కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి ‘సుద్దులు’ చెబుతున్నారు. మీడియా గొంతు నొక్కడం సబబు కాదనీ, ఛానళ్ళ ప్రసారాలపై అభ్యంతరాలుంటే ప్రెస్ కౌన్సిల్ వుందనీ, దానికి ఫిర్యాదు చేయాల్సింది పోయి.. మీడియాపై ఉక్కుపాదం మోపడం అప్రజాస్వామికమని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
‘మాకు సలాం కొట్టాల్సిందే..’ అంటూ మీడియాని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వెంకయ్యనాయుడు ఖండిరచారు. ప్రజాస్వామ్యానికి వున్న మూల స్తంభాల్లో మీడియా కూడా ఒకటి. మీడియానీ, ప్రతిపక్షాల్నీ ప్రభుత్వంలో వున్నవారు గౌరవించాలనీ, ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య వారధిగా పనిచేసే మీడియాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడరాదని వెంకయ్యనాయుడు, కేసీఆర్‌కి ఉచిత సలహా ఇచ్చారు.
అయితే గత కొంతకాలంగా (సుమారు మూడు నెలలుగా) తెలంగాణలో రెండు న్యూస్ ఛానళ్ళు బ్యాన్‌కి గురయ్యాయి. ఈ విషయమై పార్లమెంటులోనూ చర్చ జరిగింది. ఛానళ్ళ నిలిపివేతతో తమకు సంబంధం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్నీ పార్లమెంటులో కేంద్రం ప్రస్తావించింది.. ఛానళ్ళను నిలిపేసిన ఎమ్ఎస్వోలపై చర్యలు తీసుకుంటామనీ ప్రకటించింది. కానీ ఇప్పటిదాకా తీసుకున్న చర్యలేమిటో కేంద్రం చెప్పగలిగే పరిస్థితి లేదు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు సుద్దులు ఎవరికి ఉపయోగపడ్తాయి.? మీడియా గగ్గోలు పెడ్తోంది. కేంద్రం కల్పించుకుని, రాష్ట్ర ప్రభుత్వమ్మీద ఒత్తిడి చేసి పరిస్థితిని సమీక్షించడం, సమస్యకు పరిష్కారాన్ని వెతకడం అత్యవసరం. ఈ విషయంలో ఇప్పటికైనా కేంద్రం కల్పించుకుంటందా.? వేచి చూడాల్సిందే.