మీకు మీరే.. మాకు మేమే

ఈ ఏడాది పాతిక మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. అదే విధంగా కొన్ని షాకింగ్ విడాకులు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది పాతిక మందికి పైగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. అదే విధంగా కొన్ని షాకింగ్ విడాకులు కూడా ఉన్నాయి. ఎవ్వరూ ఊహించని విడాకుల కేసు మాత్రం ఏఆర్ రెహ్మాన్, సైరాబానుదే.

29 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఏఆర్ రెహ్మాన్, తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇదే విషయాన్ని సైరా కూడా నిర్థారించారు. ఆ తర్వాత రెహ్మాన్ పై చాలా విమర్శలొస్తే.. తిరిగి సైరా బానూనే అతడికి అండగా నిలిచారు. రెహ్మాన్ కు వ్యతిరేకంగా కథనాలు ఆపాలని, మా ఆయన బంగారం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.

కొన్నాళ్లుగా తన భార్యకు దూరంగా ఉంటున్న తమిళ హీరో జయం రవి కూడా ఈ ఏడాది తన విడాకుల విషయాన్ని ప్రకటించాడు. “ఎన్నో తర్జనభర్జనలు పడ్డాను. ఇంకెన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి ఆర్తితో నా వైవాహిక జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను ఇకపై ఒంటరిని” అంటూ ప్రకటించాడు.

అన్ని కేసుల్లో జరిగినట్టుగానే జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారంపై కూడా ఆ తర్వాత వివాదాలు ముసురుకున్నాయి. 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట విడిపోవడంపై చాలా కథనాలు తెరపైకొచ్చాయి. అయితే ఆ తర్వాత జయం రవి, ఆర్తి తమ విడాకుల వ్యవహారంపై బహిరంగ వేదికల్లో స్పందించడం మానేశారు.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సైంధవి కూడా షాకిచ్చారు. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు జీవీ ప్రకాష్ కుమార్ ప్రకటించాడు. సైంధవితో చర్చించి, పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు జీవీతో పాటు, సైంధవి విడివిడిగా సోషల్ మీడియాలో తమ విడాకుల విషయాన్ని బయటపెట్టారు.

ధనుష్-ఐశ్వర్య విడిపోయి చాన్నాళ్లయింది. అయితే ఈ ఏడాది మాత్రమే వాళ్లకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. ఈ గ్యాప్ లో వాళ్లిద్దరూ తిరిగి కలవబోతున్నట్టు ప్రచారం నడిచింది. కానీ విడిపోవడానికే ఇద్దరూ మొగ్గుచూపారు.

ఇషా డియోల్, ఊర్మిళ కూడా ఈ ఏడాది విడిపోయిన సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు. బాలీవుడ్ లెజెండ్స్ ధర్మేంధ్ర-హేమామాలిని కూతురు ఇషా డియోల్, తన 12 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. భర్త, వ్యాపారవేత్త భరత్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు.

ఇక ఊర్మిళ కూడా మళ్లీ సింగిల్ అయిపోయింది. మెహిసిన్ అక్తర్ తో 8 ఏళ్లు కాపురం చేసి, అతడి నుంచి విడిపోయింది. అయితే అందరిలా వీళ్లు తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అలా విడిపోయారంతే.

ఇలా చాలామంది ప్రముఖులు ఈ ఏడాది విడాకులు తీసుకొని, తిరిగి సింగిల్ అయిపోయారు. అటు అంతర్జాతీయంగా చూసుకుంటే, జెన్నిఫర్ లోపెజ్, బ్రిట్నీ స్పియర్స్, కిమ్ కర్దాషియన్, మేగన్ ఫాక్స్ లాంటి ప్రముఖులు కూడా 2024లో విడాకులు తీసుకున్నారు.

3 Replies to “మీకు మీరే.. మాకు మేమే”

Comments are closed.