Odela 2 Review: మూవీ రివ్యూ: ఓదెల 2

భక్తిరస చిత్రంలో కంటి ముందు కదలాడే దృశ్యం మనసుని తాకి భక్తి పారవశ్యం కలిగించకపోతే ఫలితమేముంటుంది?

టైటిల్: ఓదెల 2
రేటింగ్: 2.5/5
తారాగణం: తమన్నా, హెబ్బ పటేల్, వశిష్ట ఎన్ సింహ, మురళి శర్మ, శరత్ లోహితాశ్వ, శ్రీకాంత్ అయ్యంగర్, భూపల్, తదితరులు
కెమెరా: సౌందర రాజన్
ఎడిటర్: అవినాష్
సంగీతం: అజనీష్ లోకనాథ్
నిర్మాత: డి. మధు
దర్శకత్వం: అశోక్ తేజ
విడుదల: 17 ఏప్రిల్ 2025

2022లో ఆహాలో ఓటీటీ చిత్రంగా విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” కి ఇది సీక్వెల్. ఇందులో ప్రధాన ఆకర్షణ తమన్నా. సంపత్ నంది రచనలో వచ్చిన ఈ చిత్రానికి ప్రచారం బాగానే జరిగింది. తమన్నా ప్రత్యేకమైన లుక్ తో కనిపించడం, శ్రద్ధగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ చిత్రం తన ఉనికిని చాటుకుంది. ఇంతకీ విషయమేంటో చూద్దాం.

ఓదేలలో తిరుపతి (వశిష్ట ఎన్ సింహ) అనే ఒక కామాంధుడు కొత్తగా పెళ్లైన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు. ఒక రోజు అతని భార్య (హెబ్బ పటేల్) అతనిని తల నరికి చంపేసి జైలుకెళ్తుంది. ఊరి జనం పీడా పోయింది అనుకుంటారు. కానీ ఆ తిరుపతి ఆత్మకి శాంతి కలగకుండా ఉండాలని ఊరి పంతులు (శ్రీకాంత్ అయ్యంగర్) సలహాతో జనమంతా అతనికి సమాధిశిక్ష వేస్తారు. అంటే నిలువెత్తు గొయ్యి తవ్వి, కోడి రక్తంతో ఆ శవాన్ని తడిపి, జనం గోళ్లు, వెంట్రుకలు ఆ గోతిలో వేసి శవాన్ని కప్పెట్టడమట. అలా చేస్తే ఆ ఊళ్లో జనం పడిన గోసంతా ఆ ఆత్మ అనుభవిస్తుందట. అయితే ఇలాంటి శిక్ష వేసిన ఊరి మీద పగపడుతుంది తిరుపతి ప్రేతాత్మ. కొన్ని అవకాశాల్ని వాడుకుని సమాధిలోంచి లేచి ఊరి మీద పడుతుంది. ఆ ప్రేతాత్మని నిలువరించడానికి దైవశక్తి కావాలి. అదే శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే భక్తురాలి రూపంలో కదిలి వస్తుంది. ఆ తర్వాత జరిగేది దుష్టసంహారం.

ఈ కథని ఇలా సింపుల్ గా చెప్పుకున్నా, వివరంగా పాత్రలతో సహా చెప్పుకున్నా గుర్తొచ్చేది “అరుంధతి”. ఆ సినిమా నుంచి పూర్తిగా ఇన్స్పైర్ అయి తీసిన చిత్రమిది. ఊళ్లో భూతాలు వదిలించే ఒక ముస్లిం తాంత్రికుడు, కామాంధుడైన ప్రేతాత్మ, “ఒసేయ్ భైరవి…”, “పండి పండి పక్వానికొచ్చింది…” లాంటి అరుపుల్లాంటి డైలాగులు, హీరోయిన్ తల పగిలి రక్తం రావడం, ఆమె ఆయుధానికి ప్రేతాత్మ నశించడం…ఇలా అరుంధతిలో ఉన్నవన్నీ ఓదెల2 లో ఉన్నాయి.

అలాగని అరుంధతి స్థాయిలో ఈ ఓదెల2 ఉందని చెబితే “అరుంధతి”ని అవమానించినట్టే. కథనంలో గాంభీర్యం లేదు, సన్నివేశాల్లో బలం లేదు, డైలగుల్లో పటుత్వం లేదు. కానీ ఆ దోషాలు కనపడకుండా అజనీష్ లోకనాథ్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో శాయశక్తులా కవర్ చేసాడు.
టెక్నికల్ గా తీసుకుంటే పాటలు వీక్ గా ఉన్నాయి. ఇలాంటి చిత్రాల్లో ఉండాల్సిన బలం పాటల్లో. అజనీష్ ముందు నుంచీ పాటల్లో తన సత్తాని చాటుకొవట్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే తన డొమైన్ అన్నట్టుగా ఉంటోంది.

స్క్రీన్ ప్లే పరంగా చాలా బలహీనంగా ఉన్న చిత్రమిది. ప్రధమార్ధమంతా ప్రెడిక్టెబుల్ గా సాగుతూంటుంది. వరుసగా రెండు శోభనం రేపులు, మరణాలు చూసేసరికి రిపీటెడ్ గా అనిపించి ఉత్కంఠ పోతుంది.

పైగా అందరూ మూత్రవిసర్జనకి ఆ సమాధి దగ్గరకే ఎందుకు వెళ్తారో అర్ధం కాదు. దానికి తోడు, అదే మూత్ర విసర్జనలు చేసే సమాధి మీద భైరవి వచ్చి శూలాన్ని, నందుల్ని ప్రతిష్టించడాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకోవాలి?

వేంకటేశ్వరస్వామికి చిరునామా అయిన తిరుపతి పేరుని ఈవిల్ స్పిరిట్ కి పెట్టడమేంటి?, అందరినీ పట్టి ఆడించే ప్రేతాత్మ ముస్లిం భూతవైద్యుడుకి పట్టకపోవడమేంటి?

స్క్రీన్ ప్లే రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోపోతే చూసేవాళ్ల సెంటిమెంట్లు దెబ్బతినే అవకాశముంది.

డైలాగుల్లో కూడా దైవశక్తికి, ప్రేతాత్మకి మధ్యలో ఏవో చాలెంజులు పెలుతుంటాయి తప్ప ప్రేక్షకుల మనసుల్ని తాకవు. భైరవి నోట వెంట “నీ గుప్తాంగం గుంజి కోస్తా” అనే డైలాగ్ కాస్త అతిగానే ఉంది.

ఈ విషయాలు పక్కనపెడితే, భక్తులకి కావాల్సిన ఎపిసోడ్స్ చివర్లో కొన్ని ఉన్నాయి. గుడిలో నందీశ్వరుడు నడుచుకుంటూ బయటికి వచ్చేయడం, ఆకాశంలో శివుడు ఓదెల జనానికి దర్శనమివ్వడం, ఎక్కడో హిమాలయాల్లో సాధువులు ఓదెలలో జరుగుతున్న విషయాన్ని చర్చించుకోవడం..ఇవన్నీ లాజిక్కులకి అందని భక్తిపారవశ్యానికి చెందినవి. వాటికి కనెక్టైపోయేవాళ్లు కొందరుంటారు. ఆ సీన్లకి హాల్లో రెస్పాన్స్ బాగుంటుంది.

టెక్నికల్ గా పైన చెప్పుకున్నట్టు విషయాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎటొచ్చీ రచనలోనే లోపాలున్నాయి.

తమన్నా ఎంట్రీకి ఆవుల సీన్ ఎంచుకోవడం బాగానే ఉంది కానీ, దానిని చిత్రీకరించిన విధానం మరీ అతిగా ఉంది.

విజిల్స్ పడతాయనుకునో, జనంలో టెన్షన్ పెరుగుతుందనుకునో రాసుకున్న కొన్ని సీన్లకి జనం నుంచి నవ్వులు వినపడ్డాయి.. అంటే అనుకున్నదొక్కటి, అయినదొక్కటి అన్నమాట. ముఖ్యంగా ఒక ఏసీపీ అర్ధరాత్రి ఒక్కడూ శ్మశానంలో ఏ సెక్యూరిటీ లేకుండా కూర్చోవడం, మైకులు ఆగిపోవడం వల్ల శివపంచాక్షరీ మంత్రం వినపడక ప్రేతాత్మ శక్తి పుంజుకోవడం, ప్రతి వ్యక్తి సమాధి మీదనే మూత్రం వదలడం.. లాంటి సీన్లన్నీ మూడ్ కి సింక్ అవ్వలేదు.

తమన్నా నటన అద్భుతమని చెప్పడానికి లేదు. ఎప్పుడూ గ్లామర్ పాత్రల్లో కనిపించే ఆమె కాస్త గంభీరమైన పాత్ర పోషించి తన శైలిలో డైలాగులు చెప్పింది అంతే. ఆమె ఇమేజ్ ఈ సినిమాకి ఉపయోగపడుతుందేమో తప్ప, ఆమె ఇమేజ్ మేకోవర్ అయ్యేంతగా అయితే ఈ సినిమా లేదు.

వశిష్ట సింహలో ఈ విలన్ పాత్రకి కావాల్సినంత షార్ప్ లుక్కైతే లేదు. కానీ తన పని తాను చేసుకుపోయాడు.

హెబ్బా పటేల్ కొన్ని సీన్స్ లో ఓకే. అరుంధతిలో షిండేని గుర్తుతెచ్చే పాత్రలో మురళి శర్మ సరిపోయాడు. శ్రీకాంత్ అయ్యంగర్, శరత్ లోహితాశ్వ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేదు.

ఓదెల మొదటి భాగం చూడకపోయినా ఈ చిత్రాన్ని చూడొచ్చు. కథలో మిస్సయ్యేది ఏమీ ఉండదు. ఏదో కొత్తదనం ఆశించి చూస్తే మాత్రం భంగపాటు తప్పదు. అన్నీ ఎక్కడో చూసేసిన సీన్లలాగ, ఎప్పుడో పొందిన అనుభూతుల్లాగ ఉంటుంది. ఉన్నంతలో ఈ చిత్రం థియేటర్ సౌండ్ సిస్టం లో చూస్తేనే కొన్ని భాగాల్లోనైనా రక్తి కట్టే అవకాశముంది. మొత్తంగా చూస్తే ఇదొక వీక్ కథతో అల్లిన ప్రెడిక్టిబుల్ స్క్రీన్ ప్లే. “భక్తికి అర్థం త్యాగం” అంటూ ఒక డైలాగుంది. అంతటి త్యాగాలు కోరుకునే భక్తిని భక్తులు భరించగలరేమో కానీ, తెర మీద పొయెటిక్ జస్టిస్ కోరుకునే ప్రేక్షకులు భరించలేరు. భక్తుల బాధకి దేవుడు మరీ ఆలశ్యంగా చేయకుండా దిగిరావాలంతే…సినిమా కథల్లో ఇదే కోరుకునేది.

ఇంటర్వెల్ బ్యాంగ్ బలహీనంగా ఉండి, క్లైమాక్స్ హనుమాన్ ని, కాంతారాని చూసి అనుకరించినట్టుగా ఉంది. భక్తిరస చిత్రంలో కంటి ముందు కదలాడే దృశ్యం మనసుని తాకి భక్తి పారవశ్యం కలిగించకపోతే ఫలితమేముంటుంది? అలాంటి ఫలితాలు అక్కర్లేదనుకునే వాళ్లకే తప్ప తక్కిన వాళ్లకి కష్టమనిపించే చిత్రమిది. అన్నట్టు పార్ట్ 3 కూడా ఉందని చివర్లో ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా అంచనాలతో విడుదలైన “ఓదెల 2” డీలా పడింది.

బాటం లైన్: ఓ “డీలా”

14 Replies to “Odela 2 Review: మూవీ రివ్యూ: ఓదెల 2”

  1. అసలు ఒక నార్త్ ఫేస్ అయిన తమన్నా ని ఈ సినిమాకి తీసుకోవటమే పెద్ద మైనస్. శక్తి పాత్రలకి సౌత్ వాళ్లు సూట్ అయినట్లు ఆ నార్త్ ఫేసులు సెట్ అవ్వవు. ఒక కే.ఆర్. విజయ..ఒక రమ్యకృష్ణ, ఒక అనుష్క.. ఇలా ఇవి మనకే సాధ్యం

  2. ఎసుంటి ఎసుంటి సిన్మాలు జేస్తుండె .. చిన్న చిన్న రిబ్బన్లు కట్టుకుని డాన్సులేస్తుండె .. నిండా దుప్పటి కప్పేసి ఆగం పట్టిస్తిరి కదరా మా మిల్కీ కి

  3. నీ రివ్యూ 2.5 అయితే సినిమా “బానే వుంది, ఒకసారి టైం పాస్ కి చూడచ్చు” అని నా అనుభవం. ఇప్పుడు కొంచెం అనుమానం గా వుంది, సినిమా చెత్త అయితే, 2.5 ఎలా ఇచ్చావ్? ఇంత వరకు నీ రివ్యూ చూడకుండా చూసిన ప్రతి చెత్త సినిమాకి, తర్వాత 100% నీ రివ్యూ మ్యాచ్ అయ్యింది. కొంచెం స్టాండర్డ్ మిస్ అవుతోందేమో చూసుకుని సరి చేసుకో

  4. ippude Cinema chusa , director intha cheap fellow Anukole, Vasuki cinema thiyyadam chethakakapothe intlo kurchovali, hindhuvula manobhavaltho adukokudadhu

Comments are closed.