ఓ హీరోయిన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమె పేరు నీతూ అగర్వాల్. ‘ప్రేమ ప్రయాణం’ అనే సినిమాలో నటించింది. ఎర్ర చందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో గత కొన్నాళ్ళుగా నీతూ అగర్వాల్ సహజీవనం చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.
మస్తాన్ వలీకి తెలుగు సినీ పరిశ్రమలో పలువురితో సన్నిహిత సంబంధాలున్నాయట. పలు సినిమాలకు ఫైనాన్స్ చేయడంతోపాటు, ఓ సినిమాకి నిర్మాతగానూ మస్తాన్ వలీ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నీతూ అగర్వాల్‌తో పరిచయం పెంచుకున్న మస్తాన్ వలీ, ఆమెతో కలిసి కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్నాడట. ప్రస్తుతం మస్తాన్ వలీ పోలీసుల అదుపులో వున్నాడు.
కర్నూలు జిల్లాలో మస్తాన్ వలీతోపాటు, నీతూ అగర్వాల్‌పైనా కేసు నమోదైంది. నీతూని అరెస్ట్ చేసేందుకు ఓ పోలీసు బృందం హైద్రాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ‘సెర్చ్’ నిర్వహిస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె ఆచూకీ దొరకలేదనీ, విచారణ కొనసాగుతోందని పోలీసులు అంటున్నారు. ఇప్పటిదాకా టాలీవుడ్‌ని పలు డ్రగ్స్ కేసులు వేధించాయి. వ్యభిచారం కేసులు కూడా టాలీవుడ్‌ని వణికించాయి. ఆ మధ్య మద్దెలచెరువు సూరి హత్య నేపథ్యంలో ఫ్యాక్షన్ మాఫియాకూ టాలీవుడ్‌కి లింకులున్నాయన్న వాదనలు తెరపైకొచ్చాయి.
తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కీ సినీ పరిశ్రమకూ లింకులు వున్నాయన్న ఆరోపణలతో, తెలుగు సినీ పరిశ్రమలో కలకలం బయల్దేరింది. అయితే, ఆయా వ్యక్తులు చేసే తప్పుడు పనులకు తెలుగు సినీ పరిశ్రమకూ ఎలాంటి లింకూ లేదని పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.