జీవితాన్ని ఒకొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎవరెలా ఎంజాయ్ చేస్తారో చెప్పడం కష్టం. కొందరు విదేశాలకు తమకిష్టమైన వారితో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తారు. మరికొందరేమో స్వదేశంలోనే కశ్మీర్ లాంటి టూరిజం ప్రాంతాలకు వెళ్లి మంచుకొండల్లో చలితో చెలగాటం ఆడుతూ పరవశిస్తారు. మరికొందరేమో తమకిష్టమైన వ్యక్తులతో గంటల తరబడి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆనందం పొందుతుంటారు.
కానీ బాలీవుడ్ నటి ఆలియాభట్ ఎంజాయ్ చేయడంలో తన రూటే సపరేటు అంటోంది. బాలీవుడ్‌లో ఆలియాభట్, రణబీర్‌కపూర్ ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్న సెలబ్రిటీల జాబితాలో చేరిపోయారు. మంచీచెడుతో నిమిత్తం లేకుండా సినీ అభిమానుల నోళ్లలో తమ పేర్లు నానుతూ ఉంటూ చాలనే రీతిలో వారు ఉంటున్నారు.
త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా బాలీవుడ్ కోడై కూస్తోంది. వీళ్లిద్దరూ కలిసి ‘బ్రహ్మాస్త్ర ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఈ సినిమా విడుదలైన వెంటనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి వార్తలపై ఆలియాభట్ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని…మీడియా ఆమెను నేరుగా ప్రశ్నించింది.
రణబీర్‌తో పెళ్లిపై ఆలియాభట్ తనదైన శైలిలో స్పందించి ‘గడుసు’ పిల్లే అనిపించుకొంది. ‘నాపై ఎప్పుడు ఎలాంటి పుకార్లు వస్తాయో నాకే తెలియదు. ప్రతి మూడు వారాలకోమారు పెళ్లి తేదీల గురించి వార్తలు వినిపిస్తాయి. దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇలాంటి పుకార్లను వినోదంగా భావిస్తాను. అందులో వినోదం తప్ప మరేం ఉండదు’ అని తన అభిప్రాయాన్ని ఏ మాత్రం తడుముకోకుండా చెప్పిందా బాలీవుడ్ అమ్మడు.
సహజంగా పెళ్లి పుకార్లపై హీరోయిన్లు సీరియస్ కావడం చూస్తుంటాం. సోషల్ మీడియాలో తనపై అలా రాశారు, ఇలా రాశారంటూ ఫైర్ అవుతున్న వాళ్లనే ఎక్కువగా చూశాం. కానీ ఎంజాయ్ ఎలా చేయాలో ఆలియాభట్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సిందే అన్నమాట.