కుష్బూ కూడా రెచ్చిపోయింది..!

సంసారాన్ని సజావుగా సాగించాలంటేనే బోలెడంత సహనం, ఓర్పు ఉండాలి. ఆడైనా మగైనా ఎవరికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అవి లేకపోయినా, అవి నశించిపోయినా ఆ కాపురంలో అలజడులు తప్పవు. ఇలాంటి అలజడులు పుట్టిన కుటుంబాలను…

సంసారాన్ని సజావుగా సాగించాలంటేనే బోలెడంత సహనం, ఓర్పు ఉండాలి. ఆడైనా మగైనా ఎవరికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. అవి లేకపోయినా, అవి నశించిపోయినా ఆ కాపురంలో అలజడులు తప్పవు. ఇలాంటి అలజడులు పుట్టిన కుటుంబాలను టీవీలకు ఎక్కించి టీఆర్పీలు పెంచుకుంటూ పండగ చేసుకుంటున్నారు. 

ఒక ఛానల్ అని కాదు.. ప్రతి దాంట్లోనూ ఇదే రచ్చే! రెండు మూడు పెళ్లిళ్లు, అక్రమ సంబంధాల ఫలితంగా విచ్ఛిన్నం అయిన కాపురాలను రచ్చకు ఈడుస్తున్నారు. ఇబ్బందుల్లో పడ్డ గ్రామీణ పేదరిక కుటుంబాలను ఇలాంటి కార్యక్రమాలకు రప్పించి.. వాళ్లకు సర్ధిచెప్పి, వారిని రాజీ చేసే మిష ను అడ్డం పెట్టుకుని.. ఈ కార్యక్రమలను ఎంటర్ టైన్ మెంట్ గా మార్చారు. వారి జీవితాల్లోని విషాదం, వారి జీవితాల్లో సంభవించిన పరిణామాలు.. వీళ్లందరికీ వినోదం!

ఇక ఈ పంచాయితీల్లో తీర్పులిస్తున్న నటీమణులు సంగతైతే చెప్పనక్కర్లేదు. వీళ్ల దగ్గరకు ఫిర్యాదులు తీసుకొచ్చే వారి సంగతెలా ఉన్నా, వీళ్లలో సహనం కనిపించకుండా పోతోంది!

ఈ పంచాయితీ పెద్దలు రెచ్చిపోతుంటారు! సర్ధి చెప్పడం కాదు దండించేస్తూ ఉంటారు! అరుస్తారు, తిడతారు.. తోస్తారు.. ఒకరని కాదు అందరూ అందరే! కళ్లు పెద్దవి చేస్తూ, గొంతు పెద్దది చేస్తూ.. రెచ్చిపోతారు. 

సుమలత, జీవిత, జయసుధ, గీత, ఊర్వశి, రోజా, వీళ్లందరూ తమ తమ షోల్లో పంచాయితీ పెద్దలుగా రెచ్చిపోతుంటారు. ఈ పరంపరలో చేరింది కుష్బూ. ఒక తమిళ ఛానల్ లో పంచాయితీ పెద్దగా వ్యవహరిస్తున్న కుష్బూ తీర్పు చెబుతూ చెబుతూ రెచ్చిపోయింది. తన వద్దకు ఫిర్యాదుతో వచ్చిన వారిలో ఒక వ్యక్తిపై కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి తీరు సరికాదంటూ మీదకు వెళ్లింది. దాదాపు కొట్టినంత పని చేసింది! 

మరి సర్ధిచెప్పడం వరకూ బాగానే ఉంటుంది, ఒకవైపు సంసారాలను నిలబెట్టే క్రమంలో వీళ్లు తమ సహనాన్ని కోల్పోతున్నారు. కొట్టినంతటి పనులు చేస్తున్నారు. మరి ఆ సీట్లో కూర్చుంటే ఇలా పూనకం వచ్చేస్తుందా.. లేక ఆ మాత్రం రచ్చ చేయకపోతే టీఆర్పీలు రావా?!