సమ్మర్ సీజన్ కు పీక్ కు చేరుకుంటోంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సినిమా జనం కిందా మీదా పడుతున్నాయి. మే నెల ప్రారంభమైన 1 వ తేదీనే మూడు నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. కమల్ ఉత్తమ విలన్ ఆ రోజుకు రుమాలు వేసేసుకుంది. ఇక మంచులక్ష్మి తన దొంగాటను ఆ రోజే ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.
ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకున్న గంగను ఎలాగైనా ఆ రోజే ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు. క్రిష్-రామోజీరావు కలిసి నిర్మించిన దాగుడుమూతల దండాకోర్ కూడా అదే రోజు ప్రేక్షకులను పలకరించబోతోంది.
ప్రస్తుతానికి థియేటర్లు పెద్ద హడావుడిగా ఏమీలేవు. సత్యమూర్తి, ఓకె బంగారం, దోచేయ్ సినిమాలు అలా అలా వున్నాయి. అందువల్ల ఇంకా చాలా థియేటర్లు అవైలబుల్ గానే వున్నాయి. అందువల్ల ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా ఈ సమయంలోనే రెడీ అవుతున్నాయి.
ఇదిలా వుంటే లయన్ విడుదలవుతుంది అని భావిస్తున్న 7 వ తేదీని మాత్రం సోలోగా వుండేటట్లే కనిపిస్తోంది. ఆ రోజు విడుదలవుతుంది అనుకున్న కిక్ 2 మరో వారం వెనక్కు వెళ్లింది. 15న విడుదలై, పండుగ చేస్కోతో ఢీ కొనడానికి రెడీ అవుతోంది. అసలే..పేరే లయన్..దాంతో ఎందుకు అనుకున్నారో ఏమో, 7 న మాత్రం ఇప్పటి వరకు మరే సినిమా డేట్ ప్రకటించలేదు. హడావుడిగా రెడీ అవుతున్న లయన్ 7న వచ్చేస్తే ఓకె. లేక ఏ చిన్న సమస్య వచ్చి వాయిదా పడినా, ఆ రోజు ఖాళీగా వుండిపోయినా ఆశ్చర్యం లేదు.