మార్చి నెల బాక్సాఫీస్ ముగిసింది. మొత్తంగా చూస్తే, టిల్లూ స్క్వేర్ మాత్రమే నిలబడింది. ఇప్పుడు ఏప్రిల్ బాక్సాఫీస్ మొదలైంది. మరి ఈ నెల నిలబడే సినిమాలేంటి?
లెక్కప్రకారం ఈ నెలలో దేవర సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ సినిమా వాయిదా పడింది. దీంతో ఆ తేదీకి ఫ్యామిలీ స్టార్ వస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ నెలలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇదొక్కటే. గీతగోవిందం సక్సెస్ తర్వాత విజయ్-పరశురామ్ కలిసి చేస్తున్న మూవీ కావడం, దిల్ రాజు బ్యానర్ పై వస్తుండడం, లక్కీ హ్యాండ్ మృణాల్ హీరోయిన్ గా నటించడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరిగింది.
ఈ మూవీతో పాటు భరతనాట్యం, మంజుమ్మల్ బాయ్స్ అనే మరో రెండు సినిమాలు కూడా ఇదే వారం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో మంజుమ్మల్ బాయ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మలయాళంలో ఈ మూవీ ఓ సంచలనం. అత్యంత వేగంగా వంద కోట్లు కలెక్ట్ చేసిన తొలి మలయాళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తోంది.
రెండో వారంలో ఏకంగా 7 సినిమాలు వస్తున్నాయి. వీటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగనీతులు, లవ్ గురు లాంటి సినిమాలున్నాయి. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా అదే సెటప్ తో వస్తోంది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. అంజలి లీడ్ రోల్ పోషించింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఓ సినిమా రిలీజ్ చేసిన సుహాస్, ఈ నెలలో శ్రీరంగనీతులు సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకొస్తున్నాడు.
మూడో వారంలో.. శశివదనే, పారిజాతపర్వం సినిమాలొస్తున్నాయి. ఈ రెండూ తమ ప్రచారం చిత్రాలతో ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలే అయినప్పటికీ, ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి.
నాలుగోవారంలో.. లవ్ మీ, రత్నం సినిమాలొస్తున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి బలగం లాంటి సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా లవ్ మీ. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ హారర్ లవ్ సబ్జెక్ట్ తో పాటు, విశాల్ నటించిన రత్నం సినిమా కూడా ఇదే వారంలో థియేటర్లలోకి వస్తోంది.
ఇదే నెలలో ‘ఆ ఒక్కటి అడక్కు‘ సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లరి నరేష్ హీరోగా మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఇంకా కొత్త విడుదల తేదీ ప్రకటించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే, ఏప్రిల్ నెలలో క్రేజ్ తో వస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్ మాత్రమే. ఊహించని విజయాలు ఏమైనా నమోదైతే అందరికీ ఆనందమే.