సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ మెగామూవీ. ఈ సినిమాకు ఖర్చు ఎంత అయింది అన్నది అతి కొద్దిమందికి తప్ప ఎవరికీ సరైన ఫిగర్ తెలియదు. నిర్మాత రామ్ చరణ్, హీరో మెగాస్టార్ చిరంజీవి, ప్రొడక్షన్ లో ఇన్ వాల్వ్ అయిన వాకాడ అప్పారావు, ప్రవీణ్, ఇలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. బయటకు మాత్రం రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ రెమ్యూనిరేషన్ తో కలిసి ఇంత అయిందని, అంత అయిందని రకరకాల గ్యాసిప్ లు. 240 కోట్లు కాదు, మూడు వందల కోట్లు దాటిందని ఇలా రకరకాల కథనాలు వున్నాయి. విదేశాల్లో చేసిన ఒక ఎపిసోడ్ కే 50 కోట్లు ఖర్చయిందని, అది మాత్రం పక్కా అని తెలుస్తోంది.
ఇదిలావుంటే ప్రొడక్షన్ లో నిధుల విచ్చలవిడి ఖర్చు జరిగి వుంటుందని, అంత ఖర్చు అయ్యే అవకాశం లేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా కొన్ని విషయాలు ఫ్రస్తావనకు వస్తున్నాయి. నయనతారను అయిదు కోట్ల రెమ్యూనిరేషన్ కు మాట్లాడరన్నది ఒకటి. అంత రెమ్యూనిరేషన్ అనవసరం అని, మరి అలా ఎందుకు చేసారో తెలియడం లేదని, చిత్రంగా తమన్నాకు మాత్రం కోటి రూపాయల రెమ్యూనిరేషన్ నే అయిందని టాక్ వుంది.
అలాగే సుదీప్ కు కూడా అయిదుకోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ కారణంగా కూడా వ్యయం విపరీతంగా పెరిగిందన్న టాక్ ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. విపరీతంగా సెట్ లు వేయించారని, వాటికి లెక్కకు మించి ఖర్చు చేయించేసారని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే రామ్ ఛరణ్ పేరుకు నిర్మాత అయినా, హీరోగా తన పనుల్లో బిజీగా వుండడం వల్ల, కిందవాళ్లు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేసారేమో అన్న అనుమానం ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.
లాభమా నష్టమా?
ఖర్చు సంగతి అలావుంచితే సైరా ప్రాజెక్టు మెగాఫ్యామిలీకి, నిర్మాతగా రామ్ చరణ్ కు లాభమా నష్టమా అన్నది చూస్తే, నష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సినిమా అమ్మకాల సంగతి చూస్తే, ఆంధ్ర తెలంగాణ కలిపి 110 కోట్ల మేరకు విక్రయించారు. కర్ణాటక 26 కోట్లకు ఇచ్చారు. ఓవర్ సీస్ 15 కోట్లకు అమ్మారు. నాన్ థియేటర్ రైట్స్ 75 కోట్ల మేరకు వచ్చాయి. అంటే అన్నీకలిపి 226 కోట్ల మేరకు అన్నమాట.
బాలీవుడ్, కేరళ, తమిళనాడు ఓన్ రిలీజ్ అక్కడ వచ్చింది లేదు. ఖర్చులే ఎక్కువ. బాలీవుడ్ ఖర్చులకు అక్కడ ఇంకా రావాల్సి వున్న నాన్ థియేటర్ హక్కులు సరిపోతాయి అనుకున్నా, మొత్తంమీద 226 కోట్లు వచ్చినట్లు.
మరి సినిమాకు 240 కోట్లే అయ్యాయి అనుకున్నా 14 కోట్లు ఇంకా కొరత వుంది. పైగా ఇప్పుడు తెలుగులో పరిస్థితి చూడాల్సి వుంది. ఒకవేళ అదృష్టం బాగుండి బయ్యర్లు అంతా బయటపడిపోతే ఫరవాలేదు. లేదూ అంటే జీఎస్టీలు కట్టాల్సి వస్తుంది. మళ్లీ అది కొన్ని కోట్లు ఖర్చు.
దానా దీనా చూసుకుంటే తండ్రికి మంచి సినిమా తీసి ఇచ్చానన్న తృప్తి మిగిలి, అందుకు బదులుగా కొన్ని కోట్ల ఖర్చు రామ్ చరణ్ కు మిగిలేలా వుంది.