హిట్ కోసం గోపీచంద్ చేయని ప్రయత్నం లేదు
సాయిధరమ్ తేజ్ సక్సెస్ కోసం ఎన్నాళ్ల నుంచో వెయిటింగ్
రాజ్ తరుణ్ అయితే ఒక్క విజయం కోసం అల్లాడిపోతున్నాడు
హిట్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న వీళ్ల జాతకాలన్నీ ఈ నెలలోనే తేలిపోతాయి. వీళ్ల లెక్కలన్నీ జులై బాక్సాఫీస్ తేల్చేయబోతోంది. అవును.. ఇలా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల సినిమాలన్నీ ఈ నెలలోనే థియేటర్లలోకి వస్తున్నాయి.
అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట సుప్రీమ్ తో సక్సెస్ చూశాడు తేజు. అంతే, ఆ తర్వాత విజయం అనేమాట అతడి నోటి నుంచి రాలేదు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్.. ఇలా వరుసపెట్టి ఫ్లాపులు ఇస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది తొలి అర్థభాగంలో ఇంటిలిజెంట్ రూపంలో ఇప్పటికే ఓ ఫ్లాప్ ఇచ్చిన ఈ హీరో, మలి అర్థభాగంలో తేజ్-ఐ లవ్ యు సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది ఈ సినిమా. ఇది హిట్ అయితే తేజ్ కెరీర్ కాస్త ఊపందుకుంటుంది. లేదంటే, అతడి మార్కెట్ మరింత పడిపోతుంది.
హీరో గోపీచంద్ ది కూడా ఆల్ మోస్ట్ ఇదే పరిస్థితి. పంతం సినిమా సక్సెస్ కోసం కోటిదేవుళ్లకు మొక్కుతున్నాడు ఈ హీరో. పేరుకు ఇది 25వ సినిమానే అయినప్పటికీ.. ఆ ఘనత కంటే విజయం అనే పిలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా ఈ హీరో చేసిన ఆక్సిజన్, గౌతమ్ నంద, సౌఖ్యం లాంటి సినిమాలేవీ గోపీచంద్ కు కలిసిరాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే 'పంతం'మీద ఉన్నాడు. ఈ మూవీ రేపే థియేటర్లలోకి వస్తోంది.
రాజ్ తరుణ్ ది మరో వ్యథ. మొన్నటివరకు మినిమం గ్యారెంటీ హీరోగా ఉండేవాడు. ఏది చేసినా ఓకే, ఆడేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉండేవాడు. అదే ఇతడి కొంపముంచింది. వరుసగా ఫ్లాపులు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో వచ్చిన రంగులరాట్నం, రాజుగాడు సినిమాలైతే డిజాస్టర్లయ్యాయి. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ లవర్ మూవీ పైనే పెట్టుకున్నాడు. జులై 20న రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా, కనీసం యావరేజ్ అనిపించుకుంటే మినిమం గ్యారెంటీ హీరో ఇమేజ్ ను నిలబెట్టుకోవచ్చనేది రాజ్ తరుణ్ ఆశ.
వీళ్లు మాత్రమే కాదు, జులైలో లెక్కలు తేలాల్సిన హీరోలు మరికొంతమంది ఉన్నారు. హీరో అయిపోదామంటూ వచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ 'విజేత'గా నిలుస్తాడా లేదా అనేది ఈ నెలలోనే తేలిపోతుంది. అటు భారీ బడ్జెట్ సినిమాలకు బెల్లంకొండ పనికొస్తాడా రాడా అనే విషయం కూడా ఈ నెలలోనే 'సాక్ష్యం'తో తెలిసిపోతుంది. ఇలా జులై అనేది హీరోలందరి జాతకాలు తేల్చే నెలగా మారిపోయింది.