ఓ అట్టర్ ఫ్లాప్ సినిమాకి విజయవంతమైన వందో రోజు అనే పోస్టర్ వేసుకొన్నారు బాపు`రమణలు. అయితే చివర్లో తొంభై రోజుల ముందు విడుదలై ఉంటే… అనే క్యాప్షన్ కూడా పెట్టారు. అది బాపు రమణల చమత్కారం. ఇలాంటి ఎకసెక్కాలే చేస్తున్నాడు విష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఈ సినిమా విడుదలై మూడు రోజులు. అయితే రూ. 25 కోట్లు సాధించే దిశగా పయనిస్తోంది అంటూ ప్రెస్ నోట్లు పంపి హడావుడి చేస్తున్నారు. ఆ పాతిక కోట్ల లెక్కలో ఇప్పటికి ఏ మేరకు సాధించింది అన్న ఎలాంటి డిటైల్స్ లేవు. కాకపోతే త్వరలో పాతిక కోట్లు అంటున్నారు. అంటే మరో పది రోజులకా..? లేదంటే నెల రోజులకా..? లేదంటే సంవత్సరానికా? అనే క్లారిటీ ఏమాత్రం లేదు.
ఈ సినిమా టాక్ బాగున్నా వసూళ్లు అంతంతమాత్రమే. ఓ ఊపేస్తోంది అని చెప్పుకుంటున్న నైజాంలో ఇప్పటికి వచ్చింది లక్షల్లోనే అని ట్రేడ్ వర్గాల బోగట్టా. మరి ఈ లక్షలు, కోట్లు ఎప్పటికి అవుతాయో, అవి పాతిక మేరకు ఎలా చేరుకుంటాయో వారికే తెలియాలి. ఏ లెక్కన పాతిక కోట్లో విష్ణుకే తెలియాలి. ఈ అంకెల పిచ్చి పెద్ద హీరోలకే అనుకొంటే ఇప్పుడు విష్ణులాంటి వాళ్లు కూడా తయారయ్యారన్నమాట.
నిజానికి ఈ సినిమాను నైజాంకు మూడున్నర నుంచి నాలుగు కోట్లకు అడిగినప్పుడు మంచు కుటుంబం ఆరు కోట్లు కావాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆ అమౌంట్ విని, ఈ సినిమా చూసి, డిస్ట్రిబ్యూటర్లు తెల్లముఖం వేసి వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా తాము అనుకున్న టార్గెట్ మేరకు రాని ఏరియాలన్నీ ఇప్పుడు మంచు వారే విడుదల చేసుకున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమా నిర్మాణానికి 16కోట్లు ఖర్చయిందని విష్ణు చెబుతున్నట్లు తెలుస్తోంది.
కానీ సినిమా చూస్తే అంత సీన్ కనిపించడం లేదు. సీమ ప్రాంతంలోని కాస్త అవుట్ డౌర్, మోహన్‌బాబుకు చెందిన గంధర్వ మహల్లోనే తొంభై అయిదు శాతం సినిమా చుట్టేసారు. దర్శకుడు హై రేంజ్ కాదు. ఫొటోగ్రాఫర్, సంగీతం, ఎడిటింగ్. కాస్త స్టార్ కాస్ట్. అనుభజ్ఞులు చెప్పేదేమిటంటే మహా అయితే పది కోట్లు అయి వుండొచ్చని. పోనీ పెరిగిన టిక్కెట్ల ధరల పుణ్యమా అని ఆ పది కోట్లయిన వచ్చేస్తే..మళ్లీ మరో కిచిడీ కథతో, డి…టైటిల్ సినిమా ఒకటి వచ్చే అవకాశం వుంటుంది.