ఎనుబోతులు ఢీకొంటున్నపుడు లేగదూడలు మధ్యలో దూరకూడదన్నది నానుడి. పెద్ద సినిమాలు వస్తున్నపుడు చిన్న సినిమాలు దారిచ్చేయాల్సిందే. తప్పదు. లేదూ అంటే వాటి జోరులో ఇవి కనిపించవు. పెద్ద సినిమాల టికెట్ లు దొరకనపుడు చిన్న సినిమాకు వస్తారులే అనుకునే రోజులు మారిపోయాయి.
ఇప్పుడు ఉన్న థియేటర్లు అన్నీ పెద్ద సినిమాలతో నిండిపోతున్నాయి. రిటర్న్ కలెక్షన్ అన్న పదం ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. వెయ్యి థియేటర్లు వంతును రెండు సినిమాలు సెట్ అయిపోతే, ఇక వందో, రెండు వందలో థియేటర్లు దొరికిన సినిమా పరిస్థితి ఏమిటి?
కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా పరిస్థితి ఇదే. టీవీ పెడితే ఆ సినిమా పబ్లిసిటీ కనిపిస్తోంది. కానీ సినిమా ఎక్కడుందో మాత్రం అంతగా తెలియడం లేదు. అసలు ఆ సినిమా ఎలా వుందో కనీసం టాక్ కూడా తెలియకపోవడం విశేషం. భారీ చిత్రాల సంక్రాతి జాతరలో పాపం, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య తప్పిపోయినట్లు కనిపిస్తోంది.
టీవీలో మాత్రం నారాయణ మూర్తి, జయసుధ ఈ సినిమా గురించి యథాశక్తి చెప్పిందే చెబుతూ తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. బహుశా తొలి వారం తరువాత థియేటర్లు ఖాళీ అయితే అప్పుడు వెంకట్రామయ్య కాస్త కనిపించి, ప్రేక్షకులను రమ్మని పిలుస్తాడేమో చూడాలి.