మోహన : సేద తీరాలంటే సంగీతం తప్పనిసరి

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement సేద తీరాలంటే సంగీతం తప్పనిసరి ప్రతి మనిషి మానసికంగా విశ్రాంతి తీసుకోగలగాలి. తీసుకున్నపుడే రీచార్జి అవుతాడు. మళ్లీ శక్తి పుంజుకుంటాడు. సంగీతానికి గల శక్తి…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

సేద తీరాలంటే సంగీతం తప్పనిసరి

ప్రతి మనిషి మానసికంగా విశ్రాంతి తీసుకోగలగాలి. తీసుకున్నపుడే రీచార్జి అవుతాడు. మళ్లీ శక్తి పుంజుకుంటాడు. సంగీతానికి గల శక్తి గురించి నేను యిప్పడు కొత్తగా చెప్పవలసినది ఏమీ లేదు. మ్యూజిక్‌ థెరపీ పేర యిప్పుడు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. శారీరక రుగ్మతల మాట ఎలా వున్నా, మానసిక రుగ్మతలను నయం చేయగల శక్తి సంగీతానికి వుందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఒత్తిళ్లమధ్య పనిచేసే వారు పిచ్చెక్కి పోకుండా పాటలు కాపాడతాయి.

నాకున్న అబ్సెషన్స్‌లో సంగీతం ఒకటి (తక్కినవి క్రికెట్‌, బ్రిడ్జ్‌, హ్యూమర్‌, కాస్మాలజీ గురించి చదవడం.. వంటివి) చిన్నప్పణ్నుంచీ ఆటా, పాటా యిష్టం కాబట్టే బాలానందంలో చేర్చారు. రేడియో అన్నయ్య గారి ఆధ్వర్యంలో పాటలు పాడాను, నాటకాలు వేశాను, మహామహుల దర్శకత్వంలో సినిమాలు వేశాను. లలితకళలు నా జీవితంలో ఓ భాగం అయిపోయాయి. కానీ అదంతా బాల్యం. మా నాన్నగారు మద్రాసు విడిచి గుంటూరు వచ్చేయడంతో నా జీవితం నుండి సినిమాలు దూరం అయిపోయాయి. చదువులో పడిపోయాను. రేడియోకి మాత్రం దూరం కాలేదు. రేడియో సిలోన్‌, బినాకా గీత్‌ మాలా, అమీన్‌ సయానీ యిలాటి యిష్టాలు నాతో పెరుగుతూనే వున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ చదివే రోజుల్లో మళ్లీ సంగీతాభిలాష పైకి తన్నుకు వచ్చింది. ఓ రోజు  సికింద్రాబాద్‌లో 'లిడోస్‌' అనే రెస్టారెంట్‌కి వెళ్లి కూచుంటే అక్కడున్న బ్యాండ్‌వాళ్లు గిటార్‌, డ్రమ్స్‌ అవీ వాయించి పాటలు పాడుతున్నారు. నాకు చాలా చాలా బాగుందనిపించిది. చిన్నప్పటి నుండి గిటారు ఎప్పుడైనా నేర్చుకుందామా అనే ఆసక్తి వుండేది. ఆ గిటారు వాయించే అతని దగ్గరకి వెళ్లి అడిగాను నాకు నేర్పుతావా అని. రైట్‌ అన్నాడు. అతను రిచర్డ్‌ జ్ఞానకన్‌్‌ !  ఈనాటికీ అతి సన్నిహితుడైన స్నేహితుడు !

మా పిన్ని కొడుకు – రామలింగమూర్తి,  బుల్లి తమ్ముడు అనేవాళ్లం, వాడూ నేను కవల పిల్లల్లా కలిసి తిరుగుతూండేవాళ్లం. ఎక్కడకి పోయినా కలిసివుండేవాళ్లం. వాడూ నాతో పాటు గిటారు పాఠాలకు వచ్చాడు. మా యిద్దరికీ ఒక్కొక్క పాఠానికి పదిరూపాయలన్నమాట. ఆ ఒప్పందంతో రిచర్డ్‌ నేర్పించడం మొదలుపెట్టాడు. ఇవ్వాళ్టిదాకా నాకు ఇంట్లో గిటారు వుంది. ప్రవేశం తక్కువ, పరిచయం ఎక్కువ అనుకోవచ్చు. ఇప్పుడు ప్రదర్శనలు యివ్వలేను కానీ ఏదో నా మనసు నేను ఆహ్లాద పరచుకునేటంత మేరకు వాయించుకోగలను. అన్నిటికన్నా ముఖ్యం – మిగతావాళ్లు విని బాధపడి ఆపేయమని బతిమాలే పరిస్థితి రాకుండా ఆ లెవెల్‌ దాకా వచ్చాను. కాని ఆ నేర్చుకున్న కాస్త సంగీతం వలన, ఆ వాయిద్యం నుండి వెలువడే సంగీతం వలన యితరుల సంగీతాన్ని ఆస్వాదించే శక్తి పెరిగింది. ఇది నా దృష్టిలో పెద్ద 'ఎసెట్‌', మహద్భాగ్యం.

xxxxxx

ఆ రోజుల్లోనే చాలామంది మంచి స్నేహితులు ఏర్పడ్డారు. అందరిలో ఏదో ఒకరకమైన టాలెంట్‌ వుండేది. యాక్టింగ్‌, మిమిక్రీ, పాటలు పాడగలగడం – ఏదో ఒకటి. అందరం కలిసి అప్సర అనే హోటల్లో విధిగా సాయంత్రం ఓ గంటసేపు కలిసి ఒక కప్పు కాఫీ తాగి కబుర్లు చెప్పుకుని వెళ్లిపోయేవాళ్లం. అందరం కలిసి ఒక సాంస్కృతిక సంస్థ పెడితే ఎలా వుంటుందాన్న ఆలోచన వచ్చింది. ''సాజ్‌ ఔర్‌ ఆవాజ్‌'' అని చిన్న గ్రూపు ఏర్పరచాం.  రవీంద్రభారతిలో ఒక ప్రోగాం కూడా యిచ్చాం. ఒక చిన్న యింగ్లీష్‌ డ్రామా, ''సౌండ్‌ ఆఫ్‌  తెలుగు'' అని ఓ స్కిట్‌ వేశాం.  శ్రీకాకుళంలోను, నెల్లూరులోను, హైద్రాబాద్‌లోను, కాకినాడలోను తెలుగు ఒకలా మాట్లాడరు. కాని తెలుగు తెలుగే. ప్రదేశం నుంచి ప్రదేశానికి అది ఎంత విచిత్రంగా మారుతుంటుంది, వింటూంటే ఎంత  శ్రావ్యంగా  ఉంటుంది,  అని చెప్పి చూపించాం. దాని తర్వాతేదో పాటలు, చిన్న మ్యాజిక్‌ షో. అటువంటివన్ని కలిపి ఒక  ప్రోగ్రాం వేశాం. అదే బందర్‌లో కూడా వెళ్లి సరదాగా ఒకసారి వేసాం.

''సాజ్‌ ఔర్‌ ఆవాజ్‌'' కార్యక్రమం వలన నాకు జరిగిన మేలేమిటంటే బాపుగారితో పునః పరిచయం. మా సంస్థకు ఓ లోగో వేసి పెట్టండి అని కోరితే వెంటనే వేసి పెట్టారు (గిటార్‌ వాయిస్తున్న మెక్సికన్‌). మా కుటుంబాల మధ్య పరిచయం వున్నా అప్పట్లో నేను ఓ సాధారణ స్టూడెంటునే కదా. అడిగితే 'కుదరదు, సారీ' అని సులభంగా అనేయవచ్చు. అయినా వెంటనే వేసి పెట్టారు. అదీ ఆయన గొప్పతనం. కుటుంబపరిచయం ఏమిటంటే మా కుటుంబమూ, వాళ్ల కుటుంబమూ మద్రాసులోనే మైలాపూర్‌లోనే వుండేది. మా అక్క బాపుగారికి క్లాస్‌మేట్‌. ఆవిడ పేరు కల్పకం. మంచి డాన్సరు. మా యింటిపేరు కందా కాబట్టి బాపు గారు టీజ్‌ చేస్తూ పక్క ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ''ఒరే కంద అంటే దురద కదరా'' అన్నారట. ''నేను అలా అనగానే నాకేసి చురచురా చూసిన చూపు నేను యిప్పటికీ మర్చిపోలేదండి'' అంటారు బాపుగారు. మా అక్క ఢిల్లీలోనే వుంటుంది. వాళ్లబ్బాయే సిపిఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం యేచూరి. 

xxxxxx

బాపుగారు ఆనాడు నా స్టూడెంట్‌ రోజుల్లోనే నా పట్ల ఆదరం చూపారు. ఈనాడు ఈ పుస్తకానికి బొమ్మలు వేసి పెడుతున్నారు. పెరిగి పెద్దవాణ్నవుతున్నకొద్దీ బాపుగారితో స్నేహం బాగా కుదిరింది. వారితో బాటు ముళ్లపూడి రమణ గారితో కూడా. రమణగారు నేనంటే ఎంత అభిమానం పెంచుకున్నారంటే నాపై కంద (మా యింటిపేరు స్ఫురించేట్లు) పద్యాలు రాసేటంత! 'మోహన కందాలు' అనే మకుటంతో ఆయన రాసిన 16 పద్యాలున్నాయి. మచ్చుకు రెండు మూడు..!

మందారమాల మాటున
కందాలతో బాపురమణ కల్పించినదీ
'కందారమాల' మైత్రీ
బంధమ్ముగ నందుకొనుము కందామోహన్‌!

హాయిగ జోకులతో హహ
హా! యని నవ్వించి నవ్వు హాస విపంచీ!
భాయీ! మోహన కందా!
నా యీ కందాలు చదివి నవ్వాలి సుమా!

ఉప్పేల సముద్రానికి
మెప్పేలా రంభ తొడకు మేనక మెడకున్‌
చెప్పేల? త్యాగి వలె మే
కప్పేలా మినిస్టరుకు కందామోహన్‌!

ఇవన్నీ రాయడంతో బాటు ఈ పద్యాల పుస్తకం వేసినట్టు, దానికి బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ ముళ్లపూడి వేంకట రమణాచార్యులు అనే పేద్ద రచయిత చేత ముందుమాట రాయించినట్టు డబుల్‌ రోల్‌ వేస్తూ ఓ ప్రయోగం చేశారు రమణగారు. ఆ పెద్దాయన ఈ వెంకటరమణను మెచ్చుకుంటున్నట్టు నటిస్తూ విషం ఎలా కక్కుతారో ''ఆశీః'' (దీనికి రెండు అర్థాలున్నాయి. దీవెన అని ఒకటి, పాము కోఱ అని మరొకటి) అనే ప్యారడీ ముందుమాట రాశారు. దానిలో ఆ 'పెద్దాయన' యీయన్ని వెక్కిరిస్తాడు – 'కొన్ని కందములందు మోహనకందా యనియు, మఱికొన్నిట కందామోహన యనియు, మరియు గొన్నిట వట్టి కందా యనియు, కేవలము మోహన యనియు – ఛందో బందోబస్తుల వల్లగాబోలు – ఉంచుటచే – ఈ కృతిభర్త ఇంటిపేరు మోహనవారో, కందావారో నిర్ధారణగా తెలియకున్నది! అయిననూ ఈతడు రచయితకు ప్రియమిత్రుడుగా భావించదగును..' అని. 

1975లో నేను కమ్మర్షియల్‌ టాక్సెస్‌ డిప్యూటీ కమిషనర్‌గా వుండగా వాళ్ల ''ముత్యాలముగ్గు'' సినిమా వచ్చింది. వచ్చిన నాలుగో రోజునే మా ఆవిడ చూద్దాం పదండి అంది. ''కాస్త రష్‌ తగ్గనీ వెళదాం లే'' అన్నాను. ''అబ్బ, వాళ్ల సినిమాలు ఆడవు, వచ్చేవారానికి వుండకపోవచ్చు. ఇవాళే వెళదాం'' అని పట్టుబట్టింది.

నేను ఆ విషయం సరదాగా బాపుగారికి చెప్పాను. ఆయన భలేగా ఎంజాయ్‌ చేశారు. దాన్నే తనమీద జోక్‌గా మలుచుకున్నారు. మా ఆవిడ పేరు రాయకుండా 'ఒక ఉత్త మా యిల్లాలు..' యిలా అంది అంటూ రాసుకున్నారు. 

xxxxxx

ఇలా వాళ్లమీద వాళ్లే పబ్లిగ్గా జోకులేసుకోగలిగిన మహానుభావులను వేళ్లమీద లెక్కించవచ్చు. షేక్‌స్పియర్‌ చదవని వాళ్ల గురించి మనం జాలి పడి ప్రార్థనలు చేయాలని సామెత. బాపు-రమణలను తెలియని తెలుగువాళ్ల గురించి యింకా బోల్డు జాలిపడాలి. ఈ జ్ఞాపకాలు యిలా రాద్దామని ఐడియా రాగానే రమణగారు నన్ను ప్రోత్సహించి రాయించారు. పుస్తక ప్రచురణ మొదలు కాకుండానే ఆయన వెళ్లిపోవడం నా దురదృష్టం. బాపు-రమణలనే మహానుభావుల గురించి ఎంత రాసినా తక్కువే.

నేను బడే గులాం ఆలీ ఖాన్‌ వంటి హిందూస్తానీ శాస్త్రీయ కళాకారులను కూడా అభిమానిస్తాను. హిందీ సినిమా పాటలంటే చెవి కోసుకుంటాను. ఆ పాటలను దేశమంతా పాప్యులర్‌ చేసిన ఘనత మాత్రం రేడియో సిలోన్‌ దే. వివిధ భారతి అవీ తర్వాత వచ్చాయి. రేడియో సిలోన్‌లో రకరకాల కార్యక్రమాల ద్వారా పాటలు వినిపించేవారు. ఏక్‌ ఔర్‌ అనేక్‌ అనీ ఏకీ ఫిల్మ్‌ కే గీత్‌ అనీ, బదల్‌తే హుయే సాథీ అనీ, ఏక్‌ గీత్‌ ఔర్‌ దో పహలూ అని.. రకరకాల కాంబినేషన్లు. ఎన్ని కార్యక్రమాలున్నా బినాకా గీత్‌ మాలా అనే కౌంట్‌డౌన్‌ ప్రోగ్రాం దే అగ్రస్థానం. బుధవారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఎన్ని పనులున్నా మానుకుని అమీన్‌ సయానీ గొంతుకోసం కాచుకుని కూర్చునేవాళ్లం. ఇక సర్‌తాజ్‌ గీతాలు వచ్చే ఆఖరి పావుగంటా టెన్షన్‌తో కొట్టుమిట్టు లాడిపోయేవాళ్లం.

ఈ క్రమంలో ఎందరో అభిమాన గాయకులు ఏర్పడ్డారు. రఫీ, కిశోర్‌, మన్నా దే, ముకేష్‌, షంషాద్‌ బేగం, లతా, ఆశా భోంస్లే యిలా ఎందరో…! వీరందరిలో ఎవరిష్టం అంటే కిశోర్‌ కుమార్‌ అనే చెప్తాను. ''మిస్టర్‌ ఎక్స్‌ ఇన్‌ బాంబే'' సినిమాలో 'మేరే మెహబూబ్‌ కయామత్‌ హోగీ' అనే పాటలో అతని వాయిస్‌ అద్భుతం. అలాగే తన స్వీయ సంగీతదర్శకత్వంలో తనే నటిస్తూ పాడిన ''ఝుమ్రూ''లోని పాట 'ఠండీ హవా ఏ చాందినీ సుహానీ' నా అభిమాన గీతం. అది గిటారు మీద వాయించడానికి అనువుగా వుండడం ఓ కారణం కావచ్చు. అతని బెస్ట్‌ సాంగ్స్‌లో ఒకటి  – 'మేరే భీగీ భీగీసీ పల్కోం మే..' అనే ''అనామికా''లోని పాట. 

xxxxxx

నిజానికి భారతదేశంలో యింత వైవిధ్యభరితమైన కళారూపాలు వుండడం మన అదృష్టం. ఇవి అనుభవించి తరించడానికి మనమేమీ కష్టపడనక్కరలేదు. బాపు బొమ్మ చూసి ముచ్చటపడడానికి మనం పెద్ద చిత్రకారుడవ్వాలా? అబ్బే కళ్లుంటే చాలు, స్పందించే మనసుంటే చాలు. అలాగే రేడియోనో, ఐ ప్యాడో పెట్టుకుంటే చాలు, మహానుభావులెందరో వచ్చి మనల్ని అలరించి వెళతారు. టెక్నాలజీలో వున్న సౌకర్యం అది. వాళ్లు మన కష్టాలను, బాధలను అలా అలవోకగా తుడిచేస్తారు. ఇంతటి సౌలభ్యం అందుబాటులో వుండగా దాన్ని వదిలేసి బాధపడుతూ కూర్చుంటాం ఏం చేయగలం? వాళ్లని చూసి 'ప్చ్‌' అనుకోవడం తప్ప!

కొసమెరుపు – మా నాన్నగారికి సాహిత్యం చాలా యిష్టం కానీ అదేమిటో సంగీతం అంటే పడేది కాదు. ఆయన చమత్కరించేవారు – ''రేడియో వున్న సుఖం, అది విన్నపుడు కాదు, ఆపేసినప్పుడు తెలుస్తుంది. హమ్మయ్య రొద ఆగింది కదానిపిస్తుంది.'' అనేవారు.

ఓ సారి మా స్నేహితుడు మా యింటికి వచ్చాడు. మేమంతా పై గదిలో వుండి సంగీతసాధన చేస్తున్నాం. కాస్త గోలగోలగానే వున్నట్టుంది. వాడు కింద ఆయన ఆఫీసుకి వెళ్లి ''మోహన్‌ యింట్లో వున్నాడా?'' అని అడిగాడు. ''పైన ఫ్రెండ్స్‌తో వున్నాడోయ్‌, దాన్ని సంగీతమో ఏదో అంటారట. వెళ్లు వెళ్లు, నువ్వూ విందువుగాని..'' అన్నారు.

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by
kinige.com
please click here for audio version