంకీర్ణ ప్రభుత్వం నడిచినప్పుడు నీతీశ్ మాటే చెల్లింది. అతని సెక్యులరిజాన్ని, సుపరిపాలనా విధానాన్ని బిజెపి ఆమోదించి ద్వితీయ స్థానంలో ఉండడానికి సమ్మతించింది. కానీ 2014లో మోదీ గెలుపు తర్వాత బిజెపి దూకుడు మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ చేసి 71 స్థానాలు గెలిచిన జెడియు, 53 స్థానాలు గెలిచిన బిజెపి యిప్పుడు చేతులు కలిపాయి. పార్లమెంటులో తమకు 22 సీట్లు, జెడియుకు 2 సీట్లు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలోనూ తనే బిగ్ బ్రదర్ అనుకుంటోంది బిజెపి. కానీ అవతల లాలూ ఉధృతి తగ్గలేదు. ఉపయెన్నికలలో తన సత్తా చూపాడు.
విడివిడిగా వీళ్లిద్దరి కంటె ఎక్కువగా 80సీట్లు ఉన్నాయి అతని దగ్గర. అతని భాగస్వామి కాంగ్రెసు వద్ద 27 ఉన్నాయి. ఉపయెన్నికల ఫలితాల తర్వాత బిజెపికి ఒకటి అర్థమైంది. లాలూను నిలవరించాలంటే తను తిరిగి హిందూత్వ ఎజెండాకు తిరిగి మరలాల్సిందే, యాదవులను చీల్చాల్సిందే అని. అందుకే యీ భూమి తగాదా అంశాన్ని యాదవుల మధ్య ముసలంగా, బిజెపి కార్యకర్తల పట్ల దాడిగా చిత్రీకరిస్తోంది. ఇదంతా నీతీశ్‌కు నచ్చటం లేదు. ఉపయెన్నికలలో బిజెపి తన స్థానాన్ని నిలుపుకోగా, జెడియు తన జెహానాబాద్ స్థానాన్ని లాలూకు సమర్పించుకుంది. అసలు తనకు అభ్యర్థిని నిలపడం యిష్టం లేదని, కానీ బిజెపి ఒత్తిడికి లొంగి ఆ పని చేయాల్సి వచ్చిందని, దానివలన పార్టీ ప్రతిష్ఠ మసకబారిందని నీతీశ్ బహిరంగంగా వాపోయాడు.
బిజెపి పెద్దన్న ధోరణి మరో భాగస్వామి ఐన జితనే రామ్ మాంఝీకి నచ్చలేదు. అతను హిందూస్తానీ ఆవామ్ మోర్చా సెక్యులర్ పార్టీకి అధ్యక్షుడు, ఏకైక ఎమ్మేల్యే. అతను యీమధ్యే లాలూ కూటమిలోకి చేరిపోయాడు. మరో భాగస్వామి ఐన రాంవిలాస్ పాశ్వాన్ నీతీశ్ మార్గంలోనే బిజెపి నాయకుల పేర్లు ఎత్తకుండా బిహార్ సమాజాన్ని కులాల వారీగా విభజించి చూడడాన్ని తాను వ్యతిరేకిస్తానని ప్రకటించాడు. 2014 పార్లమెంటు ఎన్నికలలో బిహారులో బిజెపి, దాని మిత్రపక్షాలు 40లో 31 సీట్లు గెలుచుకున్నాయి. 2019లో అన్ని సీట్లు వస్తాయని ఎవరూ గట్టిగా చెప్పలేకుండా ఉన్నారు – బిజెపి, దాని ప్రస్తుత మిత్రపక్షాల లుకలుకలు చూస్తూ ఉంటే!
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]