ఎమ్బీయస్‍: రాంబాబు డైరీ

మూడు కోతుల బొమ్మ నీతి నేర్పుతుందంటే నేను నమ్మను. ఆ లెక్కన ప్రపంచంలోని గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, మూగవాళ్లు అంతా నీతిమంతులే అయ్యుండాలి.

2024 జూన్‌లో తన 84వ ఏట కాలం చేసిన పాత్రికేయుడు, రచయిత, సంగీతజ్ఞుడు, ‘‘రసమయి’’ పత్రికా సంపాదకుడు, నండూరి పార్థసారథి గారు ప్రముఖ సంపాదకుడు నండూరి రామమోహనరావు గారి తమ్ముడు. రామమోహనరావు గారి గురించి నేను రాసిన వ్యాసం లింకులో చదవవచ్చు. పార్థసారథి గారి పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది “సాహిత్య హింసావలోకనం”, తట్టలు తట్టలుగా సాహిత్యాన్ని తయారు చేసి పారేసే వాళ్లను, ప్రయోగాల పేరిట సాహిత్యాన్ని ఖూనీ చేసేవాళ్లను భూతద్దం కింద పెట్టి చూసి కాల్చి పారేసిన (ఆ నవల ముఖచిత్రం అదే మరి) రచన అది. అద్వితీయమైన వ్యంగ్యం నం.పా.సా. సొత్తని నిరూపించిన నవల అది.

పాత్రికేయులపై అటువంటి వ్యంగ్య రచన – రాంబాబు దైరీ, 1962లో మొదలైన ఈ రచన దశాబ్దాలపాటు అలా సాగుతూనే వచ్చింది. రాంబాబు చిరంజీవిలా అదే వయసులో అలాగే ఉండిపోయాడు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సంఘటనలపై తన వ్యాఖ్యలను వినిపిస్తూనే ఉన్నాడు. రాంబాబు ఒట్టి పాత్రికేయుడే కాదు. కాలేజీ కుర్రాడు. లవర్, కళాభిమాని, లోకాన్ని అవలోకించే గొప్ప ‘తాత్త్వికుడు’. పార్థసారథి గారు చెప్పినట్టు మనందరిలోనూ రాంబాబు ఉన్నాడు. వేరు వేరు డిగ్రీలలో! అందుకే అతడు మనందరికీ ఆత్మీయుడయ్యాడు. 1960ల నుంచి వివిధ పత్రికలలో వచ్చిన రచనలు తర్వాతి కాలంలో పుస్తక రూపంలో వచ్చాయి. https://nanduri.com/books లింకులో యితర వివరాలుంటాయి.

అమాయకుడి గురించి, అజ్ఞాని గురించి ఇంకోళ్లు రాయడం సులభం. కానీ అతడే ఉత్తమ పురుష (ఫస్ట్ పర్సన్‌)లో చెప్పుకుని వచ్చినట్టు రాయడం చాలా కష్టం. ఎందుకంటే అతను తన తప్పుని ఒప్పుగా రాస్తాడు. పాఠకుడే తనకు తానుగా ఆ తప్పేమిటో కనిపెట్టాలి. నేను ‘‘అచలపతి కథలు’’ రాసినపుడు ఆ అవస్థే పడ్డాను. రాంబాబు ఆలోచనలను డైరీ రూపంలో రాసి నం.పా.సా. ఆ ప్రయోగమే చేసారు, రక్తి కట్టించారు. పాఠకుడి స్థాయి రాంబాబు స్థాయి కంటే ఎక్కువగా ఉంటుందని ఊహించి రాయక పోతే ఈ డైరీ రచించడానికి సాహసించలేడు రచయిత. ఈనాటి పాఠకుల తీరికను, ఓపికను దృష్టిలో పెట్టుకుని పార్థసారథి గారు చేసిన ప్రయోగాలను వర్గీకరించి చూపడం జరుగుతోంది. కొన్ని చోట్ల వివరణలు కూడా యిచ్చాను. దీని వలన పాఠకులు పుస్తకాన్ని ఆస్వాదించ గలిగేందుకు ఇబ్బంది పడరని నా నమ్మకం.

రాంబాబు ఓ కాలేజీ కుర్రవాడు. వయస్సు ఇరవై. మేనమామ కూతురు వరలక్ష్మి అంటే ఇష్టం. పెళ్లాడదామని కోరిక. ‘‘సుజనమిత్ర’’ అనే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డెయిలీ ఫ్రమ్ చింతల్ బస్తీ (సర్క్యులేషన్ 2 వేల కాపీలు)లో పార్ట్‌టైమ్ ఉద్యోగం, జర్నలిస్టుగా! అతను చేరాక పత్రిక సర్క్యులేషన్ 22 కాపీలు పెరిగింది కూడా! అయినా ఎడిటరు గారికి అతనంటే చిన్నచూపే, దానికి కొంత కారణం రాంబాబు దబాయింపూ, తెలియనది తెలియదని ఒప్పుకోకపోవడమూ! ఇంగ్లీషు, తెలుగు సరిగా రాక కొంత, ‘స్వేచ్ఛా’నువాదాల వల్ల కొంత, కుతర్కం వల్ల కొంత, అమాయకత్వం, అజ్ఞానం, అతి తెలివి వల్ల కొంత – యిలా రకరకాలుగా తనకు తెలియకుండానే బోల్డంత హాస్యాన్ని పంచాడు రాంబాబు. 1959 మంచీ 37 సంవత్సరాలు పాత్రికేయుడిగా ఉన్న పార్థసారథి గారికి వృత్తిజీవితంలో ఎదురయిన అనేక సంఘటనలతో ఈ డైరీ రూపొందింది అన్నది సులభంగా ఊహించవచ్చు. ఈ పుస్తకం చదవకపోతే ఈ రకమైన హాస్యాన్ని మీరు మిస్ అయినట్లే. దానిలో దొరికే అనేక ఆణిముత్యాలలో కొన్ని:

రాంబాబు పరిశీలనలు: * మోటారు సైకిలుకి ఒట్టి సైకిలుకి తేడా – మోటారు సైకిల్ తొక్కి ఎక్కవలెను. ఒట్టి సైకిలు ఎక్కి తొక్కవలెను. * ఈ మధ్య మగవాళ్ల కంటే ఆడవాళ్లకి పెళ్లిళ్లు ఎక్కువగా అవుతున్నట్టున్నాయి. క్రమంగా ఆడవాళ్ల జనాభా పెరగడమే ఇందుకు కారణం అయుంటుంది. * లెక్క ఎలా చేసినా ఆన్సరు రాలేదు. ఆఖరికి పుస్తకం చివరిలో ఉన్న ఆన్సరు చూసి చేస్తే చచ్చినట్టు వచ్చింది. అట్నించి నరుక్కు రావడం అంటారు దీన్నే. * క్షవరం చేయించుకుంటే కనీసం వారం రోజుల వరకు అమ్మాయి లెవరూ ప్రేమించరు. * దున్నేవాడిదే భూమి అన్నట్టుగా ఉతికి వాడిదే బట్ట, గొరిగే వాడిదే తల అంటారన్న భయం తోనే గాంధీగారు దూరదృష్టితో తన బట్టలు తానే ఉతుక్కునే వారు. తన క్షవరం తానే చేసుకునేవారు.

*కర్ణుడికి, నెపోలియన్‌కీ పోలికలున్నట్టు తోచింది. పరీక్షల్లో యీ సంగతి సోదాహరణంగా రాయాలి. * పరీక్షలు కాగానే ప్రాచీన భారతీయ సంస్కృతీ పునరుద్ధరణకు కంకణం కట్టుకోవాలి. * నా మేధస్సు ఎప్పుడూ భవిష్యత్తు లోకి పాతిక సంవత్సరాలు లోతుగా చొచ్చుకుని పోతూ ఉంటుంది. నాలాటి వాళ్లు వర్తమానంలో అపార్థాలకు గురవుతారు. ఆర్కిమెడిస్ పైథాగరస్ సిద్ధాంతాన్ని కనిపెట్టినప్పుడూ ఇలాగే వెక్కిరించారు. *పొద్దున్న తలంటి పోసుకుని తల తుడుచుకుని, దువ్వుకోకుండా అలాగే అద్దంలో చూసుకుంటే మొహంలో కొంచెంగా ఐన్‌స్టీన్ పోలికలు కనిపించాయి.

రాంబాబు ఆశయాలు: * శ్రీనాథుడు, పోతనాదుల కోవలో ప్రౌఢకవిని కావాలని కంకణం కట్టుకున్నాను. * ఫిలిం సొసైటీలో చేరిపోయి, తర్వాత ఏ డైరెక్టరు దగ్గరో అసిస్టెంటుగా చేరిపోయి, తర్వాత నేనే ఒక ఎక్స్‌పెరిమెంటల్ ఆర్ట్ ఫిలిం తీస్తా * సితారు కచేరీకి వెళ్లాను. బియ్యే కాగానే సితార్ నేర్చుకుని అమెరికా వాళ్లని వుర్రూత లూగించేయాలని తీర్మానించు కున్నాను. * క్రికెట్ ఆట చూడడానికి వెళ్లాను. క్రికెట్ నేర్చుకుని ఎప్పటికైనా పటౌడీని ఓడించాలని ప్రతిజ్ఞ పట్టాను. * జైలు కెళ్లి భారత స్వాతంత్రోద్యమ చరిత్రను మా ఫ్రెండుకి లేఖల రూపంలో వెయ్యి పేజీల ఉద్గ్రంథంగా రాయాలి. (అసలు మనకు జైలులో ‘ఏ’ క్లాసు ఇస్తారో లేదో కనుక్కోవాలి. అది ఇవ్వకపోతే ఉండగ. జైల్లో టైము వేస్టు)

రాంబాబు అమాయకత్వం: *కాలేజీలో ఫంక్షన్ జరిగింది. నేను మైకులో పాడాను. పాడుతున్నంతసేపూ జనం చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఈలలు కూడా కొట్టారు. పాపం సారథికి పాటంతా అయింతరువాత గానీ చప్పట్లు కొట్టలేదు. ఫీలయి వుంటాడు. * శాంతారాం కొత్త పిక్చరొచ్చిందని వెళితే ఒకావిడ తామర పువ్వులో నుంచుని పువ్వులు జల్లుతోంది. ఈ పిక్చరిదివరకే చూశానని వచ్చేశాను. (శాంతారాం చిత్ర నిర్మాణ సంస్థ ఎంబ్లమ్ ఆది). *”గోల్డ్‌ రష్” చూశాను. చాప్లిన్ బాగానే చేశాడు. కానీ రాజ్‌ కపూర్‌ను యిమిటేట్ చేయడం నాకు నచ్చలేదు. అది పాత సినిమా అని చెప్పారు. అంత పాతకాలంలో కూడా ఆయన రాజ్ కపూర్‌ను యిమిటేట్ చేయడం ఇంకా ఘోరం.

రాంబాబు తర్కం: *ఐన్‌స్టీన్ థియరీ ఏమిటి? ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కణ్ణుంచి ఇక్కడకు అంతే దూరం. ఇది తప్పని రుజువు చేయడానికి ఒక్క నిమిషం పట్టదు. 30వ తారీకుకి 1వ తారీకుకి తేడా ఒక్కరోజే. కానీ ఒకటో తారీకు 30వ తారీకుకి తేడా..? * బస్సు కనిపెట్టింది కొలంబస్సని నా నమ్మకం. చరిత్రకారులు తనకు అన్యాయం చేస్తారని వూహించే కొలంబస్సు ఆ వాహనానికి తన పేరులో సగం పీకి బస్సు అని నామకరణం వేసి ఉంటాడు. * ఆకాల వర్షాల వల్ల పంటలు పాడైపోతున్నాయని ఏడుస్తూ కూచోకపోతే శుభ్రంగా శీతాకాలంలో దుక్కి దున్ని విత్తనాలు జల్లుకుంటే వర్షాకాలం నాటికి పంట చేతికొస్తుందిగా! * మహామహా డబ్భయి ఏళ్ల ముసలాళ్లే బస్సులో ఆడపిల్లల పక్కన కూచుంటే తప్పు లేకుంటే, యువకులు కూచుంటే తప్పా?

* బస్సులో వస్తూ ఉంటే ఓ అమ్మాయి స్కాండ్రల్ అని తిట్టింది. ఆమెకు నా భుజం రాసుకుందిట. నాకు తెలీదు. అమ్మాయే చెప్పింది. అస్పృశ్యతా నివారణ చట్టం క్రింద ఆమెపై కేసు పెట్టాలని వాదించాను. * అసలు నా సొంత ఆత్మసాక్షే నన్ను సమర్థించక పోతే భాస్కర్రావు ఆత్మ, సారథి ఆత్మ, బాబూరావు ఆత్మ సమర్థిస్తాయా? * “ఇప్పుడు నేను మహామహుణ్ణి కాను… నిజమే. కాని ఎప్పటికీ కాలేనని ఎలా చెప్పగలవు? మా తాతగారు ఎనభై యేళ్లు బతికాడు. ఇప్పుడు నాకు ఇరవయ్యేళ్లు. ఇంకో యాభై, అరవయ్యేళ్లకైనా మహామహుణ్ణి కాలేక పోతానా? యాభయేళ్లకైనా నేను మహావాగ్గేయకారుణ్ణి కాకపోతే యింకెందుకు వేస్టు?” అన్నాను.* “ఏమిటోరా… మాలాంటి ఇంటలెక్చువల్స్‌కి ఎంత సేపూ ఉన్నత విషయాలే తప్ప చిన్నచిన్న విషయాలు తెలియవు. గాంధీ గారికి చాప్లిన్ ఎవరో తెలీదుట” అన్నాను.

పత్రికల భాష – రాంబాబు (అను) వాదం: * Forest Minister :- ఆటవిక మంత్రి * Animal Husbandry Minister – పశుభర్తృత్వ శాఖ మంత్రి * Fisheries Minister – చేపల మంత్రి లేదా జాలరి మంత్రి * విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ – కృష్ణ మంజూష

అచ్చుతప్పులు: * మిథ్యాన్న పథకం (మధ్యాహ్న పథకం బదులు) * మదావహం (ముదావహం బదులు)

మేలప్రాపిజం – వినడానికి దగ్గరగా ఉండడంతో ఒక పదానికి బదులు మరొకటి ఉపయోగించడం వల్ల వచ్చే అ(న)ర్థాలు: * చిత్తశుద్ధితో పాటు ‘దేహశుద్ధి’ కూడా అవసరం. (దేహశుద్ధి అనేది తన్నడానికే ఉపయోగిస్తారు) * నా వ్యాసాలు చాలా ‘హాస్యాస్పదంగా’ ఉంటున్నాయని ఉత్తరాలు రావడం గర్వకారణంగా ఉంది. (హాస్యాస్పోరకంగా అని ఉండాలి) * మా ఎడిటర్ – తేనె పూసిన కత్తి. పయో’ధర’విషకుంభం (పయోముఖ అని ఉండాలి, పయోధరం అంటే వక్షోజం) * ‘సాంస్కృతికంగా’ కనిపించడం (కృతకంగా అనబోయి) * పోలీసులు ఆందోళనకారులను ‘నిర్మానుష్యంగా’ కొట్టారు. (అమానుషంగా అని భావం) * ఏకోన్ముఖంగా నవ్వడం. (నోటితో అని రాంబాబు భావం కాబోలు) * “నో సర్ అయాం స్టిల్ డిజప్పాయింటెడ్” ( నాట్ అపాయింటెడ్ ఎట్ అనబోయి) * “ఇటీజ్ నాట్ మై జాబ్ టు క్లియర్ డౌట్స్ ఆఫ్ ఎవ్విరి టామ్, డిక్ అండ్ హరీష్ (హారీ అనబోయి) అతను తప్పు రాస్తే హొ ఐయామ్ రెస్పాన్సిబుల్? అయాం అబ్సల్యూట్లీ ఇర్రెస్సాన్సిబుల్” (నాట్ రెస్పాన్సిబుల్ అనబోయి) అని గర్జించాను.

రాంబాబుకి ఇంగ్లీషుతో చిక్కులు: * సిగరెట్లు మానేద్దామని, ‘డోంట్ డ్రింక్ సిగరెట్స్’, అని ఓ కాగితం మీద రాసి జేబులో పెట్టుకుంటున్నాను. * పోస్టు గ్రాడ్యుయేట్లే అప్లయి చేయాలని ప్రకటన వచ్చింది. పోస్టు ద్వారా చదువుకున్న వాళ్లే గ్రాడ్యుయేట్లు అన్నట్లు వ్యవహరించడం అన్యాయం. * వార్త ఇవ్వడానికి వచ్చిన ఒకాయనతో ‘గివ్ మీ ఏ రింగ్ ఆన్ సెవెన్టీన్త్’ అని న్యూసెడిటరు గారు అనగా విన్నాను. ఇలా ఉంగరం అడగడం లంచగొండితనం కదాని వెళ్లి ఎడిటరు గారికి చెప్పా… ఫోన్ చేయమని చెప్పారని ఎడిటరు గారు వాదించారు. * ‘కపుల్ ఆఫ్ జర్నలిస్ట్స్’ అంటే జర్నలిస్టు దంపతులు అని అనువదించా .. తప్పుట!

* టీ షర్టు చూసి “ఈజిట్ ఫర్ జెంట్స్ ఆర్ లేడీస్?” అని షాపు వాడిని అడిగితే “దటీజ్ యూనీసెక్స్” అని చెప్పాడు వాడు. మగవాళ్లకా, ఆడవాళ్లకా అని అడుగుతుంటే సెక్సు ప్రసక్తి తీసుకురావడం అసభ్యం, అసందర్భం అని ఝాడించి వదిలి పెడదా మనుకున్నాను. * స్టార్‌డస్ట్, డెబోనీర్ లాంటి ఎడల్టరీ మేగజైన్స్ (ఎడల్ట్ మేగజైన్స్ అనబోయి).. * ఐవిల్ కవరప్ ఎవ్విరిథింగ్ (న్యూస్ కవర్ చేస్తానన్న భావంతో) * అసలు ఉన్న రిజర్వేషన్లతోనే చస్తుంటే కొందరు నాయకులు దేశీయ పరిశ్రమలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో తమకు రిజర్వేషన్లున్నా యంటున్నారు. కొందరు రిజర్వేషన్లపై రిజర్వేషన్లున్నా యంటున్నారు. * ఇంటికి దగ్గర్లో కాల్పులు జరుపుతున్నారు. ఆ హోరుతో నిన్న రాత్రంతా ఒకటే ‘సౌండ్’ స్లీప్.

* షాపు కెళితే సేల్‌మన్ ‘దీజ్ ఆర్ షర్టింగ్స్ అండ్ దీజ్ ఆర్ ఆల్ సూటింగ్స్’ అని చూపించ బోయాడు. “యూసీ… ఐ డోంట్ వేర్ సూట్స్ అండ్ కోట్స్, ఐ వేర్ ఓన్లీ షర్ట్స్ అండ్ పాంట్స్, సో ఐ డోంట్ వాంట్ ఎనీ సూటింగ్స్ ఆర్ కోటింగ్స్. షర్టింగ్స్ అండ్ పాంటింగ్స్ ఆర్ ఎనఫ్ ఫర్‌ మీ” అన్నాను. * ఇంకోడొచ్చి “డూ యూ వాంట్ ఎ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్?” అన్నాడు. “ఐ డోంట్ వాంట్ ఎ పెయిర్, వన్ ఈజ్ ఎనఫ్ ఫర్‌ మీ” అని చెప్పేశా! * పెయింటిస్టులు (పెయింటర్స్ అనబోయి)

రాంబాబు తెలుగు: * నిరాహార దీక్ష చేసినాయన గురించి రాస్తూ ‘..శల్యావశిష్టులై పోయారు’ అని రాసారు ఎడిటరు గారు. నేను వెళ్లి మొహం మీద అడిగేశాను. ఆయన ఎంత గొప్పవాడైనా కావచ్చు కానీ ఆయన్ని శల్యుడు, వశిష్టుడు మున్నగు పురాణ పురుషులతో పోల్చడం ఎంత మాత్రం బాగులేదు. పైగా అసందర్భం అని.

అవకతవక ప్రపంచం గురించి రాంబాబు: * ఓ హాలు కెళ్లి సిగరెట్టు ముట్టించడానికి అగ్గిపెట్టె లేక, ఫైర్ అని రాసి ఉన్న ఎర్ర బకెట్టు దగ్గర కెళ్లాను. చూస్తే ఇసుక. మేనేజరుని పిల్చి చివాట్లేశాను. ఇసుక అయితే ఇసుక అని రాయాలి గానీ నిప్పు అని రాయడం ఏమిటని. * నాయకులకు మాట నిలకడ లేదు. గాంధీ గారి పుట్టిన రోజుకి ఆయన అడుగుజాడల్లో నడవమంటారు. ఇందిరా గాంధీ పుట్టిన రోజుకి ఆవిడ అడుగుజాడల్లో నడవమంటారు. ఓ సారి బోసు అడుగు జాడలంటారు. * అసమర్థులకు ఉద్యోగం ఇవ్వకపోవడం అన్యాయం. వికలాంగులకు ఇచ్చినట్టే అసమర్థులకు సైతం కొంత కోటా ఉండాలి. * అచ్చమైన బుడబుక్కలవాడు వస్తే పదిపైసలైనా వేయకుండా తరిమేసి, స్టేజీ మీద ఫాన్సీ డ్రెస్ పోటీలో నకిలీ బుడబుక్కల వాడికి వెండికప్పు ప్రెజంటు చేయడం ద్వంద్వనీతి కాదా? * మీనాక్షి శేషాద్రి జోరు ఎక్కువగా ఉంది కదాని సినిమా కెళితే మీనాక్షితో డాన్సులు, డ్యూయెట్లు అన్నీ మిథున్ చక్రవర్తే చేశాడు. మరి శేషాద్రి ఏ వేషం వేశాడో తెలియలేదు.

రాంబాబుకి వచ్చిన అద్భుతమైన ఐడియాలు: * ఇదివరకు పదిపైసలు అడుక్కునే వాళ్లు ఇప్పుడు అర్ధరూపాయి, రూపాయిలు అడుక్కుంటున్నారు. రూపాయి విలువ అంతగా దిగజారి పోయిందన్నమాట. * పాశ్చాత్య దేశాలలో సైతం బిచ్చగాళ్లున్నారు. అయితే వాళ్లు ఇండియాలో మాదిరిగా చింకిపాతలు ధరించి, బొచ్చెలు చేతబట్టుకుని అడుక్కోరు. * ముష్టివాళ్ల నుంచి కుష్టు వాళ్లను వేరు చేసి, మిగిలిన వాళ్లందరికీ ‘ఆదరణ’ పథకం కింద యూనిఫాం సూట్లు, బూట్లు, హ్యాట్లు సరఫరా చేయాలి. నీటుగా క్షవరం చేయించి, కొంచెం మేకప్ చేయించి ట్రిమ్ముగా తయారుచేయాలి. తర్వాత సెంటు పూసి ఏర్‌పోర్ట్- హైటెక్ సిటీ రూటులోనూ, క్లింటన్ మున్నగు విదేశీ ప్రముఖులు వెళ్లే ఇతర రూట్ల లోను అడుక్కోడానికి అనుమతించాలి. ఇంగ్లీషులో అడుక్కోడానికి వీలుగా వాళ్లకి ఒక క్రాష్‌ కోర్సు నిర్వహించాలి. * ప్రస్తుతం కొందరు భిక్షకులు గాంధీ వేషంలో జనాన్ని ఆకర్షిస్తున్న దృష్ట్యా, ఇతర జాతీయ నాయకుల వేషాలను, ప్రస్తుత రాష్ట్ర నాయకుల వేషాలను సైతం అనుమతించే విషయం పరిశీలించవలసి ఉంది.

రాంబాబు ఉవాచలు: * అసలు దుఃఖం వల్లనే మానవులకు ఏడ్పు వస్తుంది. ఏడ్పు వల్లనే దుఃఖనివృత్తి కలుగుతుంది. ఏడ్చే వాళ్ళను ఏడవనీ అనే పాత సినిమా పాట ఇది వరకు అప్పుడప్పుడు రేడియోలో వినిపిస్తూ ఉండేది. అది రాసిన కవి భావమేమిటో అప్పట్లో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. * నిజానికి ఏడుపంత సహజమైన, తేలికైన పని మరొకటి లేదు. మనిషి భూమ్మీద పడగానే ఎటువంటి ప్రోద్బలం లేకుండా అప్రయత్నంగా చేసే పని ఏడవడమే కదా! అందుచేత ఇక నుంచి తీరికైనప్పుడు శాయశక్తులా ఏడవాలని నిర్ణయించుకున్నాను. చెప్పొచ్చేదేమిటంటే ఏడవడానికి నేను పడిన అవస్థ తలుచుకుంటే చచ్చే నవ్వొస్తోంది.

*మూడు కోతుల బొమ్మ నీతి నేర్పుతుందంటే నేను నమ్మను. ఆ లెక్కన ప్రపంచంలోని గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, మూగవాళ్లు అంతా నీతిమంతులే అయ్యుండాలి. అసలు దేవుడు కళ్లు, చెవులు, నోరు ఇచ్చింది దేనికి? అన్నీ చూసి, అన్నీ విని ఏది మంచో, ఏది చెడో విచక్షించుకుని, మంచిని మాట్లాడాలి. వాటిని మూసుకుంటే మంచిని కూడా చూడలేము, వినలేము, మాట్లాడలేము. * కృతి యొక్క టెక్నిక్ తెలిసిపోయింది. ఇందులో పల్లవి, అనుపల్లవి చెరోలైను, చరణం మూడు, నాలుగు లైన్లు వుంటాయి. తిప్పి తిప్పికొడితే అంతా కలిసి ఐదారు లైన్లు. ఆ తర్వాత పాడేదంతా స్వరకల్పనే. దాని సంగతి కచేరీ చేసే గాయకుడు చూసుకుంటాడు. మనకేం సంబంధం లేదు. మినీ కవిత లాగ ఓ ఐదారు లైన్లు రాసి పడేస్తే మన పని తీరిపోతుంది. ఇన్నాళ్లూ మినీ కవితలతో టైము వేస్టు చేశాను. శుభ్రంగా కృతులు రాసి వుంటే బోలెడు కీర్తి ప్రతిష్ఠలు వచ్చి వుండేవి.

– ఎమ్బీయస్ ప్రసాద్

3 Replies to “ఎమ్బీయస్‍: రాంబాబు డైరీ”

  1. రాంబాబు ఫస్ట్ పర్సన్ లో చెబుతున్న మాటల్లో అతను అవివేకి అని చెప్పడానికి రచయిత కష్టపడి ఉంటారు కానీ మా ప్రసాద్ రచనలు ఒక్కటి చదివితే చాలు ఆయన ఏ పార్టీకి బాటయింగ్ చేస్తారో తెలుసుకోవచ్చు.

Comments are closed.