హీరోయిన్ ప్రధాన చిత్రాలకి మార్కెట్ అంతగా లేకపోయినా అడపాదడపా అలాంటి ప్రయత్నాలయితే చేస్తుంటారు. తెలుగులో అనుష్క, తమిళనాట నయనతార మినహా హీరోయిన్ ప్రధాన చిత్రాలని సేఫ్‌గా తీరం దాటించే సత్తా వున్న వారు లేరు. మహానటి చిత్రానికి కీర్తి సురేష్ ప్రాణం పోసిన మాట నిజమే అయినా కానీ ఆ చిత్రంతో ఆమెకి బాక్సాఫీస్ పొటెన్షియల్ వచ్చేసిందనడానికి లేదు.
మహానటి సబ్జెక్ట్‌కి వున్న అప్పీల్ వల్ల అది అంతగా ఆదరణకి నోచుకుంది కానీ అది కీర్తి సురేష్ క్రెడిట్ కాదు. తమిళంలో కీర్తి తెలుగులో కంటే ఇంకా పెద్ద స్టార్ అయినా అక్కడ ఆమె హీరోయిన్ ప్రధాన చిత్రాలు చేయడం లేదు. తెలుగులో మాత్రం మహానటి లాంటి పాత్రలు వస్తేనే చేస్తానంటూ స్టార్ హీరోలతో అవకాశాలని కూడా ఆమె ఓకే చేయడంలేదు.
మహానటి తర్వాత ఒప్పుకున్న స్ట్రెయిట్ సినిమా కూడా హీరోయిన్ ప్రధాన చిత్రమే కావడం గమనార్హం. మరి నిజంగా కీర్తికి ఒక సినిమాని పుల్ చేసే సత్తా వుందా? ఆమె హీరోయిన్ అంటే పబ్లిక్ టికెట్ల కోసం బారులు తీరతారా? ఈ చిత్రం కనుక వర్కవుట్ అయితే ఇక కీర్తినే తెలుగు ఇండస్ట్రీకి మరో అనుష్క అవుతుంది.